రేపటి నుంచే లోకేశ్ పాదయాత్ర
ABN , First Publish Date - 2023-01-26T03:36:43+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ‘యువగళం’ పేరిట చేపట్టే పాదయాత్ర శుక్రవారం కుప్పం నుంచి ప్రారంభం కానుంది. ఆ పార్టీ నాయకులు అక్కడ భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

కుప్పం సభకు టీడీపీ భారీ ఏర్పాట్లు... హైదరాబాద్ నివాసంలో ఉద్విగ్నం.. ఉద్వేగం!
తల్లిదండ్రులకు యువ నేత పాదాభివందనం.. భుజం తట్టి సాగనంపిన చంద్రబాబు.. కడప గడపలో ఘన స్వాగతం
దేవునికడప, అమీన్‌పీర్ దర్గా, కేథడ్రల్ చర్చిలో లోకేశ్ ప్రార్థనలు.. అర్ధరాత్రికి తిరుమల చేరిక
చిత్తూరు/హైదరాబాద్/కడప, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ‘యువగళం’ పేరిట చేపట్టే పాదయాత్ర శుక్రవారం కుప్పం నుంచి ప్రారంభం కానుంది. ఆ పార్టీ నాయకులు అక్కడ భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా బహిరంగ సభకు సన్నాహాలను సీనియర్ నేతలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 4 వేల కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్ర! 400 రోజుల పాటు తల్లిదండ్రులకు, భార్యాబిడ్డలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. దీంతో హైదరాబాద్ నుంచి బుధవారం ఆయన బయల్దేరిన సందర్భంగా ఆయన ఇంటిలో ఉద్విగ్న.. ఉద్వేగభరిత వాతావరణం చోటు చేసుకుంది. తొలుత లోకేశ్ తమ ఇంట్లోని పూజ గదిలో తమ ఇలవేల్పు వెంకటేశ్వరస్వామికి కుటుంబంతో కలిసి పూజ చేశారు. అనంతరం తల్లిదండ్రులు భువనేశ్వరి, చంద్రబాబుల పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. భువనేశ్వరి ఆయన్ను గట్టిగా హత్తుకున్నారు. అత్తామామలు వసుంధర, నందమూరి బాలకృష్ణ, వసుంధర పాదాలకూ లోకేశ్ మొక్కారు. భార్య బ్రాహ్మణి హారతి ఇచ్చి నుదుట తిలకం దిద్దారు. కారు బయల్దేరే ముందు కొబ్బరికాయ దిష్టితీసి కొట్టారు. లోకేశ్ తన కొడుకు దేవాన్ష్‌ను గాఢంగా హత్తుకుని ముద్దు పెట్టారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలను గుర్తించాలని, పరిష్కారానికి మార్గాన్వేషణ జరపాలని ఈ సందర్బంగా చంద్రబాబు ఆయనకు సూచించారు. భుజం తట్టి సాగనంపారు. నివాసానికి వచ్చి వీడ్కోలు పలికిన బంధువులు, పార్టీ నేతలతో లోకేశ్ కరచాలనం చేశారు. అనంతరం ఇంటి నుంచి ఎన్టీఆర్ ఘాట్‌కు బయల్దేరారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, శ్రేణులు బైక్ ర్యాలీతో ఆయన్ను అనుసరించారు. ఘాట్‌లో ఎన్టీఆర్ సమాధికి లోకేశ్ నివాళులు అర్పించారు. అనంతరం శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. టీడీపీ బైక్ ర్యాలీ అక్కడి వరకూ కొనసాగింది. చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలి.. సైకో పోయి.. సైకిల్ రావాలి వంటి నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, షరీఫ్, కేశినేని చిన్నా, సాయిబాబు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కంభంపాటి రామ్మోహన్రావు, బక్కని నర్సింహులు, అరవింద్‌కుమార్, దామచర్ల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
కుప్పంలో టీడీపీ నేతలు..
కుప్పంలో లోకేశ్ పాదయాత్రకు టీడీపీ నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ బహిరంగ ఏర్పాట్లను మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి, చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, కుప్పం ఎన్నికల పరిశీలకుడు గాజుల ఖాదర్‌బాషా, స్థానిక నాయకులు బుధవారం పరిశీలించారు. కుప్పం నియోజకవర్గంలో మూడ్రోజులపాటు లోకేశ్ పాదయాత్ర చేసే ప్రాంతాలనూ పరిశీలించారు. శుక్రవారం ఆయన పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద ఉన్న ఎన్టీఆర్, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేస్తారు. లక్ష్మీపురం మసీదులో ముస్లిం మైనారిటీలతో సమావేశమవుతారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం పాదయాత్రకు సంబంధించి రెండు పాటలను రూపొందించారు.
