అడ్డగోలుగా అంతరాలయ దర్శనాలు

ABN , First Publish Date - 2023-02-07T00:05:37+05:30 IST

భక్తుల రద్దీతో కిక్కిరిసిన ముక్కంటి ఆలయం

అడ్డగోలుగా అంతరాలయ దర్శనాలు
ఆలయ ఆవరణలో సోమవారం నాటి భక్తుల రద్దీ

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 6: శ్రీకాళహస్తీశ్వరాలయంలో అడ్డగోలుగా అంతరాలయ దర్శనాలు జరుగుతున్నాయంటూ భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. అంతరాలయం దర్శనం చేసుకునే భక్తులకు పంచ ధరించాలనే నిబంధన విధించారు. అయితే అంతరాలయం వద్ద విధులు నిర్వహించే అర్చకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అంతరాలయంలో హారతి పళ్లేలతో దక్షిణ వసూలు చేయకూడదని కొద్ది నెలల క్రితం ఆంక్షలు విధించారు. ఇద్దరు అర్చకులను దక్షిణ వసూలు చేస్తుండగా గుర్తించి సస్పెండ్‌ కూడా చేశారు. కానీ వసూళ్ల తీరు మాత్రం మారలేదు. అంతరాలయ దర్శనాల కోసం సిఫార్సులపై వచ్చేవారు, ప్రముఖులను అనుమతించాలి. కానీ స్వామివారి సన్నిధిలో సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్లు మూడు రోజుల నుంచి భక్తులు గగ్గోలు పెడుతున్నారు. ఆదివారం మాఘ పూర్ణిమ కావడంతో భక్తులు పెద్దఎత్తున పోటెత్తారు. ఎంత రద్దీ ఉన్నా అక్కడ పనిచేసే అర్చకులు తమకు అయిన వారిని అంతరాలయ దర్శనాలకు అనుమతించారు. దీంతో క్యూలైన్లు నెమ్మదిగా సాగాయి. సోమవారం కూడా ఇష్టానుసారం అంతరాలయ దర్శనాలు సాగడంతో భక్తులు అసహనం వ్యక్తం చేశారు. స్వామివారి సన్నిధిలో ముఖ మండపం వద్ద స్వామివారి ఏకాంతసేవ ఉత్సవమూర్తిని ఏర్పాటు చేస్తారు. గడప వద్ద ఏకాంతసేవ ఉత్సవమూర్తి ఉండగా ఎవరూ అంతరాలయంలోకి వెళ్లడానికి శాస్త్ర నియమం అంగీకరించదు. ఇదే అదనుగా అర్చకులు తమకు అయినవారు వచ్చిన వెంటనే ఉత్సవమూర్తిని ఆఘమేఘాలపై అక్కడి నుంచి తీసి లోపలపెట్టి అంతరాలయ దర్శనాలు చేయిస్తున్నారు. తమ వారు ఎవరూలేనప్పుడు ఉత్సవమూర్తిని గడపవద్ద కొలువుదీరుస్తున్నారు. వరుసగా మూడు రోజులు ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా నమోదైంది. ఇలాంటి సమయంలోనూ అంతరాలయ దర్శనాలు గందరగోళంగా జరగడం చర్చనీయాంశం అయింది. ఇక సెల్‌ఫోన్‌తో ఆలయంలోకి ఎవరూ ప్రవేశించకూడదని ఆలయ ఈవో సాగర్‌బాబు కొద్ది నెలల కిత్రం ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరు ఆలయ ఉద్యోగులకు సెల్‌ఫోన్‌లను ఆలయంలోకి తీసుకెళ్లిన కారణంగా రూ.5వేలు జరిమానా కూడా విధించారు. అయితే స్వామివారి సన్నిధిలో అర్చకులు మాత్రం వస్త్రాలలో దాచుకుని దర్జాగా సెల్‌ఫోన్లను ఆలయంలోకి తీసుకెళుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి అంతరాలయ దర్శనాలు, దక్షిణ వసూళ్లపై దృష్టి సారించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం భక్తుల రద్దీతో కిక్కిరిసింది. మాఘ మాసం సోమవారం శివునికి ప్రీతికరమైన రోజు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సుమారు 27వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Updated Date - 2023-02-07T00:05:40+05:30 IST