ప్రజల భవిష్యత్తు కోసమే లోకేశ్‌ పాదయాత్ర

ABN , First Publish Date - 2023-01-25T00:07:22+05:30 IST

‘పార్టీ కోసం కాదు, రాష్ట్రం కోసం, ప్రజల భవిష్యత్తు కోసమే లోకేశ్‌ పాదయాత్ర చేస్తున్నాడు.. గ్రామస్థాయిలో వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేక పవనాలు ఈ యాత్రలో స్పష్టం కానున్నాయి.. అనుమతుల విషయంలో పోలీసులే ఇంతవరకు ఒక క్లారిటీకి రాలేదు.. వారిని నమ్మొద్దు... లోకేశ్‌ సభలో, పాదయాత్రలో పాల్గొననున్న ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చూసుకోవాలి... చిన్నపాటి సంఘటన జరిగినా తప్పు మనమీదకు నెట్టేయడానికి పోలీసులు, ప్రభుత్వమూ కాచుకుని ఉంది.. జాగ్రత్త’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులకు ఇచ్చిన పిలుపు ఇది.

 ప్రజల భవిష్యత్తు కోసమే లోకేశ్‌ పాదయాత్ర

వెల్లువెత్తనున్న ప్రభుత్వ వ్యతిరేక పవనాలు

జాగ్రత్త.. మన బందోబస్తు మనమే చూసుకుందాం

పోలీసులను నమ్మొద్దు

ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ కలగొద్దు

పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు

కుప్పం, జనవరి 24: ‘పార్టీ కోసం కాదు, రాష్ట్రం కోసం, ప్రజల భవిష్యత్తు కోసమే లోకేశ్‌ పాదయాత్ర చేస్తున్నాడు.. గ్రామస్థాయిలో వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేక పవనాలు ఈ యాత్రలో స్పష్టం కానున్నాయి.. అనుమతుల విషయంలో పోలీసులే ఇంతవరకు ఒక క్లారిటీకి రాలేదు.. వారిని నమ్మొద్దు... లోకేశ్‌ సభలో, పాదయాత్రలో పాల్గొననున్న ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చూసుకోవాలి... చిన్నపాటి సంఘటన జరిగినా తప్పు మనమీదకు నెట్టేయడానికి పోలీసులు, ప్రభుత్వమూ కాచుకుని ఉంది.. జాగ్రత్త’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులకు ఇచ్చిన పిలుపు ఇది. యువగళం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా లోకేశ్‌ తలపెట్టిన పాదయాత్ర ఈ నెల 27న కుప్పం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులతో మంగళవారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పార్టీ వర్గాల నుంచి సేకరించిన మేరకు ఆయన మాటలు క్లుప్తంగా..

‘లోకేశ్‌ పాదయాత్ర సందర్భంగా కుప్పంలో నిర్వహించనున్న బహిరంగ సభకు లక్షదాకా జనం వచ్చే అవకాశం, అంచనాలున్నాయి. బయటి నుంచి ఎంతమంది వచ్చినా కుప్పం నియోజకవర్గ ప్రజలే అధిక సంఖ్యలో కనిపించాలి. వారిని ఉత్తేజపరచి సభకు తీసుకురావడంలో గ్రామస్థాయి పార్టీ ప్రతినిధులు పనిచేయాలి. అలా వచ్చిన ప్రజలకు తాగునీరు, ఆహారం, వాహన సౌకర్యం కల్పించాలి. ఇందులో అలక్ష్యం వద్దు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వారికి కావాల్సిన అవసరాలు చూడాలి. రాష్ట్ర కమిటీ కూడా వస్తుంది. మీతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. అనుమతులు, బందోబస్తు కల్పించే విషయంలో ఇప్పటివరకు జరిగిన పరిణామాలు గమనిస్తే పోలీసులకే ఒక క్లారిటీ లేదు. వారు వచ్చి మనకు ఏదో బందోబస్తు ఇస్తారన్న భ్రమల్లో ఉండవద్దు. పైగా అప్రమత్తంగా ఉండండి. ఏ చిన్న అపశృతి దొర్లకుండా జాగ్రత్త వహించండి. మన కార్యకర్తలే సైనికులుగా బందోబస్తు ఏర్పాట్లు చూసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. మీరు సక్రమంగా క్షేత్రస్థాయికి వెళ్లి ప్రచారం చేయగలిగితే వారు తండోపతండాలుగా సభకు హాజరవుతారు. భావితరాల భవిష్యత్తు కోసం ప్రారంభిస్తున్న పాదయాత్ర ఇది. దీన్ని విజయవంతం చేయడం మనందరి కర్తవ్యం. లోకేశ్‌ ఒక్కరి కోసమో, నా కోసమో, పార్టీ కోసమో కానేకాదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం ప్రజల తరఫున సైనికుల్లా పనిచేద్దాం.’ అని చంద్రబాబు ముక్తాయించారు.

Updated Date - 2023-01-25T00:07:22+05:30 IST