నేనూ ‘అట్రాసిటీ’ బాధితుడినే

ABN , First Publish Date - 2023-02-07T03:04:28+05:30 IST

‘టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకలు దాడి చేసినప్పుడు అక్కడకు వచ్చి ఫొటోలు తీస్తున్న నాయక్‌ అనే సీఐని మా కార్యకర్తలు ప్రశ్నించారు.

నేనూ ‘అట్రాసిటీ’ బాధితుడినే

11వ రోజు 9.2 కి.మీ.నడక

దళితులపైనే ఎస్సీ, ఎస్టీ కేసుల ఘనత జగన్‌దే

వారిని చంపేసి.. శవాల డోర్‌ డెలివరీ

సీఎం, మంత్రి పెద్దిరెడ్డి పక్కన దళిత డిప్యూటీ సీఎంకు కుర్చీ ఉండదు

ఇదీ వారికి వైసీపీ ప్రభుత్వం ఇచ్చే గౌరవం

ఎస్సీల సంక్షేమానికి ఎవరెంత ఖర్చు చేశారో చర్చకు సిద్ధమా?

చిత్తూరు పాదయాత్రలో సర్కారుకు లోకేశ్‌ సవాల్‌

చిత్తూరు/చిత్తూరు సిటీ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ‘టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకలు దాడి చేసినప్పుడు అక్కడకు వచ్చి ఫొటోలు తీస్తున్న నాయక్‌ అనే సీఐని మా కార్యకర్తలు ప్రశ్నించారు. దీంతో నాపైన, ఎమ్మెల్సీ అశోక్‌బాబుపైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు పెట్టారు. ఇలా జగన్‌రెడ్డి రాజ్యంలో నేను కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితుడినే’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ వ్యాఖ్యానించారు. చిత్తూరులో సోమవారం జరిగిన యువగళం 11వ రోజు పాదయాత్రలో ఆయన 9.2 కిలోమీటర్లు నడిచారు. దళితులు, బీమా మిత్రలు, బీడీ కార్మికులు, న్యాయవాదులు, విద్యుత్‌ ఉద్యోగులు, మహిళలు ఆయన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకొన్నారు. దళితులతో జరిగిన సమావేశంలో లోకేశ్‌ మాట్లాడుతూ.. పులివెందులలో ఎస్సీ మహిళ నాగమ్మను అత్యాచారం చేసి హత్యచేస్తే ఇంతవరకు ప్రభుత్వం ఆ కుటుంబానికి న్యాయం చేయలేదన్నారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన టీడీపీ నేతలు ఎంఎస్‌ రాజు, వంగలపూడి అనితపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని ఆక్షేపించారు. అమరావతిలోనూ దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి.. సంకెళ్లు వేసి జైలుకు తీసుకెళ్లారని గుర్తుచేశారు. దళితులపైనే అట్రాసిటీ కేసులు పెట్టిన ఘన చరిత్ర జగన్‌దేనని ఎద్దేవాచేశారు. ఎస్సీల సంక్షేమానికి ఎవరెంత ఖర్చు చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. మాల, మాదిగ కార్పొరేషన్లు పెట్టి ఎంత నిధులు ఖర్చుచేశారో మంత్రి మేరుగ నాగార్జున సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్‌ను చంపి మృతదేహాన్ని ఆయన ఇంట్లో అప్పగించిన ఘటనను ప్రస్తావిస్తూ.. జగన్‌ సీఎం అయ్యాక దళితులను చంపి శవాలను డోర్‌ డెలివరీ చేయడానికి వైసీపీ వాళ్లకు లైసెన్సులు ఇచ్చారని మండిపడ్డారు. ‘చిత్తూరు జిల్లాకు చెందిన నారాయణస్వామికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. జగన్‌రెడ్డి, పెద్దిరెడ్డి కూర్చున్నచోట ఆయన కూర్చోవడానికి కుర్చీ కూడా ఉండదు. అదీ వైసీపీ ప్రభుత్వం దళితులకిచ్చే గౌరవం’అని వ్యాఖ్యానించారు.

తల్లిని రాజ్యసభకు పంపకుండా..

