CM Decisions : గోరుచుట్టు.. జగన్‌ పోటు!

ABN , First Publish Date - 2023-02-02T03:22:40+05:30 IST

గోరుచుట్టుపై రోకటి పోటు’ అంటారు కదా! వైసీపీ పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది.

CM Decisions : గోరుచుట్టు.. జగన్‌ పోటు!

రహస్య నివేదికలో సీరియస్‌ ‘ఇష్యూ’లు

సీఎం నిర్ణయాలపై అసంతృప్తితో జనం

ఉద్యోగ, ఉపాధ్యాయులు గరంగరం

ఏజెన్సీలో పోలవరం, జీవో 52 దెబ్బ

వైసీపీకి తగలనున్న ధరాఘాతం

విశాఖ ఉక్కు, గంగవరం ప్రభావం

నివేదికలో అనేక కీలకాంశాలు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘గోరుచుట్టుపై రోకటి పోటు’ అంటారు కదా! వైసీపీ పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు, అంతర్గత కుమ్ములాటలు, వారిపై వ్యతిరేకత గోరుచుట్టులా వేధిస్తుంటే... జగన్‌పాలన, ఆయన అడ్డదిడ్డమైన నిర్ణయాలు, అర్థంలేని విధానాలు రోకటిపోటులా పరిణమించాయి. వచ్చే ఎన్నికల్లో అనేక అంశాలు కీలకమైన ప్రభావం చూపిస్తాయని జగన్‌ చేతికి అందిన ‘రహస్య నివేదిక’ స్పష్టం చేసింది. ఈ అంశాలన్నింటికీ ముఖ్యమంత్రిగా జగనే బాధ్యుడు! అధికారంలోకి వచ్చీరాగానే ‘ప్రజావేదిక’ కూల్చివేతతో తన పాలన ఎలా ఉంటుందో స్పష్టమైన సంకేతాలు పంపించారు. అమరావతిని అటకెక్కించారు. శరవేగంగా సాగుతున్న పోలవరం పనులకు బ్రేకులు వేశారు. రివర్స్‌ పీఆర్సీ ప్రకటించి, ఉద్యోగుల నిరసనలపై ఉక్కుపాదం మోపారు. టీచర్లను ‘శత్రువర్గం’గానే భావిస్తున్నారు. పల్లె నిధులు లాగేసుకుంటూ సొంత పార్టీ సర్పంచులనూ వేధిస్తున్నారు. అభివృద్ధి పనుల్లేవ్‌, బిల్లుల చెల్లింపుల్లేవంటూ మునిసిపాలిటీల్లో సొంత కౌన్సిలర్లే విరుచుకుపడుతున్నారు. ఒకటా... రెండా! ఇలా ఎన్నెన్నో ‘రోకటి పోట్లు’! కీలక ప్రభుత్వ విభాగం వీటిలోని అనేక అంశాలను తన ‘రహస్య నివేదిక’లో పొందుపరిచింది. దానిని సీఎం చేతికే అందించింది. ఆ నివేదికలోని అంశాలు...

ధరాభారం...

నిత్యావసర ధరలు పెరగడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఉప్పు, పప్పులు, బియ్యం, వంటనూనెతోపాటు పెట్రోల్‌, డీజీల్‌ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గిస్తే నిత్యావసరాల ధరల నుంచి ఉపశమనం లభిస్తుంది.

జీఓ 52తో గిరిజనులు గుస్సా

బొంతో ఒరియా కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలన్న అంశంపై అధ్యయనం చేయడానికి సర్కారు ఇచ్చిన జీఓ 52 వైసీపీకి నష్టం చేకూర్చనుంది. ఏజెన్సీ పరిధిలోని నియోజకవర్గాల్లో స్థానిక గిరిజనులు ఈ ఉత్తర్వులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పాలకొండ, కురుపాం, సాలూరు, పాడేరు, రంపచోడవరం, నెల్లూరు ఐటీడీఏ, ఇతర గిరిజన ప్రాంతాల్లో ఇది వైసీపీపై ప్రభావం చూపించనుంది.

ఆగ్రహంగా ఉద్యోగులు, టీచర్లు

ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, కాకినాడ వంటి ప్రాంతాల్లో ఉద్యోగుల ఆందోళనలు ఉధృతంగా ఉన్నాయి. వీటి ప్రభావం సామాన్యులు, విద్యావంతులపై బలంగా ఉంటోంది. ఉద్యోగుల వేతన సవరణ, నిధుల మళ్లింపు అంశాలపై చేస్తున్న ఆందోళనలు మధ్యతరగతి వారిపై ప్రభావం చూపిస్తున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత టీడీపీకి బాగా కలిసొస్తుంది.

