ఆహా... ఏం ‘క్లాసో’..!

ABN , First Publish Date - 2023-02-02T03:05:04+05:30 IST

‘ఆక్సిమోరన్‌... ఇదొక నామవాచకం. దీనర్థం... విరుద్ధ పదాల పదబంధనమని.

ఆహా...  ఏం ‘క్లాసో’..!

పెట్టుబడులు వస్తుంటే ధారగా... దావోస్‌ దండగ... ‘క్లాస్‌ యాక్ట్‌’: పవన్‌

అమరావతి, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ‘‘ఆక్సిమోరన్‌... ఇదొక నామవాచకం. దీనర్థం... విరుద్ధ పదాల పదబంధనమని. మన రాష్ట్రం దానికి ఓ ఉదాహరణ. దేశంలోనే అత్యధిక ధనికుడైన సీఎం పాలనలో పేద ప్రజలు ఉన్న రాష్ట్రం మనది’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. బుధవారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. ‘‘దేశంలోని మిగిలిన రాష్ట్రాల సీఎంల అందరి సమష్టి ఆస్తికన్నా జగన్‌ ఆస్తి ఎక్కువ. ఏపీ సీఎంది మరో ‘క్లాస్‌’. వైసీపీ క్రూరంగా రాష్ట్ర ప్రజలందరినీ బానిసలుగా మార్చింది. నేల నుంచి ఇసుక వరకు, లిక్కర్‌ నుంచి మైన్ల వరకూ, అడవుల నుంచి కొండల వరకు, కాగితం నుంచి ఎర్రచందనం వరకూ... వచ్చే ప్రతి రూపాయీ సీఎం చేతిలోనే ఉంది... ‘ట్రూలీ క్లాసిక్‌’. రాష్ట్రంలోని పేదలు యథాస్థితితో సంతృప్తిపడేలా వైసీపీ వారిని తయారుచేసింది. వారు తమ జీవితాలను, గౌరవాన్ని, కఠోర శ్రమను... అన్నింటినీ కొద్దిపాటి చిల్లరకు అమ్మేశారు. పెట్టుబడిదారులు ఏపీ నుంచి వెళ్లిపోయారు. ఇది వైసీపీ ‘మాస్టర్‌ క్లాస్‌’. రాష్ట్రానికి వైసీపీ లెక్కలేనన్ని పెట్టుబడులు తీసుకువస్తుంటే దావోస్‌ ఎవరికి కావాలి? మన పరిశ్రమల శాఖ మంత్రి ఇప్పటికే నూడిల్స్‌, టీ దుకాణాలు ప్రారంభించారు. ఇక ఐటీ కంపెనీల కోసమే ఎదురుచూపులు. ఇది మరొక ‘క్లాస్‌ యాక్ట్‌’. అనేక అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తి, అరకులో బాక్సైట్‌ మైనింగ్‌ను ప్రోత్సహిస్తున్న దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎం... చారుమజుందార్‌, తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య మాట్లాడిన ‘క్లాస్‌ వార్‌’ గురించి మాట్లాడుతున్నారు... ఎంతటి విషాదమిది..!’’ అని పవన్‌ ట్వీట్‌ చేశారు.

Updated Date - 2023-02-02T03:05:05+05:30 IST