కేంద్ర పథకానికి కొత్త కలరింగ్‌!

ABN , First Publish Date - 2023-01-26T03:57:46+05:30 IST

రాష్ట్రాల భాగస్వామ్యంతో కేంద్రం ప్రవేశపెట్టిన మొబైల్‌ వెటర్నరీ క్లినిక్‌(అంబులెన్స్‌)ల పథకాన్ని వైసీపీ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంది. సదరు పథకాన్ని తానే ప్రవేశ పెట్టినట్టు ప్రకటనలు ఇవ్వడమే కాకుండా, ముఖ్యమంత్రి ఆర్భాటంగా దీనిని ప్రారంభించారు.

కేంద్ర పథకానికి కొత్త కలరింగ్‌!

రెండోసారి ప్రారంభానికీ ఆర్భాటమే

సంచార పశువైద్య అంబులెన్స్‌లకు అట్టహాసంగా జెండా ఊపిన సీఎం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రాల భాగస్వామ్యంతో కేంద్రం ప్రవేశపెట్టిన మొబైల్‌ వెటర్నరీ క్లినిక్‌(అంబులెన్స్‌)ల పథకాన్ని వైసీపీ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంది. సదరు పథకాన్ని తానే ప్రవేశ పెట్టినట్టు ప్రకటనలు ఇవ్వడమే కాకుండా, ముఖ్యమంత్రి ఆర్భాటంగా దీనిని ప్రారంభించారు. వాస్తవానికి ఈ పథకాన్ని గతంలో చంద్రబాబు హయాంలోనే ప్రారంభించి అమలు చేశారు. అయితే, గత ఏడాది వైసీపీ సర్కారు దీనిని మరోసారి ప్రారంభించి ‘వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవ’ పేరిట అమలు చేసింది. అప్పట్లో 175 వాహనాలు ప్రారంభించగా.. తాజాగా మరో 165వాహనాలకు సీఎం జెండా ఊపారు. అనంతరం అంబులెన్స్‌లను ఆయా నియోజకవర్గాలకు తరలించారు. తొలుత అంబులెన్స్‌ లోపల ఉన్న సదుపాయాలను జగన్‌ పరిశీలించారు. వెటర్నరీ వైద్యులతో మాట్లాడి పశువులకు అందించే సేవల వివరాలను తెలుసుకున్నారు. అయితే.. దీనిని తొలిసారే అమలు చేస్తున్నట్టు, అది కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఉదారంగా సేవ చేస్తున్నట్టు కలరింగ్‌ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. పథకం పేరు నుంచి ప్రచారం వరకు రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. మూగజీవాలకు సకాలంలో వైద్యసేవలు అందించే లక్ష్యంతో మొబైల్‌ వెటర్నరీ క్లినిక్‌ల పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ‘108’ అంబులెన్సుల తరహాలోనే సంచార పశువైద్య అంబులెన్స్‌ల కొనుగోలుకు కేంద్రమే నిధులు సమకూరుస్తోంది. నిర్వహణ వ్యయంలోనూ 60ు కేంద్రం, రాష్ట్రాలు 40ు వెచ్చిస్తున్నాయి. ఈ అంబులెన్స్‌లకు దేశవ్యాప్తంగా టోల్‌ఫ్రీ నం. ‘1962’ ప్రవేశపెట్టారు. 2016లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జీవో 97 ద్వారా నిధులు కేటాయించి, సంచార పశువైద్య సేవలను అమలు చేశారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోనూ మొబైల్‌ వెటర్నరీ క్లినిక్స్‌ పేరుతో పశుసంవర్థకశాఖ తరఫున సేవలందుతున్నా యి. కొత్త అంబులెన్సులపై ప్రధాని ఫొటో ముద్రించినా, పత్రికలకు ఇచ్చిన అధికారిక ప్రకటనల్లో ఊసే లేదు. పైగా అంబులెన్స్‌ల ప్రారంభోత్సవానికి కేంద్ర పెద్దలెవరినీ ఆహ్వానించలేదు. పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, అగ్రిమిషన్‌ వైస్‌చైర్మన్‌ నాగిరెడ్డి, ఎంపీ నందిగం సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి పశువుకూ హెల్త్‌ కార్డు

ఆక్వాలోనూ మధ్యవర్తులు వద్దు

సమీక్షలో సీఎం జగన్‌ నిర్దేశం

అమరావతి, జనవరి 25(ఆంధ్రజ్యోతి): ‘‘సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, ప్రతి పశువుకూ హెల్త్‌ కార్డు ఇచ్చే దిశగా ఆలోచన చేయాలి. దీనివల్ల పశువులకు అందుతున్న వైద్య సేవలపై పర్యవేక్షణ సులభతరం అవుతుంది. పశుసంవర్థకశాఖలో ఏ పథకం అమలు చేసినా వివక్షలేకుండా అర్హులందరికీ అందించడానికి గ్రామం యూనిట్‌గా తీసుకోవాలి’’ అని సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పశుసంవర్థకశాఖ, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖలపై ఆయన సమీక్ష జరిపారు. సీఎం మాట్లాడుతూ.. ‘‘నాడు-నేడు ద్వారా మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలి. లక్ష్యాలు నిర్దేశించుకుని పశువులకు వ్యాక్సిన్లు వేయాలి. విలేజ్‌ క్లినిక్‌ తరహాలో ఆర్బీకేల్లోని పశుసంవర్థక విభాగాన్ని బలోపేతం చేయాలి. గ్రామస్థాయిలో ఒకరిద్దరు వలంటీర్లను ఈ సేవల్లో నిమగ్నం చేయాలి. రసాయనాలకు తావు లేని పశుపోషణ విధానాలపై అవగాహన పెంచాలి. ధాన్య సేకరణలో మిల్లర్ల పాత్రను తీసేసినట్టే. ఈసారి ఆక్వా రంగంలోనూ మధ్యవర్తుల ప్రమేయాన్ని తీసేయాలి’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఆర్బీకే స్థాయిలోనే ఆక్వా కొనుగోళ్లు జరిగేలా చూడాలన్నారు. అధికారులు మాట్లాడుతూ. రెండు మూడు వారాల్లో చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Updated Date - 2023-01-26T03:57:46+05:30 IST