వైద్యుడి ఇంట్లో భారీగా నగదు స్వాధీనం?

ABN , First Publish Date - 2023-01-26T01:12:54+05:30 IST

: నగరంలో కొందరు ప్రముఖల ఇళ్లపై ఇటీవల ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేసినట్లు తెలిసింది

వైద్యుడి ఇంట్లో భారీగా నగదు స్వాధీనం?

గుంటూరులో ఐటీ దాడులు

ఆలస్యంగా వెలుగులోకి..

గుంటూరు(మెడికల్‌), జనవరి 25: నగరంలో కొందరు ప్రముఖల ఇళ్లపై ఇటీవల ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేసినట్లు తెలిసింది. ఈ దాడుల్లో కొత్త్తపేటలోని ఒక ప్రముఖ వైద్యుడు వద్ద దాదాపు రూ.5కోట్లకు పైగా నగదు దొరికినట్లు సమాచారం. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగదుకు సంబంధించిన వివరాలు అందజేయాలని ఐటీ అఽధికారులు కోరినట్లు తెలిసింది. కొత్తపేటలో సొంత ఆసుపత్రి నిర్వహిస్తున్న ఈ డాక్టర్‌ ఇటీవల తన ఆసుపత్రికి సమీపంలో మరో నూతన ఆసుపత్రిని నిర్మించారు. దీనిని వేరే వైద్యుడికి అద్దెకు ఇచ్చారు. దీంతో పాటు నగర శివార్లలో మరో భారీ ఆసుపత్రి నిర్మాణంలో కూడా ఇతర వైద్యులతో కలసి భాగస్వామిగా ఉన్నట్లు సమాచారం. దీంతోపాటుగా పలు ప్రాంతాల్లో భారీగా భూములు, పొలాలు కొనుగోలు చేసినట్లు వైద్యవర్గాల్లో ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈ వైద్యుడి ఇల్లు, ఆసుపత్రులపై తనిఖీలు చేయగా, రూ.ఐదు కోట్లకు పైగా నగదు దొరికినట్లు ప్రచారం జరుగుతోంది. తన ఎదుగుదల చూసి ఓర్వలేని సాటి డాక్టర్లు కొందరు కావాలని తనపై దుష్ఫ్రచారం చేస్తున్నట్లు సదరు వైద్యుడు సన్నిహితుల వద్ద వాపోయినట్లు వినికిడి. నగరంలో మరికొందరు వైద్యులపై కూడా ఆదాయ పన్ను శాఖ అఽధికారులు తనిఖీలు చేసి భారీగా నగదును గుర్తింనట్లు తెలుస్తోంది. ఈ సంఘటన వైద్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2023-01-26T01:12:54+05:30 IST