‘జగనన్న చేదోడు’కు సంకెళ్లు

ABN , First Publish Date - 2023-01-26T00:33:11+05:30 IST

జగనన్న చేదోడు (మూడో విడత) పథకానికి అర్హులను దూరం చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనల పేరుతో పథకాన్ని ఎత్తేసే కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది

 ‘జగనన్న చేదోడు’కు సంకెళ్లు

మూడో విడత దరఖాస్తుకు రెండ్రోజులే గడువు

నేటితో గడువు పూర్తి

30న లబ్ధి విడుదల

గుట్టు చప్పుడు కాకుండా మార్గదర్శకాల జారీ

మండిపడుతున్న రజకులు, నాయీబ్రాహ్మణులు, టైలర్లు

అనంతపురం ప్రెస్‌క్లబ్‌ : జగనన్న చేదోడు (మూడో విడత) పథకానికి అర్హులను దూరం చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనల పేరుతో పథకాన్ని ఎత్తేసే కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. దరఖాస్తుకు అనేక పత్రాలు జత చేయాలని గైడ్‌లైన్సలో చెప్పారు. అయితే గడువు మాత్రం రెండు రోజులే ఇచ్చారు. వారు చెప్పిన పత్రాలు అన్నీ జత చేయాలంటే కనీసం వారం రోజులు సమయం పడుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు. పైగా కుట్టుమిషనలు కుట్టే వారందరికి లబ్ధి అందుతుందని గతంలో చెప్పారు. ఇప్పుడు మాత్రం బ్యాగులు, సీటు కవర్లు కుట్టే వర్గాలను అనర్హులుగా చేర్చారు. మరోవైపు షాపు ఎక్కడుంటే అక్కడే దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన పెట్టారు. ఇలా రక రకాల కొత్త నిబంధనల ‘తోడు’తో మమ్మల్ని ఇబ్బంది పెట్టడం న్యాయమా అని పలువురు చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.

కొందరికే లబ్ధి

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఉమ్మడి జిల్లాలో చేతివృత్తుల్లో అన్ని వర్గాలకు కలిపి 43,300 మందికి జగనన్న లబ్ధి చేకూర్చామని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో రజకులే 60 వేల మందికిపైగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకూ జగనన్న చేదోడో పథకం 24 వేల మందికి మాత్రమే అందించారు. నాయీబ్రాహ్మణులు 20 వేల మందికిపైగా ఉండగా రెండు విడతలు కలిపి 8 వేల మందికి అందించా రు. టైలర్లు 20 వేల మందికిపైగా ఉండగా.. 10 వేల మందికి అందించా రు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 50 వేల మందికిపైగానే అర్హులైన రజకులు, నాయీబ్రాహ్మణులు, టైలర్లకు చేదోడు పథకం అందని ద్రాక్షగా మారింది.

ఎత్తివేతలో భాగమేనా...?

జగనన్న చేదోడు పథకం అర్హులకు అందడం లేదన్న విమర్శలు ఏటా వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది కూడా మూడో విడత విషయంలో నూ అదే జరుగుతోందని ఆయా వర్గాలు మండిపడుతున్నాయి. ఈ సారి పూర్తిగా పథకాన్ని ఎత్తేవేసేందుకే రాష్ట్ర ప్రభు త్వం రెండ్రోజులు మాత్రమే గడువు విధించినట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం మూడో విడత ఎప్పుడు ఇస్తున్నారో... ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలోనన్న సమాచారం కూడా ఈ ఏడాది బయటికి రానివ్వకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం సాయంత్రం అన్ని బీసీ కార్పొ రేషన్లకు, సచివాలయాలకు మూడో విడతకు సంబంధించిన మార్గదర్శకాలు పంపినట్లు సమాచారం. అది కూడా బుధ, గురువారాలు రెండ్రోజులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఈ నెల 30న లబ్ధిని విడుదల చేయనున్నట్లు వాటిలో పొందుపరిచినట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-01-26T00:33:11+05:30 IST