విజయానికి ప్రణాళికలు..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పాదయాత్రను విజయవంతం చేయడంపై టీడీపీ నాయకులు నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటుచేసుకుని ప్రణాళికలు రచిస్తున్నారు. కుప్పానికి వచ్చే శ్రేణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భోజనాలు ఏర్పాటు చేయాలని అధినేత చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు కుప్పంలో నాలుగు ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేసి సుమారు 70 వేల మందికి భోజనాలు సిద్ధం చేస్తున్నారు. తొలిరోజు చంద్రబాబు మినహా పార్టీ ప్రధాన నాయకులంతా కుప్పానికి వస్తున్నట్లు సమాచారం. పార్టీ ప్రముఖులు, 175 నియోజకవర్గాల ఇన్చార్జులు రానున్నట్లు తెలిసింది.
కడపలో సర్వమత ప్రార్థనలు
శంషాబాద్ నుంచి విమానంలో సాయంత్రం 4.40 గంటలకు కడప విమానాశ్రయంలో దిగిన లోకేశ్‌కు రాయలసీమ, కోస్తా జిల్లాల టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. 5.15 గంటలకు అక్కడి నుంచి 800కిపైగా వాహనాలతో భారీ ర్యాలీగా తిరుమల వేంకటేశ్వరుని తొలిగడప దేవునికడపకు వెళ్లారు. లక్ష్మీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమీన్‌పీర్ పెద్ద దర్గా చేరుకుని చాదర్ సమర్పించి ప్రార్థనలు నిర్వహించారు. మరియాపురంలోని రోమన్ కెథడ్రల్ చర్చికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కడప నగరంలో నాలుగు గంటల పాటు లోకేశ్ పర్యటన సాగింది. అనంతరం ఆయన రాయచోటి మీదుగా అర్ధరాత్రి 12 గంటలకు తిరుమల చేరుకున్నారు. జీఎంఆర్ అతిథిగృహంలో బస చేశారు. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నాక 10.30 గంటలకు కుప్పం బయల్దేరతారు.
కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు భారీగా కడప విమానాశ్రయానికి చేరుకున్న టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. కొంత మంది నేతలను మాత్రమే లోపలకు అనుమతించారు. ఎమ్మెల్సీ బీటెక్ రవి రెండు వాహనాల్లో వెళ్తుండగా పోలీసులు గేటు వద్దే ఆపేశారు. గేటు నెట్టుకుంటూ లోనికి వెళ్లేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించా యి. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మా రడంతో చివరకు బీటెక్ రవి వాహనాలను విమానాశ్రయంలోకి అనుమతించారు.
నాడు జగన్‌కున్న ఆంక్షలే నేడు లోకేశ్‌కూ..: ఎస్పీ
లోకేశ్ పాదయాత్రపై పోలీసులు పలు ఆంక్షలు పెట్టడంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు అనుమతి పత్రాలను తీసునేందుకు నిరాకరించడం.. దీంతో వాటిని పోలీసులు వారికి ఆన్లైన్లో పంపించిన సంగతి తెలిసిందే. బుధవారం చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి తన కార్యాలయంలో ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. పాదయాత్ర తొలిరోజు ఏ స్థాయిలో భద్రత కల్పించాలనే విషయాలపై చర్చించినట్లు తెలిసింది. కాగా.. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ పాదయాత్ర చేసే సమయంలో ఆయనకు విధించిన ఆంక్షలనే ఇప్పుడూ విధించామని, అనవసరంగా మీడియా వక్రీకరిస్తోందని ఎస్పీ పేర్కొన్నారు. లోకేశ్ పాదయాత్రపై ఆంక్షలకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలను ఓ ప్రకటనలో ఆయన ఖండించారు. ‘చట్ట ప్రకారం, సుప్రీంకోర్టు గత ఆదేశాల ప్రకారం పాదయాత్రలకు అమల్లో ఉన్న నిబంధనలను మాత్రమే లోకేశ్‌కు సూచించాం. ఇందులో ఎలాంటి పక్షపాతం, వివక్ష లేదు.’ అని సూచించారు. లోకేశ్ పాదయాత్రకు అన్ని రకాల రక్షణ కల్పిస్తూ, గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి చెప్పారు. ఈ అంశంపై బుధవారం ఎస్పీతో సమావేశమై చర్చించినట్లు ‘ఆంధ్రజ్యోతి’కి తెలియజేశారు.
లాడ్జీలు ఫుల్
కుప్పం చిన్నపట్టణం కావడంతో లాడ్జీలు పరిమితంగానే ఉన్నాయి. అందులోనూ పెళ్లిళ్ల సీజన్ కావడంతో 26, 27, 28 తేదీల్లో కల్యాణ మండపాలూ ఖాళీగా లేవు. ఇప్పటికే టీడీపీ నాయకులు, పోలీసులు ఆన్లైన్లో, నేరుగా అన్ని లాడ్జీలను బుక్ చేసుకున్నా రు. బుధవారం సాయంత్రానికి ఒక్క గదీ ఖాళీ లేదు.