Chittoor: పదో రోజు లోకేష్‌ పాదయాత్ర ఇలా...

ABN , First Publish Date - 2023-02-05T09:36:02+05:30 IST

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదివారం నాటికి పదో రోజుకు చేరింది.

Chittoor: పదో రోజు లోకేష్‌ పాదయాత్ర ఇలా...

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) ఆదివారం నాటికి పదో రోజుకు చేరింది. ఇవాళ పూతలపట్టు నియోజకవర్గంలో పాదయాత్ర జరగనుంది. తవణంపల్లిలో గాండ్ల సామాజిక వర్గీయులతో లోకేష్‌ భేటీ కానున్నారు. 10:30 గంటలకు కురపల్లెలో బీసీలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. 11:30కు కాణిపాకం వినాయకస్వామి ఆలయంలో లోకేష్‌ ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సాయంత్రం 4:20 గంటలకు కాణిపాకంలో యువతతో ముఖాముఖి మాట్లాడతారు. రాత్రి 7:40 గంటలకు తెల్లగుండ్ల గ్రామస్తులతో సమావేశం నిర్వహిస్తారు. రాత్రి మంగసముద్రంలో లోకేష్‌ బస చేస్తారు.

కాగా యువగళం పాదయాత్రలో భాగంగా శనివారం మధ్యాహ్నం కొండ్రాజుకాల్వ వద్ద లోకేష్ మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని ఆడ బిడ్డలు క్షేమంగా ఉండేది టీడీపీ పాలనలోనేనని అన్నారు. జగన్‌కు ఒక్క ఛాన్సు ఇస్తే రాష్ట్రాన్ని ఏ దుస్థితిలోకి తీసుకొచ్చారో గమనించాలన్నారు. పింఛన్లను తీసేయడం, మద్యపాన నిషేధం చేస్తానని ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడు షాపులను, రేట్లును పెంచుతూ పోతున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో 900 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగితే దిశ చట్టం కింద ఒకరికీ న్యాయం జరగలేదన్నారు. సొంత బాబాయి కూతురికి, అమ్మకు, చెల్లికి న్యాయం చేయని జగన్‌ రాష్ట్రంలోని మహిళలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు.

‘మేము పాడిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. పాలకు సరైన గిట్టుబాటు ధరలు లేకుండా ఇబ్బంది పడుతున్నాం’ అని పూతలపట్టు మండలం కమ్మగుట్టపల్లెకు చెందిన మాధవి ఆవేదన చెందారు.

‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాలేదని వేపనపల్లెకు చెందిన ఓ విద్యార్థి అడిగితే, అతడితోపాటు మరికొందరిపై వైసీపీ వాళ్లు దాడులు చేశారు. తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపారు. పోలీసులు అర్ధరాత్రి మా ఇంటికి నా భర్తను తీసుకెళ్లడం న్యాయమా?’ అని పూతలపట్టు మాజీ సర్పంచ్‌ ఇందిర పేర్కొన్నారు.

‘నేను సర్పంచ్‌ ఎన్నికలల్లో పోటీ చేసిన పాపానికి పోలీసులు, వైసీపీ నేతలు మా పూరి గుడిసెను పీకి పారేశారు. ఏడాదిగా పోలీ్‌సస్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదు’ అని అరగొండ పైమాఘంకు చెందిన సుమతి వాపోయారు.

కాగా, లోకేశ్‌ పాదయాత్రలో ఎమ్మెల్సీలు దీపక్‌ రెడ్డి, దొరబాబు, మాజీ మంత్రి అమరనాథరెడ్డి, చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, నేతలు గాలి భానుప్రకాష్‌, మాజీ మేయర్‌ కఠారి హేమలత, దొమ్మలపాటి రమేష్‌, గురజాల సందీప్‌, వసంత్‌ నాయుడు, శ్రీధర్‌వర్మ, అశోక్‌, ఆనంద్‌యాదవ్‌, కాజూరు బాలాజీ, షణ్ముగం, సుబ్రహ్మణ్యంనాయుడు, గోళ్ళ హేమాద్రి నాయుడు, సునీల్‌కుమార్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-05T09:36:06+05:30 IST