అంతర్వేది లక్ష్మీనరసింహుని తెప్పోత్సవం

ABN , First Publish Date - 2023-02-07T00:02:22+05:30 IST

అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా చివరి రోజు సోమవారం స్వామివారిని పుష్పక వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు.

 అంతర్వేది లక్ష్మీనరసింహుని తెప్పోత్సవం

అంతర్వేది, ఫిబ్రవరి 6: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా చివరి రోజు సోమవారం స్వామివారిని పుష్పక వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు అప్పనపల్లి వాస్తవ్యులు దంతుకుర్తి శివసుబ్రహ్మణ్యేశ్వరరావు వారిచే నిర్మితమైన పుష్పకవాహనంపై జరిగిన గ్రామోత్సవంలో స్వామివారిని మేళతాళాలు, బాణసంచా కాల్పులతో పురవీధుల్లో ఊరేగించి అనంతరం దేవస్థానం చెరువుగట్టు వద్దకు తీసుకువచ్చారు. తొలుత అర్చక స్వాములు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి చెరువులో ఉన్న హంస వాహనంపై తెప్పోత్సవాన్ని విద్యుత్‌ కాంతుల నడుమ ఘనంగా నిర్వహించారు. స్వామివారి తెప్పోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోవింద నృసింహ నామాలతో జేజేలు పలుకుతూ అఖండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వామివారు తెప్పోత్సవ విహార యాత్ర చేస్తున్న తరుణంలో భక్తులు స్వామివారితో పాటుచెరువు చుట్టూ తిరుగుతూ జేజేలు కొట్టారు. విష్ణుచక్రం, నాగసర్పంతో పాటు వివిధ రకాల బాణసంచా కాల్పులతో తెప్పోత్సవం కనుల పండువగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు పాణింగపల్లి శ్రీనివాసకిరణ్‌, పెద్దింటి వెంకటశ్రీనివాస్‌, స్థానాచార్యులు వింజమూరి రంగాచార్యులు, వేద పండితులు చింతా వెంకటశాస్త్రి, అర్చక స్వాముల సారథ్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో తెప్పోత్సవ నిర్వహణ విరాళ దాత గొట్టిముక్కల భీమరాజు, ఆలయ చైర్మన్‌, ఫ్యామిలీ ఫౌండర్‌ కలిదిండి కుమార రామగోపాల రాజాబహుద్దూర్‌, ఆలయ సహాయ కమిషనర్‌ వి.సత్యనారాయణ, సీఐ శేఖర్‌బాబు, ఎస్‌ఐ ఫణిమోహన్‌ పాల్గొన్నారు. రాత్రి 9 గంటలకు స్వామివారికి తిరుమంజనములు, దర్పణ సేవ, ధూపసేవ, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, శ్రీ పుష్పయాగోత్సవం, చెంగోళ విన్నపం, తీర్థగోష్టి నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామివారి పవళింపు సేవతో తీర్థ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి.ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, ఆర్డీవో వసంతరాయుడు, సర్పంచ్‌లు కొండా జాన్‌బాబు, పోతురాజు నరసింహరావు (కిషోర్‌), ఎంపీటీసీ బైరా నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:02:23+05:30 IST