మహిళలతో సమావేశంలో లోకేశ్‌ మాట్లాడుతూ.. జగన్‌ తల్లి విజయలక్ష్మి వైసీపీని కాపాడారని.. ఆమె ఎంపీగా విశాఖపట్నంలో పోటీ చేసి రెండు లక్షల ఓట్లతో ఓడిపోతే.. ఆమెను రాజ్యసభకు పంపాల్సి ఉండగా. అలా చేయకుండా గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తొలగించి అవమానించారని ధ్వజమెత్తారు. ‘జగన్‌ చెల్లెలు షర్మిల పాదయాత్ర, బస్సుయాత్ర చేసినా ఆమెను ఛీ పో అని గెంటేశాడు. తన తండ్రి మృతిపై సీబీఐ విచారణ వేయించాలని వివేకా కుమార్తె, మరో చెల్లెలు సునీత కోరితే ఆమెను కూడా గెంటేశాడు. వివేకా హత్యకు సంబంధించి తొలుత చంద్రబాబు, బీటెక్‌ రవిపై ఆరోపణలు చేసిన జగన్‌ ఇప్పుడు మౌనంగా ఉన్నాడు. సీబీఐ అధికారులు ఇప్పుడు చంద్రబాబును, బీటెక్‌ రవిని విచారణకు పిలుస్తున్నారా.. భారతి రెడ్డి పీఏను, అవినాశ్‌రెడ్డిని పిలుస్తున్నారా’ అని ప్రశ్నించారు. కాగా.. న్యాయవాదులు పాదయాత్రలో లోకేశ్‌తో కలిసి అడుగులు వేశారు. తమ సమస్యలు చెప్పుకొన్నారు. రెగ్యులరైజ్‌ చేస్తామని హామీ ఇచ్చిన జగన్‌.. సీఎం అయ్యాక మోసం చేశారని ఏపీ సదరన్‌ డిస్కం కాంట్రాక్టు ఉద్యోగులు మొరపెట్టుకున్నారు. సంతపేటలో బీడీ కార్మికులు తమ సమస్యలు చెప్పుకోగా.. టీడీపీ వచ్చాక చంద్రన్న బీమా అమలు చేసి ఆదుకుంటామని లోకేశ్‌ హామీ ఇచ్చారు. టీడీపీ వచ్చాక చంద్రన్న బీమా, అభయహస్తం అమలు చేసి.. బీమామిత్రల సేవలు కొనసాగిస్తామన్నారు.

139.8 కిలోమీటర్లు పూర్తి

లోకేశ్‌ పాదయాత్ర 11వ రోజైన సోమవారం 9.2 కిలోమీటర్లు సాగింది. ఈ 11 రోజుల్లో మొత్తం 139.8 కిలోమీటర్లు ఆయన నడిచారు. మంగళవారం కూడా చిత్తూరులోనే యాత్ర సాగనుంది. నగరమంతా లోకేశ్‌ కటౌట్లు, బ్యానర్లతో నిండిపోయింది. కాలేజీ విద్యార్థులు బయటకు వచ్చి లోకేశ్‌కు అభివాదం చేశారు. ఆయన కూడా వారందరితో కలిసి సెల్ఫీ దిగారు.

టీడీపీ కార్యకర్తలకు బెయిల్‌

బంగారుపాళ్యంలో పాదయాత్ర సందర్భంగా లోకేశ్‌ బహిరంగసభ నిర్వహించకుండా పోలీసులు అడ్డుకు న్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమను చంపాలని ప్రయత్నించారంటూ నలుగురు టీడీపీ కార్యకర్తలు కేశవ, చరణ్‌, షబ్బీర్‌, అశోక్‌లపై పోలీసులు సెక్షన్‌ 307కింద హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఆ సెక్షన్‌ వర్తించదంటూ కోర్టు సోమవారం ఆ నలుగురికీ బెయిల్‌ మంజూరుచేసింది. దీంతో వారు చిత్తూరు శిబిరం వద్ద లోకేశ్‌ను కలిశారు. ఆయన వారిని అభినందించి.. అధికారంలోకొచ్చాక తప్పుడు కేసులు మాఫీ చేస్తామన్నారు.

వారి శాపాలే సమాధిరాళ్లు

ఈ రోజు మంగసముద్రం క్యాంప్‌సైట్‌ నుంచి బయలుదేరే సమయంలో బీమా మిత్రు లు నన్ను కలిశారు. చిత్తూరులో న్యాయవాదులు యువగళానికి సంఘీభావం తెలిపారు. నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో కోర్టు భవనాల నిర్మాణం నత్త నడకనసాగుతోందన్నారు. తన కూతురికి అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం ఉందని చెప్పి తన పెన్షన్‌ తీసేశారని చిత్తూరు పీర్ల చావిడికి చెందిన జయకల్యాణి నా వద్ద గోడు వెళ్లబోసుకుంది. చిత్తూరులో మహిళలతో సమావేశమయ్యాను. 6నెలల క్రితం పెన్షన్‌ ఆపేశారని, వలంటీర్‌ను అడిగితే టీడీపీ వాళ్లకు పెన్షన్‌ రాదని చెప్పారని జ్యోతి అనే వృద్ధురాలు చెప్పింది. ఇంత మంది అక్కా చెల్లెళ్లతో కంటతడి పెట్టిస్తున్న సైకో ముఖ్యమంత్రీ.. వారి శాపాలే వచ్చే ఎన్నికల్లో నీ ప్రభుత్వానికి సమాధిరాళ్లుగా మారబోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో జగన్‌, వైసీపీ నేతలు ఇంటింటికీ వచ్చి అందరికి కిలో బంగా రం ఇస్తామని చెబుతారు. చీపుర్లు పట్టుకుని తరమండి.

Updated Date - 2023-02-07T03:11:26+05:30 IST