కదం తొక్కిన అంగనవాడీలు..!

ABN , First Publish Date - 2023-02-07T00:05:21+05:30 IST

సమస్యల పరిష్కారం కోసం అంగనవాడీలు కదం తొక్కారు.

 కదం తొక్కిన అంగనవాడీలు..!

- నిర్బంధాలను దాటుకుని మహాధర్నా

- కనీస వేతనం అమలు చేయాల్సిందే: సీఐటీయూ

అనంతపురం కల్చరల్‌, ఫిబ్రవరి 6: సమస్యల పరిష్కారం కోసం అంగనవాడీలు కదం తొక్కారు. పోలీసు నిర్బంధాలను దాటుకుని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అంగనవాడీ వర్కర్లు, హెల్పర్లు కలెక్టరేట్‌ వద్దకు చేరుకున్నారు. కనీస వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం మహాధర్నా నిర్వహించారు. ధర్నాను కట్టడి చేసేందుకు యూనియన నాయకులకు పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. ధర్నాకు బస్సుల్లో వస్తున్నవారిని అడ్డుకున్నారు.

నీటి బుడగలే: ఓబులు

రాష్ట్ర ప్రజలకు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన ఇచ్చిన హామీలన్నీ నీటి మీద బుడగలేనని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించే ఉద్యోగులపై ఉన్నతాధికారులద్వారా సీఎం వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. హక్కుల సాధనకోసం ధర్నాకు వస్తున్న వారిని పోలీసులు నిర్బంధించడం దుర్మార్గమన్నారు. అధికారంలోకి వస్తే తెలంగాణలో అంగనవాడీలకు ఇస్తున్న దానికంటే ఎక్కువగా ఇస్తానని హామీ ఇచ్చిన జగన.. అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా హామీని ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. తెలంగాణ కంటే నాలుగైదు వేలు తక్కువగా ఉందన్నారు. ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అంగనవాడీలకు టీఏలు, బకాయిలు చెల్లించాలని, కనీస వేతన సలహాబోర్డు ఏర్పాటు చేసి, ప్రస్తుత ధరలకు అనుగుణంగా రూ.26 వేలు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఆందోళన ఉధృతం: రమాదేవి

సంవత్సరాల తరబడి హక్కుల సాధనకోసం పోరాడుతున్నా ప్రభుత్వాల్లో చలనం లేదని అంగనవాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన జిల్లా కార్యదర్శి రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని నిరసిస్తూ పోరాటాలను తీవ్రతరం చేస్తామని అన్నారు. మార్చిలో చలో విజయవాడ, ఏప్రిల్‌లో చలో ఢిల్లీ కార్యక్రమాలకు అంగనవాడీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఫేస్‌ యాప్‌ రద్దు చేయాలి: నాగేంద్ర

తనిఖీల పేరుతో అంగనవాడీ కేంద్రాలను సందర్శిస్తున్న ఫుడ్‌ కమిషనర్‌.. అక్కడి అంగనవాడీలను అగౌరపరిచేలా మాట్లాడడం తగదని, ఇలాగే కొనసాగితే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్‌ హెచ్చరించారు. రూ.లక్షల్లో వేతనాలు తీసుకుంటున్న ఉద్యోగులతో సమానంగా చిన్నపాటి అంగనవాడీలకు ఫేస్‌ యాప్‌ హాజరు పెట్టడం సరికాదని అన్నారు. ఈ విధానాన్ని రద్దు చేయాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని కోరారు.

కలెక్టరేట్‌ వద్ద అంగనవాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శకుంతల, రమాదేవి సంయుక్త అధ్యక్షతన నిర్వహించిన మహాధర్నాకు ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి, సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు నాగమణి, ఐద్వా జిల్లా కార్యదర్శి రాజేశ్వరి, అంగనడీ వర్కర్ల యూనియన జిల్లా కోశాధికారి జమున, ఏపీ మున్సిపల్‌ కార్మికుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణ, సీఐటీయూ నగర కార్యదర్శి వెంకటనారాయణ, ఏపీ రైతుసంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి పరమేష్‌ తదితరులు హాజరయ్యారు.

Updated Date - 2023-02-07T00:05:22+05:30 IST