విస్తరిస్తున్న లంపీ స్కిన్‌

ABN , First Publish Date - 2023-01-25T00:33:12+05:30 IST

జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొన్ని రోజులుగా లంపీ స్కిన్‌ వ్యాధి రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రధానంగా గోజాతి పశువులలో ఈ వ్యాధి సోకుతుంది.

విస్తరిస్తున్న లంపీ స్కిన్‌
లంపీ స్కిన్‌ వ్యాధి సోకిన కోడెదూడ

ప్రాణాలు కోల్పోతున్న పశువులు

జిల్లాలో అంటువ్యాధిలా ప్రబలుతున్న వైనం

నెలల వయసున్న దూడలపై అధిక ప్రభావం

యడ్లపాడు, జవనరి 24: జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొన్ని రోజులుగా లంపీ స్కిన్‌ వ్యాధి రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రధానంగా గోజాతి పశువులలో ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధిని ముద్ద చర్మపు వ్యాధి అని కూడా పిలుస్తారు. ఇది మనుషులపై ఎలాంటి ప్రభావం చూపనప్పటికీ ఇదొక అంటువ్యాధిలా పశువుల్లో ప్రబలుతుంది. మండలంలో సుమారు వెయ్యికి పైగా గోజాతి పశువులు ఉండగా రెండు నెలల వ్యవధిలో 20శాతం ఈ వ్యాధి బారిన పడినట్లు సమాచారం. ఈ వ్యాధి నెలల వయసున్న దూడలపై అధిక ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ఈ వ్యాధి సోకి సుమారు 20కి పైగా దూడలు, పశువులు మరణించినట్లు సమాచారం. సరైన మందులు, వ్యాక్సిన్‌ అందుబాటులో లేకపోవడంతో పశుపోషకులు ఇబ్బందులు పడుతున్నారు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పశువులు మృతి చెందుతుండటంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. తాజాగా యడ్లపాడులో పోపూరి నాగచౌదరికి చెందిన కోడెదూడతోపాటు మరో ఐదుగురు రైతులకు చెందిన దూడలు ఈ వ్యాధి బారిన పడ్డాయి. ముందస్తుగా వ్యాక్సిన్లు వేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని రైతులు అభిప్రాయపడుతున్నారు. గతంలో సీజనల్‌గా వచ్చే గాలికుంటు, గొంతువ్యాధి, పారుడు వ్యాధి వంటి వాటికి వ్యాక్సిన్‌లు వేసేవారని, ఇప్పుడు అవి కూడా వేయడం లేదంటున్నారు.

వ్యాధి సోకిన వాటిని వేరుగా ఉంచాలి

కాప్రిపాక్స్‌ వైరస్‌ వల్ల పశువులకు లంపీ స్కిన్‌ వ్యాధి వస్తుంది. కొన్ని జాతుల ఈగలు, దోమలు లేదా రక్తాన్ని పీల్చి జీవించే పేల వంటి కీటకాల ద్వారా ఇది సోకుతుంది. ఈ వ్యాధి సోకిన పశువులలో 104-105 డిగ్రీల జ్వరం, చర్మంపై బుడిపెలు, నోటి నుంచి చొంగ, ముక్కు నుంచి నీరు కారడం, ముక్కుదూలం మీద బుడిపెలు, కణుతులు వస్తాయి. ఈ లక్షణాలు గమనించిన వెంటనే పశువైద్యులను సంప్రదించి సకాలంలో చికిత్స అందిస్తే అవి కోలుకుంటాయి. వ్యాధిసోకిన పశువులను మిగిలిన వాటితో కలవకుండా వేరుగా ఉంచాలి. - డాక్టర్‌ రాధాకృష్ణ, పశుసంవర్థక శాఖ ఏడీ

Updated Date - 2023-01-25T00:33:36+05:30 IST