‘ప్రజాభిప్రాయం’లో సమస్యలకు చోటేదీ?

ABN , First Publish Date - 2023-01-25T04:29:22+05:30 IST

విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కమ్‌)లు ప్రతిపాదించే 2023-24 వార్షిక ఆదాయ, వ్యయ ప్రతిపాదనలపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో భవిష్యత్తులో ప్రజలపై మోపే విద్యుత్‌ భారాలపై ఎలాంటి చర్చా జరగలేదని ఇంధనరంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, రైతు సంఘాలు, వామపక్ష పార్టీలు, ఇతర రాజకీయపక్షాలు పేర్కొన్నాయి.

‘ప్రజాభిప్రాయం’లో సమస్యలకు చోటేదీ?

భవిష్యత్‌ విద్యుత్‌ భారాల ప్రస్తావనేదీ

ఏఆర్‌ఆర్‌ ప్రతిపాదనలకే పరిమితమా?

అలాంటప్పుడు ప్రజలతో చర్చ ఎందుకు?

మండిపడుతున్న ప్రజాసంఘాలు

వర్చువల్‌ ప్రజాభిప్రాయ సేకరణపైనా ఆగ్రహం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కమ్‌)లు ప్రతిపాదించే 2023-24 వార్షిక ఆదాయ, వ్యయ ప్రతిపాదనలపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో భవిష్యత్తులో ప్రజలపై మోపే విద్యుత్‌ భారాలపై ఎలాంటి చర్చా జరగలేదని ఇంధనరంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, రైతు సంఘాలు, వామపక్ష పార్టీలు, ఇతర రాజకీయపక్షాలు పేర్కొన్నాయి. భవిష్యత్తులో సునామీలా వచ్చి పడే భారాలైన.. అదానీ కంపెనీ నుంచి విద్యుత్‌ కొనుగోళ్ల ఖర్చు, హిందూజాకు చెల్లింపులు, స్మార్టు మీటర్ల అంశాలపై ఈఆర్‌సీ స్పందనే కరువైందని అసహనం వ్యక్తం చేశాయి. కేవలం డిస్కమ్‌లు ప్రతిపాదించిన ఏఆర్‌ఆర్‌లకే ఏపీఈఆర్‌సీ ప్రజాభిప్రాయాన్ని పరిమితం చేయడం విమర్శలకు తావిచ్చింది. వినియోగదారుల నుంచి వాస్తవ వ్యయాల పేరిట వసూలు చేస్తున్న ‘ట్రూఅప్‌’ చార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీలు, అదనపు లోడు డిపాజిట్‌, ఇంధన పన్నులు వంటి వాటిపై ప్రస్తావనకే వీలు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. అదేవిధంగా భవిష్యత్‌లో వినియోగదారులపై పడనున్న స్మార్ట్‌ మీటర్ల చార్జీలు, రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ ఉందంటూనే అదానీకి చెందిన సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సెకీ) నుంచి 7000 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయడం, హిందూజాకు బకాయిల పేరిట రూ.2,300 కోట్ల చెల్లింపులు వంటి అంశాలపై ఈఆర్‌సీ ఈ నెల 19 నుంచి 21 దాకా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో చర్చకు అవకాశమే లేకుండా పోయిందని ఆయా సంఘాలు, రాజకీయ పక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఏఆర్‌ఆర్‌లపై ఈఆర్‌సీ ప్రజాభిప్రాయ సేకరణ నామమాత్రమే అయిందన్న అభిప్రాయం వ్యక్తం చేశాయి.

చార్జీల ప్రతిపాదన లేనప్పుడు..

ఇంధన రంగంలో చేపట్టాల్సిన సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు ఇస్తుంది. ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు పాటిస్తాయి. విద్యుత్‌ టారి్‌ఫలో ఎలాంటి ప్రతిపాదనలు లేకుండా డిస్కమ్‌లు వార్షిక పునరావృత రాబడి(ఏఆర్‌ఆర్‌)ని ఈఆర్‌సీలకు ప్రతిపాదించే కొత్త ఎత్తుగడలను రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. టారి్‌ఫలో విద్యుత్‌ చార్జీల ప్రతిపాదనలే లేనప్పుడు ఇక ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకనే ప్రశ్న తెరమీదికి వచ్చింది. గతంలో.. శ్లాబుల వారీగా విద్యుత్‌ చార్జీల్లో మార్పులు, చేర్పులు ఉండేవి. కానీ, ఇప్పుడు వాటిలో ప్రధానంగా గృహ విద్యుత్‌ శ్లాబుల్లో ఎలాంటి మార్పులు లేకుండా వాస్తవ వ్యయాల వసూలు పేరిట చేసే ‘ట్రూ అప్‌’ చార్జీలు పంపడం ఆనవాయితీగా మారింది. ఇది ఒకరకంగా వినియోగదారులపై డిస్కమ్‌లు వేసే దొంగదెబ్బగానే ఆరోపిస్తున్నాయి.

