వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత

ABN , First Publish Date - 2023-01-26T01:07:23+05:30 IST

రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ వైఫల్యం చెందిందని కేంద్ర సమాచారశాఖ సహాయ మంత్రి దేవ్‌సిన్హా చౌహాన్‌ విమర్శించారు.

వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
బీజేపీ జిల్లా కార్యవర్గసమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవ్‌ సిన్హచౌహాన్‌

కేంద్ర పథకాల అమలుకు సహకారం లేదు

ఉద్యోగులకు జీతాల్లేవ్‌

రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నుంచే యాత్ర

బీజేపీ జిల్లా కార్యవర్గసమావేశం

కేంద్ర సహాయ మంత్రి చౌహాన్‌

రాజమహేంద్రవరం అర్బన్‌, జనవరి 25 : రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ వైఫల్యం చెందిందని కేంద్ర సమాచారశాఖ సహాయ మంత్రి దేవ్‌సిన్హా చౌహాన్‌ విమర్శించారు. రాజమహేంద్రవరం రివర్‌బే హోటలో బుధవారం జరిగిన బీజేపీ తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గసమావేశంలో ఆయన మాట్లా డారు. గతంలో ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా సాగనంపారో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని కూడా ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు ఉపాధిలేక ఇతర ప్రాంతాలకు వలసలు పోయే పరిస్థితి నెలకొందన్నారు. 14, 15వ ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు నిధులను ఇస్తుంటే ఆ నిధులను పక్కదారిపట్టిస్తున్నారని, నిధుల్లేక పోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని సర్పంచ్‌లు గగ్గోలు పెడుతున్నారన్నారు. మరోపక్క కేంద్ర పథకాల అమలుకు రాష్ట్రం సహకరించడంలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఇంటింటికీ ప్రచారం చేస్తున్న వలంటీర్లకు మాత్రమే జీతాలు చెల్లిస్తున్నారని, ప్రభుత్వోద్యోగులకు జీతాలు సక్రమంగా చెల్లించడంలేదని, పెన్షన్లు సరిగా అందడంలేదన్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నుంచే బీజేపీ విజయయాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ వారసత్వ, కుటుంబ, అవినీతి పార్టీలైన వైసీపీ, టీడీపీలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు. సంక్షేమం, అభివృద్ధి, అవినీతి లేకపోవడం రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు.అంతకుముందు ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులతో గంటన్నర పాటు సమావేశమై పలు విషయాలపై చర్చించారు. ఉదయం రాజమహేంద్రవరంలోని లా హాస్పిన్‌ హోటల్‌లో బీజేపీ జిల్లాస్థాయి కోర్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్రనాయకులు పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయడానికి అనుసరించాల్సిన వ్యూహం, ప్రణాళికలపై జిల్లా కేడర్‌కు దిశా నిర్దేశం చేసినట్టు తెలిసింది.ఏపీ బీజేపీ పార్టీ ఇన్‌ఛార్జి సునీల్‌ దేవధర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, రాష్ట్ర నాయకులు పైడా వేణుగోపాల్‌, బిట్ర శివన్నారాయణ, జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, ఓబీసీ మోర్చా జోనల్‌ ఇన్‌ఛార్జి కురగంటి సతీష్‌ పాల్గొన్నారు.

టిడ్కో గృహాల సందర్శన..

ధవళేశ్వరం, జనవరి 25 : ఏపీ టిడ్కో ఇళ్ళను కేంద్ర మంత్రి దేవ్‌సింగ్‌సిన్హా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో కలిసి సందర్శించారు. బుధవారం ధవళేశ్వరం విచ్చేసిన కేంద్రమంత్రి బొమ్మూరులోని టిడ్కో గృహాలను పరిశీలించారు. గృహాలను పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు మంజూరు చేయకపోగా నివాసం ఉంటున్నవారికి సరైన మౌళిక సదుపాయాలు కల్పించలేదంటూ మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Updated Date - 2023-01-26T01:07:25+05:30 IST