మెట్ట.. కట్టేదెట్టా
ABN , First Publish Date - 2023-01-25T01:35:26+05:30 IST
అది పెద్దాపురం మండలంలోని 823 ఎకరాల రామేశ్వరం మెట్ట.. ఇక్కడు న్న లక్షల క్యుబిక్ మీటర్ల గ్రావెల్, మట్టిని కాకినాడకు చెందిన వైసీపీ కీలక నేత కొన్నేళ్లుగా అక్రమంగా ఎగరేసుకుపోతున్నాడు.. ఇప్పుడక్కడకు వెళ్లి చూ స్తే మాయమైపోయిన కొండల ఆనవాళ్లతోపాటు లోయలుగా మారిన వంద ల ఎకరాల భూములే కనిపిస్తాయి.

పెద్దాపురం రామేశంమెట్టపై వెక్కిరిస్తున్న పేదల ఇళ్ల స్థలాలు
ఏళ్లు గడుస్తున్నా ఒక్క లబ్ధిదారుడు ఇంటి పునాది తీయని వైనం
రెండేళ్ల కిందట 59 ఎకరాల్లో 2,114మంది పేదలకు స్థలాలు కేటాయించిన ప్రభుత్వం
భూములిచ్చిన చోట గ్రావెల్కోసం కొండలు తవ్వి లోయలుగా మార్చేసిన వైసీపీ నేత
ఇప్పుడెటు చూసినా పెద్దపెద్ద లోయలు, కంకర, బూడిద కనిపిస్తున్న పరిస్థితి
లోయలు దాటి లేఅవుట్ వద్దకు వెళ్లలేక స్థలాల వైపు కన్నెత్తి చూడని లబ్ధిదారులు
మరోపక్క తవ్వేసిన భూముల్లో చదును పేరుతో రూ.1.50కోట్లు నొక్కేసిన అధికారులు
(కాకినాడ, ఆంధ్రజ్యోతి)
అది పెద్దాపురం మండలంలోని 823 ఎకరాల రామేశ్వరం మెట్ట.. ఇక్కడు న్న లక్షల క్యుబిక్ మీటర్ల గ్రావెల్, మట్టిని కాకినాడకు చెందిన వైసీపీ కీలక నేత కొన్నేళ్లుగా అక్రమంగా ఎగరేసుకుపోతున్నాడు.. ఇప్పుడక్కడకు వెళ్లి చూ స్తే మాయమైపోయిన కొండల ఆనవాళ్లతోపాటు లోయలుగా మారిన వంద ల ఎకరాల భూములే కనిపిస్తాయి. అలాంటిచోట రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. 59 ఎకరాల్లో 2,114 మందికి పట్టాలిచ్చింది. రెం డేళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఒక్కరు కూడా అక్కడ ఇంటి నిర్మాణానికి పునాది తీయలేదు. ఒక్క ఇళ్లు కూడా నిర్మాణానికి అడుగులు పడలేదు. స్థలాలు కేటాయించిన తర్వాత కూడా ఆ చుట్టుపక్కల భూ ముల్లో గ్రావెల్ ఊదేసి 20 అడుగుల లోతుకు తవ్వేశారు. దీంతో లోయల మధ్య ఉన్న ఈ లేఅవుట్ వద్దకు వెళ్లి ఇళ్లు కట్టుకునేందుకు లబ్ధిదారులు సాహసం చేయడం లేదు. అధికారులు లేఅవుట్ ఉందనే సంగతి వదిలేశారు. తవ్వేసిన భూము ల్లో లేఅవుట్ చదును పేరుతో కొందరు రూ.1.50కోట్లు మెక్కేయడం విశేషం.
అమ్మో.. లోయలు దాటాలా..
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2020, డిసెం బరు 25న ప్రారంభించింది. ఇందులోభాగంగా జిల్లాలో 77,896 మందికి ప్ర భుత్వ స్థలాలు, ప్రైవేటు వ్యక్తులనుంచి భూములు కొనుగోలు చేసి స్థలాలు కేటాయించింది. పెద్దాపురం మండలం విషయానికొస్తే మొత్తం 3,965 మం ది లబ్ధిదారులను గుర్తించింది. వీరందరికీ స్థలాలు చాలినన్ని లేకపోవడంతో శివారున ఏడీబీ రోడ్డును ఆనుకుని లోపలున్న రామేశం మెట్ట భూములు గుర్తించింది. పెద్దాపురం రూరల్ పరిధిలోకి వచ్చే పులిమేరు, గుడివాడ, సిరి వాడ, కాండ్రకోట, ఉలిమేశ్వరం, చెదలాడ, గోరింట, దివిలి, చంద్రమాంపల్లి, తాటిపర్తి గ్రామాలకు చెందిన 2,114మంది పేదలకు రామేశంమెట్టలో 59ఎక రాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించింది. వాస్తవానికి మెట్టపై ఇళ్ల పట్టాలు ఇచ్చే సమయానికే అక్కడ భారీఎత్తున గ్రావెల్‌ను కాకినాడకు చెందిన వైసీపీ కీలకనేత ఎడాపెడా తవ్వేశారు. ఏడీబీ రహదారిని ఆనుకుని రామేశంమెట్టకు వెళ్లే దారిలో పెద్దపెద్ద కొండలను మాయం చేసి వందల ఎకరాలను లో యలుగా మార్చేశారు. రామేశం మెట్టపై గ్రావెల్కోసం భూములను తవ్వే సినచోట 59ఎకరాలు ఇళ్ల స్థలాలకు కేటాయించారు. ఈ ప్రాంతం లబ్ధిదారు లు నివసిస్తున్న ఇళ్లకు పది కిలోమీటర్లు పైనే. దీంతో ఆ భూములు వద్దని లబ్ధిదారులు మొత్తుకున్నా ప్రభుత్వం వినిపించుకోకుండా పట్టాలు కేటాయిం చింది. ఇది జరిగి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ 59 ఎకరాల్లో ఒక్క లబ్ధిదారులు కూడా ఇంటి నిర్మాణం మొదలుపెట్టలేదు. లేఅవుట్లో ఒక్క ఇంటికి సైతం పునాది తవ్వలేదు.
