ఆంధ్రా అంతా అదానీదే!

ABN , First Publish Date - 2023-01-26T01:29:48+05:30 IST

ఆంధ్రా అంతా ఆయనదే! అదానీ కోరిందే తడవుగా పోర్టులూ..విద్యుత్తు ఉత్పత్తి సంస్థలూ... విశాఖ ఉక్కు పరిశ్రమ, రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర

ఆంధ్రా అంతా అదానీదే!

పోర్టుల నుంచి పవర్‌ప్లాంట్ల దాకా రాసిస్తున్న జగన్‌

గంగవరం..కృష్ణపట్నం ఇప్పటికే ధారాదత్తం

అదేబాటలో విశాఖ ఉక్కు పరిశ్రమ కూడా...

అప్పనంగా అప్పగించే దిశలో బందరు పోర్టు

‘కృష్ణపట్నం థర్మల్‌’ ఇచ్చే దిశగా అడుగులు

పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్తు ప్లాంట్లకు గ్రీన్‌సిగ్నల్‌

సీఈఏ నిబంధనలకు విరుద్ధంగా అనుమతి!

(అమరావతి, ఆంధ్రజ్యోతి): ఆంధ్రా అంతా ఆయనదే! అదానీ కోరిందే తడవుగా పోర్టులూ..విద్యుత్తు ఉత్పత్తి సంస్థలూ... విశాఖ ఉక్కు పరిశ్రమ, రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకూ రిజర్వాయర్లను ముఖ్యమంత్రి జగన్‌ రాసి ఇచ్చేస్తున్నారు. రాష్ట్రానికి ప్రముఖులు ఎవరైనా వస్తే సీఎం అపాయింట్‌మెంట్‌ తీసుకుని మాత్రమే ఆయనను కలివాలి. కానీ, అదానీకి అలాంటి షరతులేవీ వర్తించవని రాజకీయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సీఎం నివాసం తాడేపల్లి ప్యాలె్‌సకు నేరుగా వెళ్లేంత చనువు ఆయనకు ఉన్నదన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని అత్యంత కీలకమైన గంగవరం, కృష్ణపట్నం పోర్టులు అదానీ వశమైపోయాయి. కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో ఉన్న 2400 మెగావాట్ల శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్కేంద్ర యాజమాన్య నిర్వహణ బాధ్యతనూ అదానీకే అప్పంచేలా అడుగులు పడుతున్నాయని ఉద్యోగ సంఘాలూ .. ప్రజా సంఘాలూ ఆరోపిస్తున్నాయి. గంగవరం పోర్టుకు సమీపంలోనే విశాఖ ఉక్కు ఉంది.. దీంతో తన పోర్టు నుంచి ఇనుప ఖనిజ దిగుమతులు, ఉత్పత్తుల ఎగుమతుల కోసం ఈ పరిశ్రమను స్వాధీనం చేసుకునేందుకు అదానీ పావులు కదుపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉక్కు పరిశ్రమను నిర్వహిస్తున్న ‘ఆర్‌ఐఎన్‌ఎల్‌’ను పోస్కో హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని అందరూ చెబుతున్నా .. తెరవెనుక నుంచి అదానీ భారీ స్కెచ్‌ వేస్తున్నారన్న ప్రచారం బాగా జరుగుతోంది.

ఏపీ జెన్కోకు జెల్ల కొట్టి...

అతితక్కువ ఖర్చుతో జల విద్యుత్తు ఉత్పత్తి చేపట్టే పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులను అదానీపరం చేయాలని జగన్‌ సర్కారు నిర్ణయం తీసుకుంది. అలాగే.. ఇటీవల మధ్యప్రదేశ్‌లో బీ-గ్రేడ్‌ బొగ్గు నిక్షేపాలు లభ్యమయ్యాయి. విదేశీ బొగ్గుకు ఏమాత్రం తీసిపోనిరీతిలో కేవలం రూ.2300కే టన్ను బొగ్గు లభించే ఈ క్షేత్రాన్ని వేలం పాట ద్వారా అదానీ దక్కించుకున్నారు. ఈ వేలం పాటలో ఏపీ జెన్కోను పాల్గొనకుండా ప్రభుత్వం ఆపిందని రాజకీయపక్షాలు, పారిశ్రామిక వర్గాలూ ఆరోపిస్తున్నాయి. సీఎం మానసపుత్రికగా ప్రచారంలో ఉన్న వ్యవసాయ పంప్‌సెట్లు, గృహ విద్యుత్తుకు స్మార్ట్‌ మీటర్ల బిగింపు పథకంలోనూ అదానీ కంపెనీ చొరబడుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కొరవడిన పారదర్శకత..

ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహనరెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే, కృష్ణపట్నం పోర్టును అదానీపరం చేశారు. ఆ వెంటనే గంగవరం పోర్టు కూడా అదానీ గుప్పిట్లోకి చేరిపోయింది. ఇప్పుడు అదే తరహాలో మచిలీపట్నం పోర్టును కూడా అప్పగించేలా అడుగులు వేగంగా పడుతున్నాయని చెబుతున్నారు. దేశంలో ఎక్కడైనా పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్తు ప్లాంటును స్థాపించాలంటే .. తప్పనిసరిగా .. కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర ఇంధన సంస్థల అనుమతి తీసుకోవాలి. కేంద్ర ఇంధన సంస్థ అనుమతి ఇస్తేనే.. ప్రహరీ గోడనైనా నిర్మించాలని ‘సీఈఏ’ నిబంధన ఉంది. పైగా.. పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్తు ప్రాజెక్టును అప్పగించాలంటే పారదర్శక విధానంలో టెండర్లను పిలవాలి. కానీ అలాంటి ప్రక్రియ ఏదీ లేకుండానే సీఎం సొంత జిల్లా కడపలో 1000 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్లాంటు గడికోట రిజర్వాయరు వద్ద, 500 మెగావాట్ల పంప్డ్‌ ప్లాంటు శ్రీసత్యసాయి జిల్లా చిత్రావతినదిపై.. 1200 మెగావాట్ల ప్లాంటు పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుకుర్తి రిజర్వాయరుపై.. 1000 మెగావాట్ల ప్లాంటును ఇదే జిల్లాలోని కనివలస రిజర్వాయరుపై స్థాపించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. ఇప్పటికే ఇందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేసే బాధ్యతలను రాష్ట్ర జల వనరుల శాఖకు, ఇంధన ఉత్పత్తి సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది. పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్కేంద్రాల ఏర్పాటుకు అవసరమయ్యే టర్బెయిన్‌లను .. వాటి ధరలనూ .. పనితీరునూ పరిశీలించేందుకు జల వనరుల శాఖ, ఇంధన ఉత్పత్తి సంస్థల ఇంజనీరింగ్‌ అధికారులు ఇటీవల ఆస్ట్రియా వెళ్లారు. ఈ ప్లాంటుకు సంబంధించిన ప్రతిపాదనలు పరిశీలన దశలో ఉండగానే....అదానీకి ప్రభుత్వం ఆమోదం తెలపడం గమనార్హం.

Updated Date - 2023-01-26T01:29:49+05:30 IST