18 ఏళ్లయినా అదే అభిమానం..

ABN , First Publish Date - 2023-01-25T00:09:03+05:30 IST

మాజీ మంత్రి, దివంగత నేత పరిటాల రవీంద్ర భౌతికంగా దూరమై 18 సంవత్సరాలవుతున్నా ఆయనపై ఏ ఒక్కరిలోనూ అభిమానం తగ్గలేదని సినీనటుడు నందమూరి తారకరత్న అభిప్రాయపడ్డారు.

18 ఏళ్లయినా అదే అభిమానం..
పరిటాల ఘాట్‌ వద్ద నివాళులర్పిస్తున్న నందమూరి తారకరత్న

జన హృదయాల్లో పరిటాల రవి స్థానం పదిలం

సినీనటుడు నందమూరి తారకరత్న

వెంకటాపురంలో ఘనంగా పరిటాల రవీంద్ర వర్ధంతి

నివాళులర్పించిన పరిటాల శ్రీరామ్‌

రామగిరి, జనవరి 24: మాజీ మంత్రి, దివంగత నేత పరిటాల రవీంద్ర భౌతికంగా దూరమై 18 సంవత్సరాలవుతున్నా ఆయనపై ఏ ఒక్కరిలోనూ అభిమానం తగ్గలేదని సినీనటుడు నందమూరి తారకరత్న అభిప్రాయపడ్డారు. వెంకటాపురం గ్రామానికి వేలాదిమందిగా తరలివస్తున్న అభిమానులే పరిటాల రవిపై ఉన్న అభిమానానికి నిదర్శనమన్నారు. రామగిరి మండలంలోని వెంకటాపురం గ్రామంలో మంగళవారం మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 18వ వర్ధంతిని కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ముందుగా పరిటాల రవి వర్ధంతిని నిరాడంబరంగా చేయాలని కుటుంబ సభ్యులు భావించారు. అయితే అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వర్ధంతి ఏర్పాట్లను ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌, పరిటాల సిద్దార్థలు దగ్గరుండి పర్యవేక్షించారు. పరిటాల కుటుంబ సభ్యులు ఉదయం పరిటాల రవి ఘాట్‌ వద్దకు వెళ్లి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా నందమూరి తారకరత్న మాట్లాడుతూ నందమూరి కుటుంబం, పరిటాల కుటుంబం వేరువేరు కాదన్నారు. పరిటాలరవీంద్ర తనకు సోదరసమానుడన్నారు. ఆయనతో తాను మాట్లాడిన మాటలు మేము గడిపిన జ్థాపకాలు గుర్తున్నాయన్నారు. జిల్లాలో సినిమా షూటింగ్‌ సమయంలో తాను వచ్చినప్పుడు పరిటాల రవి తమను ఆప్యాయంగా పలకరించేవారన్నారు. పరిటాల రవీంద్రకు శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి, హిందూపురం మాజీ ఎంపీ నిమ్మలకిష్టప్ప, మాజీ ఎమ్మెల్యేలు కందికుంట వెంకటప్రసాద్‌, మద్దనకుంట ఈరన్న, జడ్పీ మాజీ చైర్మన పూల నాగరాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సవిత, తదితరులు నివాళులర్పించారు.

హైదరాబాద్‌లో నివాళులర్పించిన పరిటాల సునీత

రామగిరి: మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి పరిటాల సునీత హైదరాబాద్‌లో నివాళులర్పించారు. తన నివాసంలో కుమార్తె స్నేహలత, కుటుంబసభ్యులతో కలిసి పరిటాల రవీంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయనను స్మరించుకున్నారు. పరిటాల రవీంద్ర సేవలను కొనసాగిస్తామనీ, ఆయన ఆశయసాధనకు కృషి చేస్తామని పరిటాల సునీత పేర్కొన్నారు.

నాన్న ఆశయ సాఽధనకు కృషి చేస్తాం - పరిటాల శ్రీరామ్‌

పరిటాల రవీంద్ర ఆశయసాదన కోసం తమ కుటుంబం నిరంతరం శ్రమిస్తూనే ఉంటుందని ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ అన్నారు. పరిటాల రవీంద్ర దూరమై 18ఏళ్లయినా ఆయనపై ఉన్న అభిమానమే తమ కుటుంబానికి భరోసానిస్తోందన్నారు. పరిటాల రవి బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం జీవితమంతా పోరాటాలు చేశారన్నారు. ఆయన చూపిన మార్గంలోనే పయనిస్తామన్నారు. ఇదిలా ఉండగా నారాలోకేష్‌ యువగళం పాదయాత్రను అడుగడుగునా అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. ప్రజలే ఈ పాదయాత్రను ముందుండి నడిపిస్తారన్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఎవరికీ భయపడరని శ్రీరామ్‌ పేర్కొన్నారు.

Updated Date - 2023-01-25T00:09:04+05:30 IST