వాళ్లు రాలేదని ఇంకా మింగేశారు..
ఎలాగూ పేదలు మెట్టపై ఇళ్ల నిర్మాణానికి రావడం లేదనే సాకుతో సదరు వైసీపీ కీలక నేత లేఅవుట్‌ను ఆనుకుని, సమీప ప్రాంతాల్లో పెద్ద పెద్ద కొండలను ఈ రెండేళ్లలో ఇంకా తవ్వేశాడు. లక్షల క్యుబిక్ మీటర్ల గ్రావెల్‌ను అడ్డగోలుగా తవ్వి తరలించుకుపోయి కోట్లలో సంపాదించాడు. అయినా గనులు, రెవెన్యూశాఖ కన్నెత్తి చూడలేదు. మరోపక్క లేఅవుట్‌కు వెళ్లే దారిలో గ్రావెల్ తరలింపు కోసం నిత్యం పదుల సంఖ్యలో టిప్పర్లు ప్రయాణిస్తున్నాయి. దీంతో టన్నుల కొద్దీ మట్టితో కూడిన బూడిద ఎగిరిపడుతోంది. ప్రస్తుతం లేఅవుట్ వెళ్లే దారిలో తవ్వేసి మాయం చేసిన కొండల ఆనవాళ్లు, ఇరవై అడుగులకు పైగా లోయలుగా మారిన భూములే కనిపిస్తున్నాయి. దీంతో ఇక్కడకు ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే ఏ లోయలో పడతామో అన్నంతగా భయమేస్తుంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు రామేశం మెట్టకు వచ్చి ఇళ్లు కట్టుకోవాలంటే హడలిపోతున్నారు. ఏడీబీ రహదారినుంచి లోపలకు భయంకరంగా మారిన లోయలు దాటుకుని వెళ్లడానికి జంకుతున్నారు. దీంతో ఇప్పుడీ లేఅవుట్ ఎందుకు పనికి రాకుండా మారింది. పట్టాలు తీసుకున్న 2,114మంది పేద లబ్ధిదారులు మెట్ట స్థలాలు ఎందుకూ పనికిరావని, అక్కడకు వెళ్లలేమని తెగేసి చెబుతున్నారు. పేదలకు స్థలాలు ఇచ్చిన లేఅవుట్లో రాష్ట్రప్రభుత్వం రహదారులు, విద్యుత్, ఇళ్ల నిర్మాణానికి నీటి వసతి కల్పిస్తోంది. కానీ రామేశంమెట్ట లేఅవుట్‌ను మాత్రం పూర్తిగా గాలికి వది లేసింది. ఏడీబీ రోడ్డు నుంచి లేఅవుట్‌కు రహదారి నిర్మిం చడానికే కొన్ని వందల కోట్లు ఖర్చుపెట్టాల్సి ఉండడంతో అటువైపు కన్నెత్తి చూడడం లేదు.
చదును పేరుతో నొక్కేశారు..
అసలే లబ్ధిదారులు వెళ్లడా నికి సాహసించని రామేశం మెట్ట లేఅవుట్‌ను కొందరు అ ధికారులు కాసుల కల్పవల్లిగా మార్చుకున్నారు. కొండల మధ్య కేటాయించిన 59ఎకరాలను చదును చేసే పేరుతో భారీగా నొక్కేశారు. 2,114 మంది లబ్ధి దారులున్న 59 ఎకరాల ప్రాంతాన్ని చదును చేయాల్సి ఉందని, ఇందుకు రూ.2కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు చదును పేరుతో రూ.1.50కోట్ల వరకు బిల్లులు చేసేసుకుని డబ్బులు వెనకేసుకున్నా రు. వాస్తవానికి ఇక్కడ ఇచ్చిన భూముల్లో అప్పటికే కాకినాడ కీలకనేత గ్రావెల్ తవ్వేశారు. దీంతో ఆ భూములు ఎగుడు, దిగుడుగా మారాయి. తిరిగి వీటిని చదును చేసే పేరుతో డబ్బులు మింగేయడం విశేషం.