Chandrababu: స్వగ్రామానికి రావడం మా ఆవిడ నిర్ణయమే

ABN , First Publish Date - 2023-01-13T21:54:25+05:30 IST

ఈ సంక్రాంతి పండుగ (Sankranti festival) తెలుగు ప్రజల్లో ఒక ఆశను, నమ్మకాన్ని, భవిష్యత్తు కోసం పోరాడే శక్తిని ప్రసాదిస్తుందన్న ఆకాంక్షను...

Chandrababu: స్వగ్రామానికి రావడం మా ఆవిడ నిర్ణయమే

తిరుపతి: ఈ సంక్రాంతి పండుగ (Sankranti festival) తెలుగు ప్రజల్లో ఒక ఆశను, నమ్మకాన్ని, భవిష్యత్తు కోసం పోరాడే శక్తిని ప్రసాదిస్తుందన్న ఆకాంక్షను, ఆశాభావాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu) వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కుటుంబీకులు, సన్నిహిత బంధువులతో కలసి తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని స్వగ్రామం నారావారిపల్లె (Naravaripalli)కు వచ్చారు. తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడ సెటిలైనా సంక్రాంతికి తాము పుట్టి పెరిగిన సొంత ఊళ్ళకు రావాలని, తమ స్వస్థలాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా జన్మభూమి రుణం తీర్చుకోవాలని తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నపుడే పిలుపునిచ్చిన సంగతి ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తన పిలుపునకు స్పందించి అప్పటి నుంచే ఎంతోమంది ప్రవాసాంధ్రులు స్వగ్రామాలకు రావడం, అభివృద్ధికి సహకరించడం మొదలైందని చంద్రబాబు తెలిపారు. గతంలో సీఎంగా ఉన్న సమయంలో తాను ప్రవేశపెట్టిన జన్మభూమి కార్యక్రమం ఎంతోమందికి స్ఫూర్తి కలిగించిందన్నారు. ఆ క్రమంలో తన భార్యకు కూడా ఆలోచన వచ్చిందని, ఏటా మనం కూడా సంక్రాంతికి స్వగ్రామం వెళ్ళాలన్న నిర్ణయం తీసుకుందని వివరించారు. అప్పటి నుంచే కొవిడ్‌ కారణంగా రెండేళ్ళు మినహాయిస్తే క్రమం తప్పకుండా తమ కుటుంబం సంక్రాంతికి సొంత ఊరికి వస్తోందన్నారు.

తెలుగు వాళ్ళిపుడు తమ గ్రామాలకో, జిల్లాలకో పరిమితమైన వారు కాదని, ప్రపంచ పౌరులుగా ఎదిగారని కొనియాడారు. ప్రపంచంలోనే ఐటీ రంగంలో భారతీయులు ముందుంటే అందులో 35 శాతం తెలుగు వారేనన్నారు. తెలుగు జాతి ఇపుడు ప్రపంచమంతా విస్తరించిందని, ఐటీ రంగంలో మంచి స్థానంలో వున్నారని వివరించారు. తెలుగు వారు తాము సెటిలైన దేశాల ప్రజలకంటే కూడా అధిక తలసరి ఆదాయం సాధిస్తున్నారన్నారు. నాలెడ్జ్‌ ఎకానమీలో ఏపీకి, తెలుగు వారికి ఐటీ అనేది తానిచ్చిన ఆయుధంగా మారిందని, ఇపుడదే ఎకానమీకి వెన్నెముకగా మారిందన్నారు. తన హయాంలో రాష్ట్రానికి పలు ఐటీ సంస్థలు, పరిశ్రమలు వచ్చాయని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రానికి ఒక బ్రాండ్‌ సృష్టించడం అనేది రాత్రికి రాత్రి సాధ్యం కాదని, నిరంతర తోడ్పాటుతోనే సాధ్యమన్నారు. అలాంటిది తాను ఎంతో కష్టించి ఏపీ బ్రాండ్‌ను దేశంలోనూ, ప్రపంచంలోనూ గ్రేడ్‌ బ్రాండ్‌గా మార్చానని ఆయన వివరించారు. విదేశాల్లోని మన వారు ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూనే తమ సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నారని, చివరికి వినోదం కోసం మన సినిమాలనే చూసి ఆదరిస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు.

Updated Date - 2023-01-13T21:58:48+05:30 IST