ప్రభుత్వ బకాయిల మాటేంటి?

ప్రజాభిప్రాయ సేకరణ అంటే.. ఫిజికల్‌ హియరింగ్‌ కాకుండా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అభిప్రాయాలు సేకరించడమా? అని ప్రజాసంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. కరోనా ప్రభావం కారణంగా వర్చువల్‌ విచారణలు జరిపిన కోర్టులు కూడా సాధారణ స్థితి ఏర్పడటంతో కార్యకలాపాలను ప్రత్యక్షంగానే నిర్వహిస్తున్నాయని, కానీ, రాష్ట్ర ప్రజల సమస్య అయిన విద్యుత్‌ చార్జీలపై ఈఆర్‌సీ వర్చువల్‌ విధానంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయడం ఏంటని నిలదీస్తున్నారు. ఇలా చేయడం ద్వారా వేలాది మందిని ప్రజాభిప్రాయ సేకరణకు దూరం చేయడమేనని అభిప్రాయపడుతున్నాయి. అదేసమయంలో ప్రభుత్వ బకాయిలపై దృష్టి సారించడంలేదని విమర్శిస్తున్నాయి. 2021-22 సంవత్సరంలో ఏపీఎస్పీడీసీఎల్‌కు ప్రభుత్వం నుంచి రూ.7,435.33 కోట్లు, 2022-23 ఏప్రిల్‌ నుంచి అక్టోబరు దాకా రూ.7,660.12 కోట్లు రాయితీ కింద రావాల్సి ఉందని ప్రజా సంఘాలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా ఏపీసీపీడీసీఎల్‌కు 2021-22లో రూ.3,010.15 కోట్లు, 2022-23 అక్టోబరు దాకా రూ.3,172.52 కోట్లు ప్రభుత్వం సబ్సిడీ కింద చెల్లించాల్సి ఉందని పేర్కొన్నాయి. ఈపీడీసీఎల్‌ పరిధిలో రూ.5,000 కోట్ల దాకా ప్రభుత్వ బకాయి ఉందని ప్రజా సంఘాలు చెబుతున్నాయి. అయితే, ప్రభుత్వం నుంచి సబ్సిడీ మొత్తాలు వచ్చేస్తున్నాయని డిస్కమ్‌లు చెబుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ, నగర కార్పొరేషన్లకు చెందిన విద్యుత్‌ బకాయిలు రూ.5,000 కోట్ల దాకా ఉంటాయని ప్రజా సంఘాలు చెబుతున్నాయి. ఈ బకాయిల విషయంలో ఈఆర్‌సీ ఎందుకు పట్టనట్లు వ్యవహరిస్తోందని ప్రశ్నిస్తున్నాయి. వైసీపీ అధికారంలో కి వచ్చాక ప్రజలపై 7 దఫాలుగా రూ.16,611 కోట్ల మేర చార్జీల భారం వేశారని, అదేవిధంగా రూ.26,261 కోట్ల మేర పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి అప్పులు తీసుకువచ్చిన భారాన్ని కూడా వినియోగదారుల నుం చి డిస్కమ్‌లు వసూలు చేస్తున్నాయని ఆందోళన వ్య క్తం చేస్తున్నాయి.

డిస్కమ్‌లపై నియంత్రణేదీ?

డిస్కమ్‌లు విచ్చలవిడిగా విద్యుత్‌, మీటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లను కొనుగోలు చేస్తూ వాటి భారాన్ని వినియోగదారులపై వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ప్రజాభిప్రాయ సేకరణలో చోటు కల్పించకపోవడంపైనా ప్రజాసంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అభ్యంతరాలు లిఖిత పూర్వకంగా ఇచ్చినా అవి ఏఆర్‌ఆర్‌ పరిధిలోకి రానందున వాటిపై చర్చించే వీల్లేదని ఈఆర్‌సీ పేర్కొనడంపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందూజాకు రూ.2,300 కోట్ల మేర బకాయిల చెల్లింపుల అంశం పరిశీలనలో ఉందని ఇంధనశాఖ స్పష్టం చేస్తున్నా దానిపైనా ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలను సేకరించలేదని పేర్కొన్నాయి.

Updated Date - 2023-01-25T04:29:22+05:30 IST