అట్టుడికిన పుట్టపర్తి

ABN , First Publish Date - 2023-02-06T23:44:36+05:30 IST

జిల్లా కేంద్రం పుట్టపర్తి సోమవారం ఆందోళనలతో అట్టుడికింది. సమస్యలపై రైతు, వామపక్ష పార్టీలు, అంగనవాడీలు చేపట్టిన ధర్నాలతో దద్దరిల్లింది. కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి స్పందన అర్జీల స్వీకరణ కార్యక్రమం చేపట్టారు.

అట్టుడికిన పుట్టపర్తి
కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లేందుకు గేటు ఎక్కిన సీపీఎం నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు

అంగనవాడీలు, వామపక్షాల ధర్నా

కలెక్టరేట్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత

లోపలికి దూసుకెళ్లేందుకు సీపీఎం నేతల యత్నం

విరిగిన కలెక్టరేట్‌ గేటు

పుట్టపర్తి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పుట్టపర్తి సోమవారం ఆందోళనలతో అట్టుడికింది. సమస్యలపై రైతు, వామపక్ష పార్టీలు, అంగనవాడీలు చేపట్టిన ధర్నాలతో దద్దరిల్లింది. కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి స్పందన అర్జీల స్వీకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ అంగనవాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా కార్యకర్తలు, సహాయకులు భారీగా తరలివచ్చారు. కలెక్టరేట్‌ మీదుగా ర్యాలీగా వెళ్లి, ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. అంగనవాడీలకు ముఖ హాజరును రద్దు చేయాలనీ, వర్కర్లు, ఆయాలపై రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్‌ చేశారు. ఇదే సమయంలో అర్హులైన నిరుపేద రైతులందరికీ సాగు భూములు పంపిణీ చేయాలనీ, కూలి ధరలు పెంచాలంటూ సీపీఎం, రైతు సంఘాల ఆఽధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపట్టారు. టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించాలనీ, జగనన్న ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ సాయం రూ.5 లక్షలకు పెంచాలని సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ నిరసనలకు అంగనవాడీలు, రైతులు, కూలీలు, ఇళ్ల లబ్ధిదారులు వేలాదిగా తరలిరావడంతో పుట్టపర్తి వీధులు కిక్కిరిసాయి. వారి నినాదాలతో అట్టుడికాయి. రైతు సంఘాలు, సీపీఎం నాయకులను కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, నాయకుల మధ్య వాగ్వాదం తలెత్తి, ఉద్రిక్తతకు దారితీసింది. రైతు సంఘాలు, సీపీఎం నేతలు గేట్లు ఎక్కి, కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ తోపులాటలో కలెక్టరేట్‌ గేటు విరిగిపోయింది. జిల్లా కలెక్టర్‌ బయటకు రావాలని ప్రధాన ద్వారం వద్ద రైతులు, రైతు సంఘాల నేతలు బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు. ఇలా.. ప్రశాంతతకు నిలయమైన పుట్టపర్తి వీధులు ధర్నాలతో అట్టుడికాయి.

ముఖహాజరు రద్దు చేయాలి

పుట్టపర్తిరూరల్‌: అంగనవాడీలకు ముఖ హాజరును రద్దు చేసి, వేధింపులు ఆపాలని జిల్లాలోని అంగనవాడీలు, సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగనవాడీ యూనియన జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్‌ వెంకటేసు ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ఈఎస్‌ వెంకటేసు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అంగనవాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలనీ, సుప్రీంకోర్టు తీర్పుప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలనీ, వారిని ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. అంగనవాడీ వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలన్నారు. అంగనవాడీలకు ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అంగనవాడీలు అప్పులు చేసి, లబ్ధిదారులకు ఆహారం వండి పెడుతున్నారన్నారు. గ్రామాల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం కూడా లేదనీ, అయినా ప్రభుత్వం ముఖ హాజరు యాప్‌ డౌనలౌడ్‌ చేసుకోవాలని ఒత్తిడి తేవడం సరికాదన్నారు. అంగనవాడీ ధర్నా శిబిరం వద్దకు చేరుకున్న కలెక్టర్‌ బసంతకుమార్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అంగనవాడీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ భాగ్యరేఖ, తహసీల్దార్‌ నవీనకుమార్‌, సీఐటీయూ జిల్లా కోశాధికారి సాంబశివ, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ దిల్‌షాద్‌, అంగనవాడీ నేతలు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లారు..

పుట్టపర్తి: పేదలకు భూములు పంచాలనీ, కూలి పెంచాలంటూ కలెక్టరేట్‌ ముందు సీపీఎం ఆధ్వర్యంలో రైతుసంఘాలు నిరసనకు దిగాయి. కలెక్టరేట్‌ గేటును తోసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. గేటు ఎక్కి, లోపలికి ప్రవేశించారు. దీంతో గేటు విరిగింది. టిడ్కో, జగనన్న కాలనీలను పూర్తిచేసి, లబ్ధిదారులకు ఇవ్వాలనీ, ప్రస్తుతం ఇంటి నిర్మాణానికి ఇస్తున్న సాయం సరిపోవడం లేదనీ, రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం వామపక్షాల నాయకులు.. కలెక్టర్‌ బసంతకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఈసీ వెంకటేసు, ఇంతియాజ్‌, పెద్దన్న, సీపీఐ నాయకులు వేమయ్యయాదవ్‌, బయన్న, కాటమయ్య, జింకా చలపతి, చంద్రశేఖర్‌, హనుమంతరెడ్డి, ఆంజనేయులు, రాజేంద్రప్రసాద్‌, జయలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:44:40+05:30 IST