‘ఉక్కు’తో ఉపద్రవం

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, గంగవరం పోర్టు అదానీకి సమర్పించడం, రైల్వేజోన్‌ ఉద్యమాలు ఉత్తరాంధ్రలో బలం గా ఉన్నాయి. వీటి ప్రభావం ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై ఉంటుంది. కార్మికవర్గం చేస్తున్న ఆందోళనలు మిగతా వర్గాల వారిని కూడా ఆకర్షిస్తున్నాయి.

మద్దతు ధర మంట..

ధాన్యానికి మద్దతు ధర దొరకడం లేదని రైతులు ఆందోళనగా ఉన్నారు. ఆర్‌బీకేల్లో ధాన్యం సేకరణలో 80 కేజీలకు 4 కేజీలు, 100 కేజీలకు 5 కేజీలు అదనంగా తీసుకుంటున్నారు. దీనిపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.

టీటీడీ సంస్కరణలు...

తిరుమలకు సంబంధించి తీసుకొచ్చే సంస్కరణలు భక్తులకు అర్థం కావాలి. భక్తుల మనోభావాలను గౌరవించేలా నిర్ణయాలు ఉండాలి. సంస్కరణల వల్ల రాత్రికిరాత్రే మార్పురాకపోవచ్చు. కానీ, అవి ఎట్టి పరిస్థితుల్లో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉండకూడదు. అధికారులు తప్పులు చేసినా... దాని ఫలితం అనుభవించేది ప్రభుత్వమే! టీటీడీ సోషల్‌ మీడియాపై దృష్టిపెట్టాలి. టీటీడీలో జరిగే సంస్కరణల గురించి భక్తులకు ఎప్పటికప్పుడు సరైన మార్గంలో తెలియజేస్తుండాలి.

రోడ్లు, డ్రైనేజీలే అసలు సమస్య

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ప్రధానంగా రహదారులు కావాలని కోరుతున్నారు. ప్రధాన రహదారులకు మరమ్మతులు చేయాలని... అంతర్గత రహదారులు వేయాలని, పాత వాటిని మెరుగుపర్చాలని ఆశిస్తున్నారు. కాలనీలు, నివాస ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి ఉంది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో ఈ సమస్యలనే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కొద్దిపాటి ఖర్చుతో కూడిన ఈ పనులను పూర్తిచేస్తే ప్రజల్లో అసంతృప్తి కొంతమేరకైనా తగ్గుతుంది.

పోలవరం సమస్యే

పోలవరం ముంపు అంశం ఏజెన్సీలో కీలకంగా మారనుంది. ఇప్పటికీ నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ అందలేదు. కాంటూరు ఎత్తుపై గిరిజనులు చాలా పట్టుదలగా ఉన్నారు. ఈ సమస్యలు పరిష్కరిస్తేనే వైసీపీకి సానుకూలత ఉంటుంది. విలీన మండలాల సమస్యలు వైసీపీకి ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఏజెన్సీలో కొత్తగా ప్రతిపాదించిన హైడ్రోప్రాజెక్టుపై గిరిజనులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.

స్టీల్‌ప్లాంటు పూర్తిచేస్తే...

స్టీల్‌ ప్లాంటు నిర్మాణం, చిత్తూరు డెయిరీ పునరుద్ధరణలో పురోగతి చూపించాలి. దీంతో ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల పరిధిలో దీని ప్రభావముంటుంది.

అర్థంకాని ‘బైజూస్‌’ కంటెంట్‌

ఎనిమిదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇచ్చిన బైజూస్‌ ట్యాబ్‌ల్లోని కంటెంట్‌ ఇటు విద్యార్థులకు, అటు ఉపాధ్యాయులకు అర్ధం కావడం లేదు. ఈ అంశంపై ఉపాధ్యాయులకు తగిన శిక్షణ ఇవ్వాలి.

ట్రాఫిక్‌కు పరిష్కారం చూపాలి

విజయవాడ, గుంటూరు పరిధిలో ట్రాఫిక్‌ సమస్యలు పెరిగిపోయాయి. అంతర్గత రోడ్లు, సర్వీసు రోడ్లను పునరుద్ధరించాలి. నర్సాపురం కాకుండా... భీమవరాన్ని జిల్లా కేంద్రం చేయడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ వైసీపీకి చాలా కష్టంగానే ఉంది.

Updated Date - 2023-02-02T03:34:45+05:30 IST