ఏనుగుల దాడుల్లో మృతులకు పరిహారం పెంపు

ABN , First Publish Date - 2023-05-26T00:40:04+05:30 IST

ఏనుగల దాడుల్లో మృతి చెందిన వారి కుటుంబీకులకు నష్టపరిహారం పెంచేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని కలెక్టర్‌ షన్మోహన్‌ అన్నారు.

ఏనుగుల దాడుల్లో మృతులకు పరిహారం పెంపు
వీసీలో మాట్లాడుతున్న కలెక్టర్‌

ప్రతిపాదనలు పంపించిన కలెక్టర్‌

జిల్లాలోకి సుమారు 123 ఏనుగులు

చిత్తూరు కలెక్టరేట్‌, మే 25: ఏనుగల దాడుల్లో మృతి చెందిన వారి కుటుంబీకులకు నష్టపరిహారం పెంచేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని కలెక్టర్‌ షన్మోహన్‌ అన్నారు. గురువారం ఆయన కలెక్టరేట్‌ నుంచి అటవీ, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో ముందస్తుగా గుర్తించి విద్యుత్తు సరఫరా నిలిపేయాలని అధికారులకు సూచించారు. అటవీ ప్రాంతాల్లో ఉన్న విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల ఎత్తు పెంచేందుకు జాయింట్‌ సర్వే నిర్వహించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఏనుగుల దాడుల్లో పంటలు నష్టపోయినవారికి హెక్టారుకు రూ.10వేలు, ఎకరాకు రూ.6 వేలు చొప్పున నష్టపరిహారం అందిస్తున్నామన్నారు. కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి సుమారు 123 ఏనుగులు పలమనేరు, కుప్పం అటవీ ప్రాంతాల్లో ఉన్నాయని, వాటి వల్ల తరచూ ప్రాణ, ఆస్తి నష్టాలు జరుగుతున్నాయన్నారు. అటవీ భూములను ఎకో టూరిజం అభివృద్ధి కోసం పర్యాటక శాఖకు అందించామన్నారు. బంగారుపాళ్యం, సోమల, గుడుపల్లె, పెద్దపంజాని మండలాల్లో రీసర్వే చేసేటప్పుడు అటవీ భూములకు సంబంధించిన సమాచారం ఎఫ్‌ఆర్‌వోలకు తెలియజేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో రాజేశేఖర్‌, ఫారెస్టు సెటిల్‌మెంట్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌ నాయుడు, ట్రాన్స్‌కో డీఈ హరి, గిరిజన సంక్షేమశాఖ అధికారి మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T00:40:04+05:30 IST