అంగన్‌వాడీల.. నిరసన గళం

ABN , First Publish Date - 2023-02-07T01:04:58+05:30 IST

విధుల పేరుతో తమతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని అంగన్‌వాడీల ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో తాము మనుగడ కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని మండిపడ్డారు.

అంగన్‌వాడీల..  నిరసన గళం
కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన నిరసనలో భారీగా పాల్గొన్న అంగన్‌వాడీలు

06బిపిటి 01 ,బి ఫొటోరైటప్‌ : కలెక్టర్‌ కార్యాలయ ఆవరణంలో ధర్నాలు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సభ్యులు, అంగన్‌వాడీ కార్యకర్తలు

6జీఎన్‌టీ అంజి04 జెపిజె కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన నిరసనలో భారీగా పాల్గొన్న అంగన్‌వాడీలు

గుంటూరు(తూర్పు), ఫిబ్రవరి 6: విధుల పేరుతో తమతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని అంగన్‌వాడీల ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో తాము మనుగడ కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని మండిపడ్డారు. సమస్యలను పరిష్కరించాలంటూ సోమవారం ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆఽధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట మహా నిరసన చేపట్టారు. నిరసన కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి పాల్గొని ప్రసంగించారు. నిధులు విడుదల చేయకపోవడంతో అప్పులు చేసి కేంద్రాలను నడపాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. వైఎస్సార్‌ సంపూర్ణపోషణ అమలుకు కొన్ని ప్రాజెక్ట్‌ల్లో ఆరు నెలలనుంచి బిల్లులు కూడా చెల్లించలేదన్నారు. తనిఖీల పేరుతో ఫుడ్‌ కమీషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు అంగన్‌వాడీలను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులు భరించలేక ఇటీవల రాజమండ్రిలో అంగన్‌వాడీ ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు. తక్షణమే అంగన్‌వాడీలకు కనీసవేతనం రూ.26 వేలు ఇచ్చి, ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీలకు ఫేస్‌యాప్‌లను రద్దు చేయాలన్నారు. మెనూ ఛార్జీలను పెంచడంతోపాటు 2017నుంచి పెండింగ్‌లో ఉన్న టీఏ బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు. ర్యాలీలు, సభలు నిషేదిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి జీవోను తక్షణమే రద్దు చేయాలన్నారు. అనంతరం స్పందనలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. నిరసనల్లో యూనియన్‌ జిల్లా కార్యదర్శి దీప్తి మనోజ, వై.నేతాజి, ముత్యాలరావు, డి.లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావు, రమాసుష్మ, టి.రాధా తదితరులు పాల్గొన్నారు.

బాపట్ల కలెక్టరేట్‌ ఎదుట..

బాపట్ల, ఫిబ్రవరి 6: అంగన్‌వాడీలకు కనీసవేతనం రూ.26వేలు ఇవ్వాలంటూ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సభ్యులు, అంగన్‌వాడీ కార్యకర్తలు కలెక్టర్‌ కార్యాలయ ముట్టడిని చేపట్టారు. అధిక సంఖ్యలో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు రావటంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేసి అడ్డుకున్నారు. నిరసన కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.రేఖ ఎలిజిబెత్‌ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గత ఐదేళ్లుగా టీఏ, డీఏలు ప్రభుత్వం చెల్లించటంలేదని తెలిపారు. రకరకాల యాప్‌లు తీసుకొచ్చి పనిభారం పెంచారని అన్నారు. హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. నిరసన కార్యక్రమం వద్దకు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఉమా చేరుకొని అంగన్‌వాడీల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళుతానని తెలిపినప్పటికి నిరసనను విరమించుకోలేదు. మధ్యాహ్నం 3గంటల వరకు నిరసన చేపట్డారు. అనంతరం కలెక్టర్‌ విజయకృష్ణన్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

పల్నాడు కలెక్టర్‌ కార్యాలయం ఎదుట..

నరసరావుపేట రూరల్‌, ఫిభ్రవరి 6: తమ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని గాంధీ పార్కు వద్దనుంచి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని, గ్రాడ్యుటీ, మెడికల్‌ లీవ్‌, ప్రమోషన్లు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. మార్చిలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేసి రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి తమ న్యాయమైన డిమాండ్లను సాధిస్తామని తెలిపారు.

Updated Date - 2023-02-07T01:05:00+05:30 IST