ఏర్పాట్ల హోరు.. తెలుగు తమ్ముళ్ల జోరు

ABN , First Publish Date - 2023-01-26T02:10:29+05:30 IST

కుప్పంలో ఎన్నడూలేని హడావిడి కనిపిస్తోంది. టీడీపీలోనూ సరికొత్త ఉత్తేజం కొట్టొచ్చినట్లు ఉట్టిపడుతోంది.

ఏర్పాట్ల హోరు.. తెలుగు తమ్ముళ్ల జోరు

కుప్పం, జనవరి 25: కుప్పంలో ఎన్నడూలేని హడావిడి కనిపిస్తోంది. టీడీపీలోనూ సరికొత్త ఉత్తేజం కొట్టొచ్చినట్లు ఉట్టిపడుతోంది. ఆ పార్టీ యువతలోనే కాదు.. నియోజకవర్గ సరికొత్త యువతరంలోనూ ఏదో తెలియని జోష్‌ పెరుగుతోంది. తమ ప్రతినిధిగా కుప్పంనుంచి యువగళం పేరుతో లోకేశ్‌ ప్రారంభించనున్న పాదయాత్రపైనే వారు ఆశలు పెట్టుకున్నారు. నిరుద్యోగ సమస్యతో వేగిపోతున్న యువతరంతోపాటు అభివృద్ధి మృగ్యమై, సంక్షేమ పథకాల కోతలు నిత్యమై ఈతిబాధలు పడుతున్న సామా న్య జనంలోనూ లోకేశ్‌ ఏమి చెప్పబోతున్నారన్న ఆసక్తి నెలకొంది. తమ అభిమాన నాయకుడు, స్థానిక ఎమ్మెల్యే తనయుడిగానే కాదు, యువతరం ప్రతినిధిగాను, రాష్ట్ర భవిష్యత్తు పథ నిర్దేశకుడిగా ఆయన్ను చూడగలిగే సందర్భం ఇది. అందుకే నియోజకవర్గం మొత్తం లోకేశ్‌ రాకకోసం ఎదురుతెన్నులు చూస్తోంది.ఈ పాదయాత్రపై టీడీపీ శ్రేణులే కాదు, నియోజకవర్గ ప్రజ లూ చాలా ఆశలే పెట్టుకున్నారు. ఈ పరిణామాలను అధికార పార్టీ జాగ్రత్తగా గమనిస్తోంది. పాదయాత్రను అడ్డుకోవాలంటూ అక్కడక్కడా, అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేసినా,మొత్తమ్మీద గుంభనగా వ్యవహరిస్తోంది. అలవిమాలిన ఆంక్షలతో కూడిన అనుమతులిచ్చి చేతులు దులుపుకున్న పోలీసులు కూడా ప్రస్తుతానికి అంతా సాఫీగా జరగడానికి తగిన బందోబస్తు కల్పిస్తామని పైకి చెబుతున్నా, సందర్భంగా వచ్చేదాకా వారేం చేస్తారన్న విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ శషభిషలకు దూరంగా పార్టీ శ్రేణులు మాత్రం లోకేశ్‌ పాదయాత్రను ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం చేసి తమ తడాఖా చాటడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన పార్టీలోని వివిధ స్థాయుల నేతలు, పోలీసులతో కుప్పంలోని లాడ్జీలు నిండిపోవడం.. ఏ క్షణంలో ఏమి జరగుతుందోనన్న ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

లోకేశ్‌ పాదయాత్రకు మిగిలింది ఒక రోజే. గురువారం మధ్యాహ్నానికల్లా ఆయనిక్కడ ఉంటారు. దానికి తగినట్లే కుప్పంలో పాదయాత్ర, బహిరంగ సభల ఏర్పాట్లు జోరందుకున్నాయి. టీడీపీ నాయకులు నిమ్మల రామానాయుడు, అమరనాథరెడ్డి, పులివర్తి నాని, గౌనివారి శ్రీనివాసులు, పీఎస్‌ మునిరత్నం, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పి.మనోహర్‌, నియోజకవర్గ పరిశీలకుడు గాజుల ఖాదర్‌బాషా, లోకేశ్‌ స్నేహితుడు రాజేశ్‌తోపాటు స్థానిక నాయకులైన మున్సిల్‌ పట్టణ పార్టీ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌, వీజీ ప్రతాప్‌ తదితరులు బుధవారం ఉదయంనుంచీ ఏర్పాట్ల పర్యవేక్షణలోనే గడిపారు. లోకేశ్‌ మొదటి రోజున పాల్గొననున్న బహిరంగ వేదికతోపాటు ఆయన పాదయాత్ర చేయనున్న మార్గంలో ప్రయాణించి ఆయా ప్రాంతాలలో ఏర్పాట్లను చూశారు. మరోవైపు పార్టీ అధినేత చంద్రబాబు ఇక్కడి నేతలతో టెలికాన్ఫరెన్సు నిర్వహిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. ఏర్పాట్ల గురించి తెలుసుకుంటూ.. తగిన సూచనలు అందిస్తున్నారు.

భారీగా జన సమీకరణ

శుక్రవారం సాయంత్రం లోకేశ్‌ పాల్గొననున్న సభకు భారీగా జన సమీకరణకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పార్టీ కార్యాలయంలో బుధవారం బూత్‌, యూనిట్‌, క్లస్టర్‌ ఇన్‌చార్జిలతో నియోజకవర్గ పరిశీలకుడు ఖాదర్‌బాషా సమావేశమై బాధ్యతలు అప్పగించారు. కుప్పం నియోజకవర్గనుంచి 30 వేలకు తగ్గకుండా జన సమీరణ జరగాలని నిర్ణయించారు.కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురం మసీదులో లోకేశ్‌ మైనారిటీలతో సమావేశం కానున్నారు. దీనిపైనా ఆ వర్గాలను ఖాదర్‌బాషా మసీదులోనే కలిసి, ఏర్పాట్లపై చర్చించారు.

సభా ప్రాంగణం, వేదిక

కమతమూరు రోడ్డులో సుమారు పదెకరాల స్థలంలో సభా ప్రాంగణం, వేదిక ఏర్పాట్లు జోరందుకున్నాయి. వంద అడుగులు వెడల్పు, 60 అడుగుల పొడవుతో నిర్మిస్తున్న సభా వేదిక బుధవారం సాయంత్రానికి ముప్పావువంతు పూర్తయింది. గ్యాలరీలు, క్యూలైన్ల ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.మరోవైపు పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి తరలివచ్చే పార్టీ శ్రేణులు,యువత,వివిధ వర్గాల ప్రజలకు భోజన,వసతి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.ఇప్పటికే లాడ్జీలు,ఇతర గదులు పార్టీ శ్రేణులతో నిండిపోయాయి.దీంతో శాంతిపురం, వి.కోట, పలమనేరుల్లో గదులు బుక్‌ చేస్తున్నారు.

కుప్పంలో ఐప్యాక్‌ టీమ్‌!

వైసీపీ తరపున ఐ ప్యాక్‌ బృందం కుప్పంలో దిగినట్లు టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. పాదయాత్ర గురించి నెగటివ్‌గా సోషల్‌ మీడియాలో ప్రచారం చేయడం.. జన స్పందనను వైసీపీకి ముఖ్యులకు తెలియజేయడం లక్ష్యంగా వీరు ఇక్కడికి వచ్చినట్లు భావిస్తున్నారు.

Updated Date - 2023-01-26T02:10:31+05:30 IST