ప్రైవేటు విద్యపై పగ!

ABN , First Publish Date - 2023-02-07T03:10:27+05:30 IST

ప్రమాణాలు పాటించడం లేదనే కారణంతో ఎప్పుడుపడితే అప్పుడు కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామంటూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న హడావిడి విద్యా వ్యవస్థను మరింత దిగజారుస్తోంది. నిజంగా ప్రమాణాలు లేని కాలేజీలు ఈపాటికే మూతపడాల్సింది.

ప్రైవేటు విద్యపై పగ!

ప్రమాణాలు, నాణ్యత పేరిట కాలేజీలపై వేటు

ఇప్పటికే భారీగా తగ్గిపోయిన డిగ్రీ, పీజీ అడ్మిషన్లు

నెలలు గడిచిపోతున్నా మొదలవని బీఈడీ ప్రవేశాలు

ఏకంగా లక్ష మందికిపైగా విద్యార్థులు డిగ్రీకి దూరం

పీజీ ప్రవేశాలపై రీయింబర్స్‌మెంట్‌ రద్దు ప్రభావం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రమాణాలు పాటించడం లేదనే కారణంతో ఎప్పుడుపడితే అప్పుడు కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామంటూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న హడావిడి విద్యా వ్యవస్థను మరింత దిగజారుస్తోంది. నిజంగా ప్రమాణాలు లేని కాలేజీలు ఈపాటికే మూతపడాల్సింది. కానీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల పాటు వాటిని కొనసాగించిన ప్రభుత్వం... ఇప్పుడు హఠాత్తుగా ప్రమాణాలు, నాణ్యత అంటూ ప్రైవేటు విద్యా సంస్థలపై కత్తిగట్టేలా చర్యలకు దిగుతోంది. ఈ విషయంలో సర్కారు చెప్పేదే నిజమైతే విద్యా సంవత్సరం ముగిశాక చర్యలు చేపట్టాలి. అలాకాకుండా విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక, అడ్మిషన్లు చేపట్టేబోయే ముందు హడావిడిగా తీసుకుంటున్న వేటు నిర్ణయాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి.

డిగ్రీ అడ్మిషన్లతో మొదలు

ఈ విద్యాసంవత్సరంలో ఎప్పుడూ లేనివిధంగా డిగ్రీ అడ్మిషన్లలో ఉన్నత విద్యాశాఖ తీవ్ర జాప్యం చేసింది. కాలేజీల అఫిలియేషన్లకు ఆన్‌లైన్‌ విధానం తేవడంతో అడ్మిషన్లు ఆలస్యమయ్యాయి. విద్యా సంవత్సరం ముగిసే సమయంలో చేపట్టాల్సిన సంస్కరణలను ఓ ఉన్నతాధికారి అత్యుత్సాహంతో అడ్మిషన్ల ముందు అమలు చేశారు. దీంతో ఈసారి డిగ్రీ అడ్మిషన్లు డిసెంబరు వరకూ కొనసాగాయి. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు జనవరిలోనూ అడ్మిషన్లు నిర్వహించారు. కన్వీనర్‌ కోటా అడ్మిషన్లకు ముందు 140 డిగ్రీ కాలేజీలను జీరో అడ్మిషన్ల కేటగిరీలో పెట్టారు. దీనిపై ఆయా యాజమాన్యాలు కోర్టులకు వెళ్లడంతో ఇంకా జాప్యం చోటు చేసుకుంది. ఫలితంగా గతేడాది డిగ్రీలో 2.6లక్షల మంది చేరితే ఈసారి ఆ సంఖ్య 1.45 లక్షలకే పరిమితమైంది. ఏకంగా లక్ష మందికిపైగా డిగ్రీకి దూరమయ్యారు.

ఇంటర్‌లో ఇష్టారాజ్యం

గతేడాది ఇంటర్‌లో ఉత్తీర్ణత దారుణంగా పడిపోయింది. గతంలో ఎప్పుడూలేని విధంగా మొదటి సంవత్సరంలో 54ు, రెండో సంవత్సరంలో 61ు మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అప్పుడైనా అప్రమత్తం కావాల్సిన ప్రభుత్వం... ఈ ఏడాది తరగతులు ప్రారంభమైన రెండు నెలల తర్వాత 174 కాలేజీల్లో ప్రమాణాలు లేవంటూ చర్యలకు ఉపక్రమించింది. దాదాపు 20వేల మంది విద్యార్థుల చదువులతో సంబంధం లేదన్నట్టుగా అక్కడ తరగతులు ఆపేయాలని నిర్ణయం తీసుకుంది. అక్కడి విద్యార్థులను ఇతర కాలేజీలకు మార్చాలని ఆదేశించింది. దీనిపై కాలేజీలు కోర్టుకు వెళ్లడంతో చర్యలు ఆగిపోయాయి. వేల మంది విద్యార్థుల తరలింపులో సాధ్యాసాధ్యాలను పట్టించుకోకుండా కాలేజీలపై వేటు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని విమర్శలు వెల్లువెత్తాయి.

బీఈడీ... ఏ బ్యాచ్‌?

