Padayatra: నారా లోకేష్‌తో కలిసి అడుగేసిన చిత్తూరు న్యాయవాదులు

ABN , First Publish Date - 2023-02-06T14:24:27+05:30 IST

చిత్తూరు: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర (Padayatra)లో చిత్తూరు న్యాయవాదులు (Lawyers) పాల్గొన్నారు.

Padayatra: నారా లోకేష్‌తో కలిసి అడుగేసిన చిత్తూరు న్యాయవాదులు

చిత్తూరు: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర (Padayatra)లో చిత్తూరు న్యాయవాదులు (Lawyers) పాల్గొన్నారు. ఈ సందర్బంగా లాయర్లు మాట్లాడుతూ యువ న్యాయవాదుల నైపుణ్యాభివృద్ధి కోసం చిత్తూరులో లా అకాడమీ (Law Academy) ప్రారంభించాలని, న్యాయవాదుల మరణానంతరం కుటుంబాలకు ఇచ్చే భృతిని రూ. 10 లక్షలకు పెంచాలన్నారు. ఆర్థిక భరోసాలేని న్యాయవాదుల కుటుంబసభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలని, న్యాయవాదులకు మార్కెట్ ధరపై ఇళ్లస్థలాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రూ. 40.32 కోట్లతో చేపట్టిన చిత్తూరు కోర్టు భవన నిర్మాణాలకు నిధులు వెంటనే విడుదల చేసి త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

న్యాయవాదుల సమస్యలపై స్పందించిన లోకేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం (Jagan Govt.) అధికారంలోకి వచ్చాక న్యాయవ్యవస్థపై కక్షగట్టిందని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా న్యాయమూర్తులను అవమానిస్తూ వైసీపీ (YCP) పెద్దలే పోస్టులు పెట్టి సీబీఐ (CBI) విచారణను ఎదుర్కొంటున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి న్యాయవ్యవస్థపై నమ్మకం లేదని, న్యాయవాదుల సంక్షేమానికి బడ్జెట్‌లో కేటాయించిన రూ.100 కోట్ల నిధులను తక్షణమే విడుదలచేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయవాదుల డెత్ క్లెయిమ్‌ను రూ. 10 లక్షలకు పెంచుతామన్నారు. చిత్తూరు కోర్టు భవన నిర్మాణాలను పూర్తి చేస్తామని, న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. కాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర 11వ రోజు సోమవారం ఉదయం మంగసముద్రంలోని విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ఈరోజు చిత్తూరులోకి ప్రవేశించనుంది.

కాగా నిన్నటి పాదయాత్రలో లోకేష్ సీఎం జగన్‌కు సవాల్ విసిరారు... ‘జగన్‌రెడ్డీ.. రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చింది ఎవరో? వాటిని రాష్ట్రం విడిచి పారిపోయేలా చేస్తున్నది ఎవరో చర్చిద్దాం రండి..’ అంటూ సవాల్‌ విసిరారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రానికి వేలాది పరిశ్రమలు రప్పించారని, వాటి ద్వారా 6 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించారని లోకేశ్‌ గుర్తు చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం పరిశ్రమలు రాష్ట్రం వదలి పారిపోయేలా చేస్తోందని ధ్వజమెత్తారు. గ్రామాల్లో అభివృద్ధి లేదని, ప్రజలకు ముఖం చూపించలేక పరదాల చాటున ముఖ్యమంత్రి పర్యటనలు జరుపుతున్నారని ఎద్దేవా చేశారు. తన పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ, యువకులు, చెల్లెమ్మలు ఉప్పెనలా వచ్చి తనకు బ్రహ్మరథం పడుతుండడం వల్లే ప్రభుత్వం భయపడి పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. జగన్‌ ఇచ్చిన ప్రతి మాట తప్పారని, ప్రతి వర్గాన్నీ మోసగించి ద్రోహిగా మిగిలిపోయాడని విమర్శించారు. ‘గుడివాడలో సన్న బియ్యం సన్నాసి తాగి, ఒళ్లు తెలియకుండా వాగుతున్నాడు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే జనం చెప్పులతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు’ అంటూ కొడాలి నానిని లోకేశ్‌ హెచ్చరించారు. ఆదివారం 13.5 కిలోమీటర్లు నడిచిన లోకేశ్‌.. మొత్తం మీద 130.6 కిలోమీటర్ల దూరం పాదయాత్ర పూర్తి చేశారు.

Updated Date - 2023-02-06T14:24:31+05:30 IST