బీజేపీకే జగన్‌తో పోరాడే సత్తా!

ABN , First Publish Date - 2023-01-25T03:39:18+05:30 IST

రాష్ట్రంలో అవినీతి, కుటుంబపాలనకు చరమగీతం పాడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు.

బీజేపీకే జగన్‌తో పోరాడే సత్తా!

వైసీపీ, టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతాం: బీజేపీ కార్యవర్గం

ఆరు రాజకీయ తీర్మానాలు విడుదల ముఖం చాటేసిన ముఖ్య నేతలు

భీమవరం, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో అవినీతి, కుటుంబపాలనకు చరమగీతం పాడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆ పార్టీ నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘సబ్‌ కా సాత్‌ సబ్‌కా వికాస్‌ ప్రధాని మోదీ ధ్యేయం. రాష్ట్రంలో మాత్రం సబ్‌ కా దోపిడీ సాగుతోంది.. కొండలు తవ్వేస్తున్నారు.. ఇసుక దోపిడీ.. మద్యం దోపిడీకి అంతులేకుండా పోయింది. బీజేపీది అభివృద్ధితోకూడిన సంక్షేమం. వైసీపీ ప్రభుత్వానిది అప్పులతో కూడిన సంక్షేమం. వైసీపీ పాలన అవినీతికి అడ్డాగా మారింది. రాష్ట్రంలో జగన్‌ను ఎదిరించేది ఒక్క బీజేపీ మాత్రమే. కుటుంబపాలనకు చరమగీతం పాడదాం. రాష్ట్రంలో అభివృద్ధి లేదు... అంతా అవినీతే’’ అని సోము వీర్రాజు ధ్వజమెత్తారు. కుటుంబ, అవినీతి రాజకీయాలను నాశనం చేయడమే బీజేపీ లక్ష్యమని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వానికి రాజకీయాలు తప్ప వేరే ధ్యాసలేదని, రాష్ట్రాన్ని నడిరోడ్డుపై నిలబెట్టారని, హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.

8 వేల గ్రామాలు.. 15వేల కిలోమీటర్లు

ప్రజలతోనే తమ పొత్తు అని, మార్చి 15 నుంచి పాదయాత్ర చేపడతామని సోము వీర్రాజు తెలిపారు. ‘‘ఎనిమిది వేల గ్రామాల్లో 15 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర ఉంటుంది. లక్ష ప్రజా చార్జిషీట్లు వేసి జగన్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతాం. రాష్టంలో మోదీ నిశ్శబ్ద విప్లవం తీసుకొస్తున్నారు. సుమారు రూ.8 లక్షల కోట్లతో రాష్ట్రాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. రైల్వే, ఎయిర్‌వేస్‌, జాతీయ కారిడార్‌లను అభివృద్ధి చేస్తున్నారు. జాతీయ గ్రామీణాభివృద్ధి పఽథకం కింద కోట్లాది రూపాయలతో కేంద్రం.. రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపడుతోంది. దీనికి భిన్నంగా టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల హయాంలో 30 లక్షల ఇళ్లు కేటాయించారు. ఇప్పటివరకు ప్రజలకు అవి పంపిణీ కాలేదు. వీటన్నింటిపై చర్చించేందుకు మేం సిద్ధం. తిరుమలలో ధరలు పెంపుపై ‘చలో తిరుమల’ చేపడతాం. ఎవరి పాదయాత్రను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు1 తెచ్చింది? ఇలాగైతే గతంలో జగన్‌ పాదయాత్ర చేపట్టేవారా?’’ అని ప్రశ్నించారు. కాగా, ఏపీలో ప్రాంతీయ పార్టీల పాలన నిరాశాజనకంగా ఉందని కేంద్రమంత్రి మురళీధరన్‌ అన్నారు. ‘‘రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీజేపీయే. ఒకటో తేదీన వేతనం కావాలని ఉద్యోగులు అడిగే పరిస్థితికి వచ్చారంటే రాష్ట్రంలో పాలన ఎంత దిగజారిపోయిందో అర్థమవుతోంది. గవర్నర్‌ని ఉద్యోగులు కలిస్తే ప్రభుత్వం కక్ష కట్టడం ఏంటి..?. ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యం’’ అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి భారతీ పవార్‌, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మ, సీఎం రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

తీర్మానాలు ఇవే.....

రాష్ట్రంలో వైసీపీ, టీడీపీలు... బీజేపీని నిర్వీర్యం చేయాలని చూస్తే సహించేది లేదని, చూస్తూ ఊరుకోమని రాష్ట్ర బీజేపీ స్పష్టం చేసింది. ఈ మేరకు భీమవరం కార్యవర్గ సమావేశాల్లో చేసిన ఆరు తీర్మానాన్ని మీడియాకు విడుదల చేసింది.

