తెనాలి-విజయవాడ రోడ్డుపై టీడీపీ శ్రేణుల నిరసన
ABN , First Publish Date - 2023-01-26T00:52:41+05:30 IST
ఇది రోడ్డా... గుంతలమయంగా మారి డొంకలను తలపిస్తుందంటూ టీడీపీ శ్రేణులు తెనాలి-విజయవాడ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

గుంతలమయమైన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న టీడీపీ శ్రేణులు
తెనాలి రూరల్, జనవరి 25 : ఇది రోడ్డా... గుంతలమయంగా మారి డొంకలను తలపిస్తుందంటూ టీడీపీ శ్రేణులు తెనాలి-విజయవాడ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తెనాలి నుంచి మంగళగిరి, విజయవాడ వెళ్లేందుకు ఉన్న ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. ప్రభుత్వం దీనిని పట్టించుకున్న దాఖలాలే లేవని ఫలితంగా రోడ్డు ప్రయాణంలో ఎందరో ప్రమాదాల బారిపడుతున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు కేసన కోటేశ్వరరావు ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి మూడున్నరేళ్లు గడుస్తున్నా ఈ రోడ్డు మరమ్మతులు లేదా నూతన రోడ్డు వేయించలేదని, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే శివకుమార్ తెనాలి పట్టణం నుండి విజయవాడ మార్గాన్ని నాలుగులైన్ల రోడ్డుగా అభివృద్ధి చేస్తామని గొప్పగా చెప్పారని ఆరోపించారు. ట్యాంక్ బండ్ నిర్మాణానికి ముందుకు వచ్చిన ఎమ్మెల్యేకి నిత్యం వేల వాహనాలు తిరిగే తెనాలి-విజయవాడ రోడ్డు కనిపించకపోవడం విడ్డూరంగా ఉందని టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు కంచర్ల ఏడుకొండలు ఆరోపించారు. విగ్రహాలు ఎప్పుడైనా ఏర్పాటు చేసుకోవచ్చని ముందు ప్రజలకు సురక్షిత ప్రయాణం చేసేలా రోడ్డు పనులు చేపట్టాలన్నారు. మూడున్నరేళ్లు పాలనలో ప్రజలను ఉద్దరించేశామని గొప్పలు చెబుతున్న నాయకులకు అదే ప్రజలు రోడ్లు సరిలేక ప్రయాణం ప్రమాదకరంగా మారి అవస్థలు పడుతుంటే కంటికి కనిపించకపోవడం దారుణమని నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షుడు రావిసూర్యకిరణ్తేజ విమర్శించారు. తక్షణమే తెనాలి-విజయవాడ రోడ్డును బాగుచేయించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.