జగనన్న ఇల్లు ఎంత భద్రమో!

ABN , First Publish Date - 2023-02-06T23:11:28+05:30 IST

జగనన్న ఇళ్ల నిర్మాణంలో భద్రతా లోపాలు కనిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లు మసిపూసి మారేడు కాయ చేస్తున్నా రన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పునాదులు లేకుండా నేలపైనా బీమ్‌లు వేస్తున్నారు.

జగనన్న ఇల్లు ఎంత భద్రమో!
చదును చేయకుండానే ఇంటినిర్మాణానికి వేసిన బీమ్‌లు

నాసిరకంగా జగనన్న ఇళ్ల నిర్మాణం

పునాది లేకుండానే నేలపై బీమ్‌లు

నేలకుంగి తొర్రలు పడుతున్న వైనం

మసిపూసి మారేడు కాయ చేస్తున్న కాంట్రాక్టర్లు

పేదోడి ఇంటిపై అధికారుల ఉదాసీనత

అనంతపురంరూరల్‌, ఫిబ్రవరి 6: జగనన్న ఇళ్ల నిర్మాణంలో భద్రతా లోపాలు కనిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లు మసిపూసి మారేడు కాయ చేస్తున్నా రన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పునాదులు లేకుండా నేలపైనా బీమ్‌లు వేస్తున్నారు. వాటిపైనే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. కొన్ని చోట్ల బీమ్‌ల కింద నేల కుంగి తొర్రలు పడ్డాయి. దీంతో బీమ్‌లు వంగిపోతున్నాయని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ఉదాసీన వైఖరితో అధికార పార్టీ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా ఇళ్లు కట్టేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. దీంతో జగనన్న ఇల్లు ఎంత భద్రమన్న సందేహాలు లబ్ధిదారుల మదిలో మెదులుతున్నాయి.

ఆప్షన-3 కింది ఇళ్ల నిర్మాణాలు..

అనంతపురం అర్బన, అనంతపురం రూరల్‌ పరిధిలోని లబ్ధిదారులకు ఆలమూరు, ఉప్పరపల్లి, సోములదొడ్డి, కొడిమి, కామారుపల్లి, కురుగుంట, కందుకూరు, ఇటుకలపల్లి, బుక్కరాయసముద్రం మండలంలోని కొత్తపల్లి, సిద్ధారాంపురం తదితర ప్రాంతాలోని జగనన్న లేఔట్లలో ఇళ్ల స్థలాలు కేటా యించారు. ఇందులో కామారుపల్లి మినహా మిగిలిన లేఔట్లలో ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కొడిమి, ఆలమూరు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు ఆప్షన-3 కింది జరుగుతున్నాయి. ఆలమూరు లేఔట్‌లో 5వేలు, కొడిమి లేఔట్‌లో 3500లకుపైగా ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టారు. ఆలమూరులో కొన్ని ఇళ్ల నిర్మాణాలు బాగానే సాగుతున్నా కొడిమిలో మాత్రం ఇళ్ల నిర్మా ణాల పురోగతి అధ్వానంగా ఉంది. ఏమాత్రం ముందుకు సాగడం లేదు.

కొడిమి, ఆలమూరులో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాల పనులపై లబ్ధిదారుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. సాధారణంగా అయితే ఇంటి నిర్మాణాలు పునాదులు తవ్వి చేయాల్సి ఉంది. అయితే ఇక్కడ అది జరగడం లేదు. మొక్కలు పూడ్చేకు వినియోగించే డ్రిల్లింగ్‌ మిషనతో రెండు, మూడు అడుగులు గుంతలు తవ్వుతున్నారు. తద్వారా వాటిలోనే పిల్లర్లు వేస్తున్నారు. పునాది తీయకుండా భూమిపైనే బీమ్‌లు వేస్తున్నారు. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో భూమి కుంగిపోతోంది. దీంతో అక్కడ తొర్రలు పడ్డాయి. భూమిని చదును చేసి, పునాదులు అనంతరం బీమ్‌లు వేయాల్సి ఉండగా కాంట్రాక్టర్లు ఆపని చేయడం లేదు. ఎత్తు పల్లాలున్నా వాటిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా బీమ్‌లు వేశారు. దీంతో బీమ్‌లు ఏటావాలు తదితర ఆకారాల్లో దర్శనమిస్తున్నాయి. కొడిమి లేఔట్‌లో బీమ్‌ లెవెల్‌ వరకు పనులు పూర్తి అయ్యాయి. అక్కడి వరకు ఒక్కొక్క ఇంటికి రూ.40వేలు చొప్పున బిల్లులు మంజూరైనట్లు తెలుస్తోంది. దాదాపు రెండు మూడు నెలలుగా స్థానికంగా పనులు కూడా జరగడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు బిల్లులు చేసుకుని ఆ తరువాత కనిపించడం లేదన్న వాదనలు ఆయా వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-02-06T23:11:30+05:30 IST