కేంద్ర అభివృద్ధిలో రాష్ట్రం ప్రచారం తగదు

ABN , First Publish Date - 2023-01-26T00:06:47+05:30 IST

కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగే అభివృద్ధి పనుల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రచారం తగదని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసింహ్‌చౌహాన్‌ అన్నారు.

 కేంద్ర అభివృద్ధిలో రాష్ట్రం ప్రచారం తగదు

కడియం, జనవరి 25: కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగే అభివృద్ధి పనుల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రచారం తగదని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసింహ్‌చౌహాన్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండల పరిషత్‌ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులతో మాట్లాడారు. పథకాల అమలు తీరును పరిశీలించారు. ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్‌ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం నిధులను అభివృద్ధి పనులకు వినియోగించకుండా రాష్ట్ర ప్రభుత్వం వేరే పథకాలకు దారి మళ్లిస్తుందనే విషయంతో పాటు పలు సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మంత్రి ఆయా పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేసే పథకాలలో ఖచ్చితంగా ప్రధాని ఫొటో ఉండాలని ఎంపీడీవో కె.రత్నకుమారికి సూచించారు. దామిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్‌ ముద్రగడ సత్యస్వరూప భర్త, గ్రామ ఉపసర్పంచ్‌ ముద్రగడ వీరేష్‌(జమీ) మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు నేరుగా రావడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావడం వలన విద్యుత్‌ బిల్లువంటి వాటికి కోత విధిస్తున్నారని సహాయమంత్రి చౌహాన్‌ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బియ్యం పంపిణీలో ప్రధాని మోదీ ఫొటో ఉండేలా చూడాలని లేకుంటే తమ కార్యకర్తలు, నాయకులే ఆ వాహనంపై ప్రధాని ఫొటో ముద్రిస్తారని హెచ్చరించారు.

గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి

ప్రధాని నరేంద్రమోదీ గ్రామాల అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని అర్హులైన ప్రతీ పేదవానికి దక్కేలా అధికారులు కృషి చేయాలని కేంద్ర సహాయ మంత్రి చౌహాన్‌ సూచించారు. సహాయమంత్రి చౌహాన్‌ హిందీలో మాట్లాడుతుండగా ఆ విషయాలను ముద్రగడ వీరేష్‌(జమీ) తెలుగులో అనువదిస్తూ వివరించారు. పౌర సరఫరాలశాఖ ద్వారా పేదలకు సరఫరా బియ్యంలో 38 రూపాయలను కేంద్రప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. గ్రామంలో ఉన్న ప్రతీపౌరునికి రూ. 1,720 చొప్పున సగటున కేటాయించి గ్రామాల అభివృద్ధికి, మౌలిక వసతులు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందన్నారు. కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్రం దారిమళ్లించడం సరికాదన్నారు. మద్యం విక్రయం ద్వారా వచ్చే లాభాలను రాష్ట్రప్రభుత్వం పేదప్రజలకు ఉపయోగించాలన్నారు. నాయకులు చెక్కపల్లి మురళి, బీజెపీ నాయకులు ఆకుల శ్రీధర్‌, కొటికలపూడి వెంకటేశ్వరరావు, బొమ్ముల దత్తు, ఉలిశెట్టి సత్తిబాబు, మంచెం దుర్గారావు, సర్పంచ్‌ చెక్కపల్లి మురళి, తహసీల్దారు ఎం.సుజాత, ఎంపీడీవో కె.రత్నకుమారి, వ్యవసాయాధికారి ద్వారకాదేవి, ఎంఈవో వి.లజపతిరాయ్‌, గృహనిర్మాణ శాఖ అధికారి ఎన్వీ శ్రీకాంత్‌, ఐసీడీఎస్‌, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఫ అనంతరం కేంద్రప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన సీసీరోడ్లు, డ్రైన్లును కేంద్ర సహాయమంత్రి చౌహాన్‌ పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన బోర్డుపై రాష్ట్ర ప్రభుత్వ నిధులు అని నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం కేంద్రప్రభుత్వం నిధులు అంటూ బోర్డు మార్చాలని గ్రామ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం మండల బీజేపీ అధ్యక్షుడు కొటికలపూడి వెంకటేశ్వరరావు స్వగృహానికి వెళ్లి కొద్దిసేపు ముచ్చటించారు. ఆయనకు తొలుత గ్రామ సర్పంచ్‌ మార్గాని అమ్మాణీ ఏడుకొండులు, బీజెపీ నాయకులు స్వాగతం పలికారు.

Updated Date - 2023-01-26T00:07:23+05:30 IST