శివరాత్రి ఉత్సవాల్లో సామాన్యులకే ప్రాధాన్యం: కలెక్టర్‌

ABN , First Publish Date - 2023-02-02T00:46:41+05:30 IST

ముక్కంటీశుడి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యత కల్పించాలని కలెక్టర్‌ వెంకట్రమణారెడ్డి అధికారులకు సూచించారు.

శివరాత్రి ఉత్సవాల్లో సామాన్యులకే ప్రాధాన్యం: కలెక్టర్‌

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 1: ముక్కంటీశుడి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యత కల్పించాలని కలెక్టర్‌ వెంకట్రమణారెడ్డి అధికారులకు సూచించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలోని త్రినేత్ర అతిధిగృహంలో శివరాత్రి ఉత్సవాల నిర్వహణపై సమీక్షా సమావేశం జరిగింది. ఏర్పాట్ల పురోగతిపై కలెక్టర్‌ ఆరా తీశారు.శివరాత్రి, రథోత్సవం, తెప్పోత్సవం, కల్యాణోత్సవం, గిరిప్రదక్షిణ రోజుల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా చేపట్టాల్సిన యాక్షన్‌ప్లాన్‌పై చర్చించారు. ఎస్పీ పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ రద్దీ రోజుల్లో భక్తుల భద్రతా దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ట్రాఫిక్‌ మళ్లింపు, పార్కింగ్‌ ప్రదేశాల కేటాయింపు, బందోబస్తు వివరాలను వెల్లడించారు. పట్టణవ్యాప్తంగా పెద్దసంఖ్యలో నిఘా నేత్రాలు ఏర్పాటు చేయడంతో పాటు కంట్రోల్‌ కమాండ్‌ రూమ్‌ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు వారం రోజుల ముందు నుంచే విస్తృతంగా ప్రచారం చేయాలని రెవెన్యూ అధికారులకు కలెక్టర్‌ సూచించారు.ఆలయ అనువంశిక ప్రధానార్చకుడు డాక్టర్‌ స్వామినాథన్‌ గురుకుల్‌ మాట్లాడుతూ ఉత్సవాల్లో జరిగే వైదిక సంప్రదాయ పూజలను వివరించారు.ఆలయ చైర్మన్‌ అంజూరు శ్రీనివాసులు, ఈవో సాగర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T00:46:42+05:30 IST