‘ఫ్లెక్స్‌’ ఫైట్‌

ABN , First Publish Date - 2023-01-25T01:22:55+05:30 IST

ఫ్లెక్సీల ముద్రణ ఈనెల 26 నుంచి నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ఫ్లెక్సీ పరిశ్ర మల ఓనర్లు మూడు రోజుల నుంచి బంద్‌ పాటిస్తున్నారు.

‘ఫ్లెక్స్‌’ ఫైట్‌

రిపబ్లిక్‌ డే శకటాలకు ఫ్లెక్సీల ముద్రణ చేయమంటూ వాటి యజమానుల అల్టిమేటం

రేపటి నుంచి నిషేధం అమలు నేపథ్యంలో నిర్ణయం

ఇక క్లాత్‌ బేనర్లపైనే ముద్రించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు

ఫ్లెక్సీ పరిశ్రమలపై పెను ప్రభావం.. ఉపాధికీ దెబ్బే

(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి)

ఫ్లెక్సీల ముద్రణ ఈనెల 26 నుంచి నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ఫ్లెక్సీ పరిశ్ర మల ఓనర్లు మూడు రోజుల నుంచి బంద్‌ పాటిస్తున్నారు. తమ పొట్టకొట్టే ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని వారంతా కొంతకాలంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపఽథ్యంలో రిపబ్లిక్‌డే వేడుకల కోసం జిల్లాలో ఆయా శాఖ ప్రగతిని తెలియజేస్తూ తయారు చేసే శకటాల అలంకరణ కోసం ఫ్లెక్సీలు ముద్రించాలని కొందరు అధికారులు కోరగా ఫ్లెక్సీ ఓనర్లు నిరాకరించారు. తాము బంద్‌లో ఉన్నామని, అసలు ప్రభుత్వమే తమ పొట్టకొడుతూ ఈనెల 26 నుంచి ఫ్లెక్సీలు నిషేధించగా, ఇవాళ ప్రభుత్వ రథాల కోసం ఎలా తాము ఫ్లెక్సీలను ముద్రిస్తామని ఎదురు ప్రశ్నలు వేయడం గమనార్హం. ఎంతమంది బతిమలాడినా ఓనర్లు అంగీకరించలేదు. దీంతో శకటాల కోసం క్లాత్‌ల మీద బొమ్మలు వేయిస్తున్నారు. కొందరు తెలంగాణ, యానాం ప్రాంతాల నుంచి ఫ్లెక్సీలు తెచ్చుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. జిల్లాలో సుమారు 40 ఫ్లెక్సీ మిషన్లు ఉన్నాయి. ప్లాస్టిక్‌ నిషేధంలో భాగంగా ప్రభుత్వం ఫ్లెక్సీలను నిషేధించింది. దీన్ని ఈనెల 26 నుంచి కచ్చితంగా అమలుచేయాలని ఆదేశించింది. దీనికోసం నెల ముందు విజయవాడ సహా ఇతర ప్రాంతాల్లోనూ ఫ్లెక్సీ నిర్వాహకులతో అధికారులు సమావేశాలు నిర్వ హించారు. ప్రస్తుతం ఉన్న ఫ్లెక్స్‌లు మానేసి క్లాత్‌ మీద ముద్రించుకోవాలని సూచించారు. దానికి బ్యాంక్‌ల నుంచి రుణాలు కూడా ఇస్తామన్నారు. కానీ తర్వాత ఎవరినీ పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఫ్లెక్సీలు ముద్రించేవారు తీవ్ర నిరసన వ్య క్తంచేస్తున్నారు. మూడు రోజుల నుంచి మొత్తం ప్రింటింగ్‌ ఆపేశారు. ఇవాళ ఫ్లెక్సీ ఓ అవసరంగా మారిపోయింది. శుభ, అశుభకార్యాలు ఏవైనా ఫ్లెక్సీలు తప్పనిసరి అయ్యా యి. గతంలో సినిమా నటులతో పోస్టర్లు వచ్చేవి. వాటిని తలదన్నే విధంగా రాజకీయనేతలు, సంఘాలు, సినీనటుల అభిమానులు కూడా ఫ్లెక్స్‌లు పెట్టడం మామూలైంది. పెళ్లిళ్లకు, పుట్టినరోజులు, పుష్పవతి ఫంక్షన్లు, పంచికట్టు ఫంక్షన్లతోపాటు అటు వ్యాపార ప్రకటనల కోసం ఫ్లెక్స్‌లు ప్రధానమయ్యాయి. ఈనేపఽథ్యంలో వీటిని నిషేధించి, క్లాత్‌ ఫ్లెక్సీలు ముద్రించమనడంతో వీటి ఓనర్లు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. మిషన్‌ ఖరీదు లక్షల్లో ఉంటుంది. దీని హెడ్‌ ఒకటే రూ.50 వేల నుంచి లక్షన్నర వరకు ఉంది.

ఈ మిషన్లు వృఽథా : ఫ్లెక్సీ ఓనర్సు జిల్లా అధ్యక్షుడు

ప్రభుత్వం చెప్పినట్టు క్లాత్‌ ఫ్లెక్సీలు ముద్రించడానికి తమ వద్ద ఫ్లెక్సీ మిషన్లు పనిచేయవని, రూ.లక్షలు పెట్టి కొనుగోలు చేసిన మిషన్లు వృథా అవుతాయని ఫ్లెక్సీ ఓనర్ల జిల్లా అధ్యక్షుడు బుడ్డిగ రాధా ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన మంగళవారం మాట్లాడారు. ప్రస్తుతం తాము గంటకు 500 అడుగుల ఫ్లెక్స్‌లు ముద్రించగలమని, క్లాత్‌ అయితే 50 అడుగులు కూడా ముద్రించలేమన్నారు. చిన్న ఫ్లెక్స్‌ను ఇవాళ రూ.300కు చేయగలుగుతున్నామని, క్లాత్‌తో అయితే రూ.900 అవుతుందని సామాన్యులెవరూ ఫ్లెక్సీలు వేయించుకోలేరన్నారు. ఇక తమకు బ్యాంక్‌ రుణాలు ఇస్తామని అధికా రులు చెప్పారేకానీ ఇంతవరకూ అసలు పట్టించుకోలేదని, ప్రత్యామ్నాయం చూపించకుండా, వీటికన్నా ప్రమాదకరమైన ప్లాస్టిక్‌ను నిషేధించకుండా ఫ్లెక్సీలను నిషేధించ డం అన్యాయమన్నారు. ఒక్కో మిషన్‌ మీద ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ 20 మంది ఆధారపడి బతుకుతున్నారని తెలిపారు.

Updated Date - 2023-01-25T01:22:55+05:30 IST