నేడు లేపాక్షికి జి-20 ప్రతినిధుల బృందం

ABN , First Publish Date - 2023-02-06T23:18:41+05:30 IST

లేపాక్షి సందర్శనకు జి-20 దేశాల ప్రతినిధుల బృందం మంగళవారం వస్తోంది. బెంగళూరులో జరుగుతున్న ‘జి-20 ఎనర్జీ మీట్‌’ నిమిత్తం వచ్చిన ఈ బృందాన్ని పావగడ సమీపంలోని తిరుమణి వద్ద ఉన్న సోలార్‌ప్లాంట్‌ను చూడాలని కర్ణాటక ప్రభుత్వం కోరింది.

నేడు లేపాక్షికి జి-20 ప్రతినిధుల బృందం
ఏర్పాట్లపై చర్చిస్తున్న ఆర్కియాలజిస్ట్‌ అధికారులు

తిరుమణి సోలార్‌ ప్లాంట్‌ పరిశీలన

తిరుగు ప్రయాణంలో లేపాక్షి సందర్శన

హిందూపురం, ఫిబ్రవరి 6: లేపాక్షి సందర్శనకు జి-20 దేశాల ప్రతినిధుల బృందం మంగళవారం వస్తోంది. బెంగళూరులో జరుగుతున్న ‘జి-20 ఎనర్జీ మీట్‌’ నిమిత్తం వచ్చిన ఈ బృందాన్ని పావగడ సమీపంలోని తిరుమణి వద్ద ఉన్న సోలార్‌ప్లాంట్‌ను చూడాలని కర్ణాటక ప్రభుత్వం కోరింది. దీంతో ప్లాంట్‌ చూసేందుకు మంగళవారం విదేశీ బృందం తిరుమణికి వస్తోంది. ఇక్కడికి సమీపంలో ఉన్న చారిత్ర ప్రదేశం గురించి విదేశీ బృందం అడిగిందని, దీంతో కర్ణాటక అధికారులు లేపాక్షి గురించి చెప్పడంతో సందర్శనకు వస్తున్నారని జిల్లా అధికారి ఒకరు వెళ్లడించారు. విదేశీ ప్రతినిధుల బృందం రాక సందర్భంగా లేపాక్షి ఆలయాన్ని జిల్లా అధికారులు సిద్ధం చేశారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో లేపాక్షికి ఈ బృందం చేరుకుంటుంది. మొదట తిరుమణి వద్ద సోలార్‌ప్లాంట్‌ పరిశీలించి, తిరుగు ప్రయాణంలో లేపాక్షిని సందర్శిస్తుంది. ఈ బృందంలో సుమారు 70 మంది విదేశీ ప్రతినిధులు ఉంటారని స్థానిక అధికారులు తెలిపారు.

భద్రతా ఏర్పాట్లు

విదేశీ ప్రతినిధుల బృందం రాక నేపథ్యంలో లేపాక్షిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వారు ప్రయాణించే మార్గాలను సోమవారం సాయంత్రం నుంచి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆలయం చుట్టూ ర్యాపిడ్‌ యాక్షన ఫోర్స్‌ మోహరించారు. డీఐజీ, ఎస్పీ పర్యవేక్షణలో సుమారు 500 మంది పోలీసులు భద్రతలో పాల్గొంటున్నారు. జిల్లా సరిహద్దులోని కొడికొండ చెక్‌పోస్టు నుంచి మడకశిర, కర్ణాటక సరిహద్దు వరకు విదేశీ బృందం పర్యటించే రహదారులపై భద్రత ఏర్పాటు చేశారు. వారి పర్యటన ముగిసేవరకూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగుతాయని పెనుకొండ డీఎస్పీ యశ్వంత తెలిపారు.

నేడు దుకాణాల మూసివేత

లేపాక్షిలో విదేశీ బృందం పర్యటన నేపథ్యంలో లేపాక్షి ప్రధాన వీధుల్లో ఉన్న దుకాణాలను మంగళవారం మూసివేయిస్తామని అధికారులు పేర్కొన్నారు. ప్రధాన రహదారి నుంచి వీరభద్ర ఆలయంలోకి వెళ్లే రహదారికి ఇరువైపులా ఇళ్లకు తెరలు కట్టారు. ఆలయంలో గ్రీన కార్పెట్‌ ఏర్పాటు చేశారు.

పర్యాటకులకు నో ఎంట్రీ

విదేశీ బృందం పర్యటన నేపథ్యంలో మంగళవారం లేపాక్షి ఆలయంలోకి పర్యాటకులకు ప్రవేశం లేదని రూరల్‌ సీఐ వేణుగోపాల్‌ తెలిపారు. విదేశీ బృందం పర్యటించే ప్రాంతాలను ఢిల్లీ నుంచి వచ్చే అత్యున్నత స్థాయి అధికారులు డ్రోన కెమెరాల నిఘా నడుమ పర్యవేక్షిస్తారని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, పర్యాటకులు మంగళవారం లేపాక్షి సందర్శనకు రావద్దని కోరారు.

Updated Date - 2023-02-06T23:18:42+05:30 IST