ఇళ్ల నిర్మాణానికిచ్చే మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచాలి

ABN , First Publish Date - 2023-02-07T00:56:58+05:30 IST

రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇస్తున్న మొత్తాన్ని రూ.లక్షా 80 వేల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్‌ చేశారు. అలాగే టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలన్నారు.

ఇళ్ల నిర్మాణానికిచ్చే మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచాలి
ఆర్డీవోకు వినతిపత్రం అందజేస్తున్న సీపీఐ నాయకులు

  • లేకుంటే 22న చలో విజయవాడ చేపడతాం

  • సీపీఐ ఆధ్వర్యంలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా

రాజమహేంద్రవరం అర్బన్‌, ఫిబ్రవరి 6: రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇస్తున్న మొత్తాన్ని రూ.లక్షా 80 వేల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్‌ చేశారు. అలాగే టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలన్నారు. సీపీఐ పోరుబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట లబ్ధిదారులతో కలసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ రూ.5 లక్షలకు పెంచాలని కోరుతూ నెలరోజులుగా గ్రామాలు, వార్డుల్లో తిరుగుతూ ప్రజల నుంచి సంతకాలు సేకరించామన్నారు. ఏ జగనన్న కాలనీకి వెళ్లినా ఇళ్లు 10 శాతం కూడా పూర్తికాలేదని, ప్రభుత్వం లబ్ధిదారులకు ఇస్తున్న రూ.లక్షా 80 వేలు చాలకపోవడమే దీనికి కారణమని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రతి ఇంటికీ రూ.4 లక్షలు ఇస్తుంటే మన రాష్ట్రంలో ఇంత తక్కువగా ఇవ్వడం శోచనీయమని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన మొండి వైఖరి విడనాడి రూ.5 లక్షలకు పెంచాలని, లేకుంటే ఈనెల 22న చలో విజయవాడ చేపడతామని ఆయన అన్నారు. అనంతరం 2,482 మంది సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని రాజమహేంద్రవరం ఆర్డీవోచైత్రవర్షిణికి అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కూండ్రపు రాంబాబు, వి.కొండలరావు, కొండేపూడి జ్యోతిరాజు, ఆచంట సత్యనారాయణ, లక్ష్మణ్‌రావు, చింతలపూడి సునీల్‌, సప్పా రమణ, యడ్ల లక్ష్మి, నల్లా రామారావు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:56:59+05:30 IST