నిధులు రాబట్టడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2023-02-01T23:02:06+05:30 IST

తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్‌

నిధులు రాబట్టడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం
సమావేశంలో మాట్లాడుతున్న నరసింహయాదవ్‌

సత్యవేడు, ఫిబ్రవరి 1: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్‌ విమర్శించారు. బుధవారం సత్యవేడులో మాజీ ఎమ్మెల్యే హేమలత నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం, రైల్వేజోన్‌, రాజధాని అమరావతి నిర్మాణాలకు సంబంధించి బడ్జెట్‌లో ఊసే లేకపోవడం, ముమ్మాటికి ప్రభుత్వం అసమర్థతే అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం చంద్రబాబు రాష్ట్ర విభజన హామీల అమలు దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రాజెక్టులతో పాటు తీసుకొచ్చి రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టించారని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం చేతకానితనంతో బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల కేటాయింపే లేకుండాపోయిందని బాధాకరమన్నారు. రాక్షస మనస్తత్వం కలిగిన సీఎం జగన్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజా తిరుగుబాటు మొదలవడంతతో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని, త్వరలో వైసీపీ ఖాళీ అయిపోతుందన్నారు. నారా లోకేశ్‌ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఇది చూసి తట్టుకోలేక ఆరోపణలు, అవాస్తవాలతో సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యవేడు నియోజకవర్గంలో ఈ నెల 13, 14 తేదీల్లో జరగనున్న లోకేశ్‌ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, యుగంధర్‌రెడ్డి, రామాంజులనాయుడు, గోపినాథ్‌రెడ్డి, సుధాకర్‌ నాయుడు, భాస్కరన్‌, మునస్వామి యాదవ్‌, పరమశివం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:11:40+05:30 IST