కదం తొక్కిన అంగన్వాడీలు

ABN , First Publish Date - 2023-02-07T03:44:43+05:30 IST

పాదయాత్రలోనూ, ఎన్నికల ముందు ప్రతిపక్ష నేత హోదాలోనూ జగన్‌ ఇచ్చిన హామీ మేరకు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ గత మూడున్నరేళ్లుగా అంగన్వాడీ కార్యకర్తలు వేడుకొన్నారు.

కదం తొక్కిన అంగన్వాడీలు

రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు

కనీస వేతనం 26 వేలు చేయాలని డిమాండ్‌

మార్చిలో చలో విజయవాడకు పిలుపు

ఏప్రిల్‌ 5న ‘చలో ఢిల్లీ’కి నిర్ణయం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

పాదయాత్రలోనూ, ఎన్నికల ముందు ప్రతిపక్ష నేత హోదాలోనూ జగన్‌ ఇచ్చిన హామీ మేరకు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ గత మూడున్నరేళ్లుగా అంగన్వాడీ కార్యకర్తలు వేడుకొన్నారు. కనీస వేతనం రూ.26 వేలు చేయాలని, గ్రాట్యుటీ, పదవీ విరమణ ప్రయోజనాలూ అందించాలని అభ్యర్థించారు. ప్రభుత్వం నుంచి ఎంతకీ స్పందన కనిపించకపోవడంతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలతో కదం తొక్కారు. అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు. కలెక్టర్లకు వినతిపత్రాలు అందించారు. ఎన్టీఆర్‌ జిల్లా ధర్నా చౌక్‌లోను, కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌వద్ద ధర్నాలు నిర్వహించారు. అంగన్వాడీలకు పనిభారం పెరిగిన నేపఽథ్యంలో నెలకు రూ.26 వేలు వేతనంగా ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, పదవీ విరమణ బెనిఫిట్లను అందజేయాలని కోరారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఏప్రిల్‌ 5న చలో డిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో సీఐటీయూ రాష్ట్రకార్యదర్శి వి.నరసింహారావు, ఎల్‌ఐసీ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి జి.కిషోర్‌కుమార్‌, అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు నిర్మలజ్యోతి తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో అంగన్వాడీ వర్కర్లను ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధించారు. యాడికి, బెళుగుప్ప, రాయదుర్గం, అనంతపురం, కళ్యాణదుర్గం తదితర ప్రాంతా ల్లో అంగన్వాడీ వర్కర్లను గృహ నిర్బంధం చేశారు. అయినా వందలాది మంది కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నాలో పాల్గొన్నారు. అంగన్వాడీల సమస్యలపై మార్చిలో చలో విజయవాడ నిర్వహిస్తామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు ప్రకటించారు. ఏప్రిల్‌లో ఢిల్లీలో ఉద్యమిస్తామన్నారు. పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో సీఎం జగన్‌ విఫలమయ్యారని కర్నూలు కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో అంగన్వాడీల జిల్లా గౌరవ అధ్యక్షురాలు పి.నిర్మలమ్మ దుయ్యబట్టారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో ఎమ్మెల్సీ యిళ్ల వెంకటేశ్వరరావు (ఐవీ) మాట్లాడుతూ పర్యవేక్షణ పేరుతో అంగన్వాడీలపై వేధింపులు ఆపాలని డిమాండ్‌ చేశారు. జీవో నెంబర్‌-1ను రద్దు చేయాలంటూ శ్రీకాకుళం కలెక్టరేట్‌ వద్ద ఆందోళనలో అంగన్వాడీలు నినాదాలు చేశారు. విజయనగరంలో వేలాదిమంది అంగన్వాడీలు జాతీయ రహదారి-23పైకి రావడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. బాపట్ల జిల్లా కలెక్టరేట్‌ వద్ద భారీగా మోహరించిన పోలీసులు అంగన్వాడీలను లోపలికి వెళ్లనివ్వకపోవడంతో వాగ్వాదం జరిగింది. విశాఖ జీవీఎంసీ కార్యాలయం ఎదుట గాంధీ విగ్ర హం వద్ద ధర్నా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌ను అంగన్వాడీలు దిగ్బంధించగా, మధ్యా హ్నం దాటినా అఽధికారులు స్పందించకపోవడం తో.. ఆగ్రహించిన ఆంగన్వాడీలు కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాటలో ఇద్దరు కార్యకర్తలు స్పృహతప్పి పడిపోయారు.

మోసగాడివయ్యా.. మోసపోయామయ్యా..!

నీవు మోసగాడివయ్యా.. మేము మోసపోయామయ్యా అంటూ ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద అంగన్‌వాడీ ఆయా ఒకరు ముఖ్యమంత్రి జగన్‌పై పాడిన పాట అందరినీ ఆలోచింపచేసింది.

Updated Date - 2023-02-07T03:44:44+05:30 IST