జీవో-1పై ఐక్య పోరాటం

ABN , First Publish Date - 2023-01-25T04:13:01+05:30 IST

రోడ్‌ షోలు, ర్యాలీలు, సభలకు అనుమతి నిరాకరిస్తూ జగన్‌ ప్రభుత్వం అప్రజాస్వామికంగా తీసుకువచ్చిన జీవో-1ను వ్యతిరేకిస్తూ ఐక్య పోరాటం చేయాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు (సీపీఐ, సీపీఎం) నిర్ణయించాయి.

జీవో-1పై ఐక్య పోరాటం

విద్యార్థుల బస్సు యాత్రకు మద్దతు

ప్రకటించిన కమ్యూనిస్టు పార్టీల నేతలు

అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): రోడ్‌ షోలు, ర్యాలీలు, సభలకు అనుమతి నిరాకరిస్తూ జగన్‌ ప్రభుత్వం అప్రజాస్వామికంగా తీసుకువచ్చిన జీవో-1ను వ్యతిరేకిస్తూ ఐక్య పోరాటం చేయాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు (సీపీఐ, సీపీఎం) నిర్ణయించాయి. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం విద్యార్థి, యువజన సంఘాలు ఈ నెల 25 నుంచి చేపట్టిన బస్సు యాత్రకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మద్దతు ప్రకటించాయి. మంగళవారం విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రెండు పార్టీల ఉమ్మడి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఆ పార్టీ నేతలు జల్లి విల్సన్‌, అక్కినేని వనజ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతోపాటు ఆ పార్టీ నేతలు వై.వెంకటేశ్వరరావు, సీహెచ్‌.బాబూరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జగన్‌ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఈ సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 30న విశాఖపట్నంలో నిర్వహించతలపెట్టిన ‘కార్మిక మహాగర్జన’కు సీపీఐ, సీపీఎంలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్‌ చేశారు.

ఉద్యోగుల సంఘాన్ని బ్లాక్‌మెయిల్‌ చేయడం తగదు: సీపీఐ

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) గుర్తింపును రద్దు చేస్తామంటూ జగన్‌ సర్కారు బ్లాక్‌మెయిల్‌ చేయడం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు గవర్నర్‌ను కలిసి విన్నవించడం నేరమా? అని ప్రశ్నించారు. ‘ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు కూడా పట్టించుకోకపోతే ఉద్యోగులు తమ గోడును ఎవరికి మొరపెట్టుకోవాలి? ఉద్యోగ సంఘ నేతలు గవర్నర్‌ వద్ద రాజకీయాంశాలేవీ ప్రస్తావించలేదు కదా? ఉద్యోగ సంఘ నేత కేఆర్‌ సూర్యనారాయణపై రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణి సరికాదు. ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను చిత్తశుద్ధితో పరిష్కరించాలి. సీఎం జగన్‌ కక్ష సాధింపు, నిరంకుశ విధానాలు విడనాడాలి’ అని రామకృష్ణ హితవు పలికారు.

Updated Date - 2023-01-25T04:13:02+05:30 IST