సీఎం, సినీ హీరోలు హోదా కోసం బయటకు రావాలి: చలసాని

ABN , First Publish Date - 2023-01-26T03:46:08+05:30 IST

ఏపీకి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటానికి సీఎం జగన్‌, తెలుగు సినిమా హీరోలు కదలిరావాలని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు.

సీఎం, సినీ హీరోలు హోదా కోసం బయటకు రావాలి: చలసాని

హోదాతోనే రాష్ట్రానికి భవిష్యత్తు: రామకృష్ణ

అనంతలో ప్రారంభమైన ‘సమర యాత్ర’

అనంతపురం విద్య, జనవరి 25: ఏపీకి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటానికి సీఎం జగన్‌, తెలుగు సినిమా హీరోలు కదలిరావాలని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ‘సమర యాత్ర’ పేరిట చేపట్టిన బస్సు యాత్రను అనంతపురం నగరంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ వరకూ ర్యాలీ నిర్వహించారు. సభలో చలసాని ప్రసంగించారు. ‘‘ఉద్యోగాల కోసం యువత హైదరాబాద్‌, చెన్నై తదితర ప్రాంతాలకు వెళుతోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే స్థానికంగానే ఉద్యోగాలు లభిస్తాయి. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే ఈ బస్సు యాత్ర చేపట్టాం. ఈ పోరాటంలో పాల్గొనేందుకు సీఎం జగన్‌ బయటకు రావాలి. సినిమా హీరోలు కూడా ప్రత్యేక హోదా కోసం బయటకు రావాలి’’ అని చలసాని డిమాండ్‌ చేశారు. రామకృష్ణ మాట్లాడుతూ, ‘‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయాలి. హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి’’ అని పిలుపునిచ్చారు.

Updated Date - 2023-01-26T03:46:08+05:30 IST