పరిటాల రవీంద్ర ఫ్లెక్సీల చించివేత
ABN , First Publish Date - 2023-01-26T00:34:33+05:30 IST
పట్టణంలో టీడీపీ నాయకులు ఏర్పాటుచేసిన మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ఫ్లెక్సీలను దుండగులు చించివేయడం కలకలం రేపింది

ధర్మవరంలో టీడీపీ శ్రేణుల నిరసన
పోలీసులకు ఫిర్యాదు చేసిన పార్టీ నాయకులు
ధర్మవరం, జనవరి 25: పట్టణంలో టీడీపీ నాయకులు ఏర్పాటుచేసిన మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ఫ్లెక్సీలను దుండగులు చించివేయడం కలకలం రేపింది. ఈనెల 24వ తేదీన పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా ఆయన ఫ్లెక్సీలను టీడీపీ నాయకులు పట్టణమంతా ఏర్పాటుచేశారు. మంగళవారం రాత్రి వాటిని కొందరు దుండగులు చించేశారు. దీనిపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. బుధవారం కాలేజ్సర్కిల్కు చేరుకుని, నిరసన తెలిపారు. రోడ్డుపై బైఠాయించి, ఫ్లెక్సీలను చించివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతేడాది సెప్టెంబరులో పరిటాల శ్రీరామ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా చించివేశారన్నారు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశామనీ, చర్యలు తీసుకుని ఉండుంటే ప్రస్తుతం పునరావృతం అయ్యుండేది కాదన్నారు. పట్టణంలో వనటౌన పోలీసు స్టేషన ఎదుటే ఫ్లెక్సీలను చించేయడం దారుణమన్నారు. ఇప్పటికైనా ఈ సంస్కృతిని మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో కమతం కాటమయ్య, చింతలపల్లి మహేశ చౌదరి, ఫణికుమార్, పురుషోత్తంగౌడ్, పరిశే సుధాకర్, భీమనేని ప్రసాద్నాయుడు పాల్గొన్నారు.