ఏక్‌ నిరంజన!

ABN , First Publish Date - 2023-01-26T00:15:52+05:30 IST

జిల్లాలో బి గ్రేడ్‌ కలిగిన అనంతపురం ఆర్టీసీ బస్టాండులో అన్నింటికీ ఒకే అధికారి ఉన్నాడు. సాధారణంగా ఎస్టీఐ హోదాతో ఒక మేనేజర్‌, డిప్యూటీ సూపరింటెం డెంట్‌ హోదా కలిగిన ఇద్దరు అసిస్టెంట్‌ మేనేజర్లుగా ఉండాల్సిన చోట ఒకే ఒక స్టేషన మేనేజర్‌ దిక్కయ్యాడు.

ఏక్‌ నిరంజన!

అనంత ఆర్టీసీ బస్టాండులో అన్నిటికీ ఒకే ఒక్కడు

ఖాళీలు భర్తీ చేయాలన్న ఆదేశాలు బేఖాతరు

బీ గ్రేడ్‌ కలిగిన బస్టాండుకు ఎస్‌ఎం ఒక్కడే దిక్కు

అనంతపురం కల్చరల్‌, జనవరి 25: జిల్లాలో బి గ్రేడ్‌ కలిగిన అనంతపురం ఆర్టీసీ బస్టాండులో అన్నింటికీ ఒకే అధికారి ఉన్నాడు. సాధారణంగా ఎస్టీఐ హోదాతో ఒక మేనేజర్‌, డిప్యూటీ సూపరింటెం డెంట్‌ హోదా కలిగిన ఇద్దరు అసిస్టెంట్‌ మేనేజర్లుగా ఉండాల్సిన చోట ఒకే ఒక స్టేషన మేనేజర్‌ దిక్కయ్యాడు. దీంతో అన్ని కార్యకలాపాలు ఒకేవ్యక్తిపై పడటంతో అనంత బస్టాండులో పాలన అస్తవ్యస్తంగా మారింది. అనంతపురం బస్టాండు పరిధిలో టెండరు ప్రాతిపదికన 131 దుకాణాల నుంచి నెలకు దాదాపు రూ.33లక్షలకు పైగా ఆదా యం వస్తోంది. ఇదే బస్టాండు ఆవరణలో కార్గో కార్యాలయం, ఆర్టీసీ ఆస్పత్రి, ఆర్టీసీ జోనల్‌ చైర్‌పర్సన కార్యాలయం ఉన్నాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన బస్టాండుకు డ్రైవర్‌ కేడర్‌ నుంచి వచ్చిన ఉద్యోగి బస్‌ స్టేషన మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో బస్టాండు పర్య వేక్షణతోపాటు ఆవరణలోని అన్ని కార్యాలయాల పర్యవేక్షణ చూసు కోవాల్సి ఉండటం, సహాయంగా అసిస్టెంట్‌ మేనేజర్లు లేకపోవడం, మరోవైపు అధికారుల ఒత్తిడి తాళలేక... ఉన్న ఒక్క మేనేజర్‌కూడా సెలవులు పెట్టుకోవాల్సిన పరిస్థితి.

పాలన అస్తవ్యస్తం...

అనంతపురం బస్టాండు మేనేజర్‌ ఒక్కడిపైనే అధికారులు పని భారం మోపుతుండటంతో వారికి ఎదురు చెప్పలేక ఆ మేనేజర్‌ సెలవులు పెడుతున్నారు. దీంతో బస్టాండులో పాలన అస్తవ్యస్తంగా మారుతోంది. బస్టాండు ఆవరణలోని దుకాణాల నిర్వాహకులు సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పట్టించుకునేవారు లేకపోవడంతో ఎమ్మార్పీ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా ధరలు వసూ లు చేస్తున్నారు. 2020లో అనంత బస్టాండుకు స్వచ్ఛ భారత అవార్డు కూడా వచ్చింది. అయితే ఇటీవల అధికారులు ప్రవర్తిస్తున్న తీరుతో స్వచ్ఛత కనుమరుగవుతోంది. రాత్రి అయిందంటే చాలు బస్టాండు ఆవరణతోపాటు ఆర్‌ఎం కార్యాలయ ఆవరణలోనూ మందుబాబులు ప్రవేశించి మద్యం సేవించడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.

ఖాళీలు భర్తీ చేయాలన్న ఆదేశాలు బేఖాతరు...

ఆర్టీసీలో ఖాళీగా ఉన్న స్థానాలను ఉద్యోగోన్నతుల రూపంలో భర్తీ చేయాలని 2021 నవంబరు నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఏడాది దాటినా అనంత ఆర్టీసీ అధికారులు ఆమేరకు చర్యలు తీసుకో లేదన్న విమర్శలొస్తున్నాయి. అనంతపురం బస్టాండులో అసిస్టెంట్‌ మేనేజర్‌ స్థానాలు భర్తీ చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. రీజియనలోనూ పలు బస్టాండ్లలో కంట్రోలర్ల కొరత ఉందని, నలు గురు కంట్రోలర్లు ఉండాల్సిన చోట ముగ్గురితోనే పనిచేయిస్తున్నారని ఆర్టీసీ సిబ్బందే చర్చించుకుంటుండటం గమనార్హం. ఉన్నతాధికారుల ఆదేశాలు తమకేమీ పట్టవన్నట్లు జిల్లా ఆర్టీసీ అధికారులు ప్రవర్తిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.

Updated Date - 2023-01-26T00:15:54+05:30 IST