వైసీపీ, టీడీపీలకు ప్రత్నామ్నాయంగా బీజేపీని నిలిపి.. ఎన్నికలకు వెళ్తాం. కేంద్రంలో, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తాం.

వైసీపీ పాలన రాష్ట్రంలో అథోగతిలో ఉంది. అఽధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను మర్చిపోయి జేబులను నింపుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం దోపిడీని, రౌడీయిజాన్ని.. హీరోయిజంగా భావిస్తోంది.

కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్రంలో జగన్‌ వారి కుటుంబ సభ్యుల పేర్లను పెట్టుకుంటున్నారు. ఇది సరికాదు.

కుటుంబ వారసత్వ, అవినీతి పార్టీలకు వ్యతిరేకంగా ప్రజలు ముందుకు రావాలి.

రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. జీవో1ని ప్రతిపక్షాలకు మాత్రమే అమలు చేస్తూ తన రాజకీయ కార్యక్రమాలను మాత్రం యథావిధిగా కొనసాగిస్తోంది.

టీడీపీ, వైసీపీలతో కాకుండా భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి రాష్ట్రంలో ముందుకెళతాం.

అధ్యక్షునిగా వీర్రాజు కొనసాగింపు

వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు బీజేపీ రాష్ట్ర అఽధ్యక్షునిగా సోము వీర్రాజు కొనసాగుతారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆయనను రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు అభినందించారు.

ముఖం చాటేసిన ముఖ్య నేతలు

కన్నా, పురందేశ్వరి, సత్యకుమార్‌, సుజనా గైర్హాజరు

అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో మంగళవారం భీమవరంలో జరిగిన ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి గైర్హాజరవడం కమల శిబిరంలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ సిద్ధాంతాలు, నియమావళితో సంబంధం లేకుండా ఎప్పుడు ఎవరిని వద్దనుకుంటే వారిని సస్పెండ్‌ చేయడం, తనకు నచ్చనివారిని పదవి నంచి తప్పించడం మొదలుపెట్టిన రాష్ట్ర అధ్యక్షుడు... పార్టీ పదవుల్లో నియమించే వారి గురించి కనీస సమాచారం కోర్‌ కమిటీకి కూడా ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఆరు జిల్లాల అధ్యక్షులను రాత్రికిరాత్రే ఒక వాట్సాప్‌ మెసేజ్‌ ద్వారా తొలగించడంతో అసంతృప్త జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఇదే సమయంలో మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గళం వినిపిస్తూ.... సోము వీర్రాజు తీరుపై ఫైర్‌ అయ్యారు. ఆ తర్వాత జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలకు లక్ష్మీనారాయణ హాజరు కాకపోవడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. భీమవరంలో జరుగుతున్న సమావేశాల్లో కన్నా ఫోటో ఎక్కడా ఫ్లెక్సీల్లో పెట్టకపోవడం గమనించిన పార్టీ శ్రేణులు.... ఉద్దేశపూర్వకంగానే మాజీ అధ్యక్షుడిని అవమానిస్తూ పొగపెట్టినట్లు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం తెలిసి... రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి వెళ్లని మాజీ అధ్యక్షుడిని సముదాయిస్తూ జాతీయ పార్టీ ప్రతినిధుల నుంచి ఫోన్‌ వెళ్లినట్టు తెలిసింది. ఇదే సమయంలో సత్యకుమార్‌ కూడా హాజరు కాకపోవడంపై చర్చ జరుగుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అండమాన్‌ పర్యటన (సోమవారం) నేపథ్యంలో అక్కడి పార్టీ ఇంచార్జిగా ఉన్నందున రాలేకపోతున్నట్లు సత్యకుమార్‌ చెప్పినట్లు తెలిసింది. అయితే ఇటీవల ఆయనను లక్ష్యంగా చేసుకుని ఏపీ పార్టీలోని కొందరు నేతలు సోషల్‌మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ చేశారు. బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి పురందేశ్వరి ముఖ్యమైన పని ఉండటంతో రాలేకపోయారనే కారణం చెబుతున్నా... అది ఎంతవరకు నిజమనేదానిపై చర్చ జరుగుతోంది. కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరికి విమానం మిస్‌ అయినట్లు పార్టీ వర్గాలు చెప్పడం గమనార్హం. కాగా, బీజేపీని వీర్రాజు వైసీపీకి తాకట్టు పెట్టారని పల్నాడుజిల్లాకు చెందిన 150మందికిపైగా ఆ పార్టీ నేతలు ఆరోపించారు దీనికి నిరసనగా తామంతా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వీరంతా మంగళవారం క్రోసూరులో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - 2023-01-25T03:39:18+05:30 IST