ప్రస్తుత విద్యా సంవత్సరంలో బీఈడీ అడ్మిషన్లు ప్రారంభమే కాలేదు. ఇటీవల అడ్మిషన్లకు షెడ్యూలు ఇచ్చినా... కోర్టు ఆదేశాలతో వాయిదా పడింది. దీంతో మొట్టమొదటిసారి బీఈడీ విద్యా సంవత్సరం కేలండర్‌ ఇయర్‌లోకి మారిపోయే పరిస్థితి వచ్చింది. ఫిబ్రవరి వచ్చినా ఇంతవరకూ 2022-23 అడ్మిషన్లు లేకపోగా, 2023-24 విద్యా సంవత్సరం మే నెలలో ప్రారంభం కానుంది. దీంతో విద్యార్థులు అసలు ఏ సంవత్సరంలో కోర్సు చదవాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ప్రమాణాలు పాటించడం లేదని 120 బీఈడీ కాలేజీలపై వేటు వేసిన ప్రభుత్వం వాటి అఫిలియేషన్‌ పునరుద్ధరించకుండా నిలిపివేసింది. దీంతో బీఈడీ సీట్లు దాదాపు 10వేలు తగ్గిపోయాయి. విద్యా సంవత్సరం ముగియాల్సిన సమయంలో ఈచర్యలు చేపట్టడంతో విద్యార్థులు డైలమాలో పడిపోయా రు.

అడ్మిషన్లు పెరిగేదెలా?

అడ్మిషన్లలో ఏటా కనీసం పది శాతం వృద్ధి నమోదవడం సహజం. అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు తగ్గిపోతున్నాయి. కాలేజీలపై వేటు హడావిడితో డిగ్రీలో విద్యార్థులు తగ్గిపోగా, రీయింబర్స్‌మెంట్‌ రద్దుచేయడంతో పీజీ కోర్సుల్లో విద్యార్థులు తగ్గిపోతున్నారు. ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం ప్రైవేటు విద్యా సంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సగానికి సగం మంది కూడా లేని విద్యార్థులతో కాలేజీల నిర్వహణ ఎలాగని యాజమాన్యాలు వాపోతున్నాయి.

ఫీజుల్లో కోతలు

రాష్ట్రంలో పాఠశాల విద్య తప్ప ఇంటర్‌, ఉన్నత విద్యలో ప్రైవేటుగానే ఎక్కువమంది చదువుతున్నారు. కానీ జగన్‌ ప్రభుత్వం తొలినుంచీ ప్రైవేటు విద్యా సంస్థలపై వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజుల్లో కోతలకు దిగింది. మొత్తం ఫీజు రీయింబర్స్‌ చేస్తామని గొప్పలకు పోయిన ప్రభుత్వం... భారం తగ్గించుకునేందుకు ఫీజులు తగ్గించేసింది. రూ.లక్షకు పైగా ఉన్న ఇంజనీరింగ్‌ గరిష్ఠ ఫీజులను రూ.70వేలకు తగ్గించింది. 2020-21లో కొవిడ్‌ పేరుతో ఒక క్వార్టర్‌ ఫీజులు ఇవ్వకుండా కాలేజీలను ముప్పతిప్పలు పెట్టింది. కాలేజీలు నడవాలంటే ఆ ఫీజులు మర్చిపోవాలని ప్రభుత్వంలోని పెద్దలు హెచ్చరించారని యాజమాన్యాలు వాపోయాయి. ఇక ఫీజులను కాలేజీల ఖాతాల్లో కాకుండా, తల్లిదండ్రుల ఖాతాల్లోకి మార్చింది. అది కూడా క్వార్టర్‌ ముగిసిన వెంటనే వేస్తామని చెప్పి, ఏడాది ముగిశాక వేస్తోంది. దీంతో ఫీజులు వసూలు చేసుకోవడం కాలేజీలకు పెద్ద సవాలుగా మారింది.

ఇంటర్‌ తరగతులు ప్రారంభమై రెండు, మూడు నెలలు గడిచాక కాలేజీలను రద్దుచేస్తే వాటిలో చదివే విద్యార్థులు ఎక్కడికి పోవాలి? అదీ 174 కాలేజీలపై ఒక్కసారిగా వేటు వేస్తే వేలాది మంది విద్యార్థుల చదువులు ఏం కావాలి? మరో నాలుగు రోజుల్లో డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం కావాల్సిన సమయంలో 140 కాలేజీల్లో అడ్మిషన్లు లేవంటే విద్యార్థులు ఎక్కడ చేరాలి? అప్పటివరకూ సొంతూళ్లోనే చదవాలని ఆశించిన వారు అప్పటికప్పుడు ఎటు పరిగెత్తాలి?... విద్యారంగంలో ఇటువంటి అనాలోచిత చర్యలకు రాష్ట్రంలో కొదవే లేదు.

చెప్పినట్లు వినకుంటే వేటే

కాలేజీల విషయంలో జగన్‌ ప్రభుత్వం తరచుగా వేటు అనే పదాన్ని ఉపయోగిస్తోంది. ప్రమాణాలు పాటించడంతో పాటు ప్రభుత్వం చెప్పినట్లుగా వింటేనే ఇక్కడ ఉంటారనే వైఖరి ప్రదర్శిస్తోంది. ఇప్పటికే ఫీజులు తగ్గిపోవడంతో నష్టాలు వస్తున్నాయని లబోదిబోమంటున్న యాజమాన్యాలకు ఈ తీరుతో దినదినగండంగా మారింది. గత మూడేళ్లకు నిర్ణయించిన ఫీజులు ముగిసిపోతున్నందున వచ్చే ఏడాది నుంచి కొత్త ఫీజులు అమల్లోకి రాబోతున్నాయి. మళ్లీ దాదాపు పాత ఫీజులతోనే సర్కారు మమ అనిపిస్తుందేమోనన్న ఆందోళన నెలకొంది. అదే జరిగితే పక్క రాష్ర్టాలకు వెళ్లిపోవాలనే ఆలోచన కూడా కొన్ని యాజమాన్యాల్లో ఉంది.

Updated Date - 2023-02-07T03:10:30+05:30 IST