10వేల బీఈడీ సీట్లు తగ్గాయి

ABN , First Publish Date - 2023-01-26T04:27:09+05:30 IST

రాష్ట్రంలో బీఈడీ సీట్లు భారీగా తగ్గిపోయాయి. ప్రమాణాలు పాటించడం లేదని 120 కాలేజీలపై వేటు వేసి, అఫిలియేషన్‌ పునరుద్ధరించకపోవడంతో 10,790 సీట్లు తగ్గాయి.

10వేల బీఈడీ సీట్లు తగ్గాయి

రాష్ట్రంలో 120 కాలేజీలపై వేటు

ప్రమాణాలు పాటించలేదని చర్యలు

ప్రారంభమైన కౌన్సెలింగ్‌

అమరావతి, జనవరి 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీఈడీ సీట్లు భారీగా తగ్గిపోయాయి. ప్రమాణాలు పాటించడం లేదని 120 కాలేజీలపై వేటు వేసి, అఫిలియేషన్‌ పునరుద్ధరించకపోవడంతో 10,790 సీట్లు తగ్గాయి. గత విద్యా సంవత్సరం రాష్ట్రంలో 411 బీఈడీ కాలేజీలుంటే, ఇప్పుడు వాటి సంఖ్య 291కు తగ్గింది. నాడు 34,760 సీట్లు ఉండగా, ఇప్పుడవి 23,970 సీట్లకు తగ్గాయి. బీఈడీ అడ్మిషన్లకు బుధవారం కౌన్సెలింగ్‌ ప్రారంభమవడంతో కాలేజీల కొత్త జాబితాను ఉన్నత విద్యామండలి విద్యార్థులకు అందుబాటులో ఉంచింది. గతేడాది వరకు ఉన్న చాలా కాలేజీలు జాబితాలో కనిపించకపోవడం విద్యార్థులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఉన్నత విద్యామండలి ఇటీవల పలుమార్లు సమావేశాలు నిర్వహించి, కాలేజీలు తగ్గించేలా నిర్ణయం తీసుకుంది. అనేక కాలేజీలు నామమాత్రపు ప్రమాణాలు కూడా పాటించడం లేదని గుర్తించింది. ఒకే భవనంలో రెండు, మూడు కాలేజీలు నడుపుతున్నారని, ల్యాబ్‌లు లేవని, ఫ్యాకల్టీ లేరని తనిఖీల్లో అధికారులు గుర్తించారు. వాస్తవానికి అసలు విద్యార్థులు కాలేజీలకే రారని, బోధన కూడా జరగట్లేదనే విషయం వెలుగులోకి వచ్చింది. కన్వీనర్‌ కోటాలో అయితే హాజరు శాతం చూపించాలి కాబట్టి, చాలావరకు బీఈడీ సీట్లు మేనేజ్‌మెంట్‌ కోటాలో భర్తీఅవుతున్నాయని అంచనాకు వచ్చారు. అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో ఈశాన్య రాష్ర్టాల విద్యార్థులు ఎక్కువగా బీఈడీ పూర్తిచేస్తున్నారు. కేవలం అడ్మిషన్‌కు తప్ప కాలేజీల వైపు చూడటం లేదు. పరీక్షలను కూడా మేనేజ్‌ చేస్తున్నారని, అందుకే కాలేజీలకు రాకపోయినా ఉత్తీర్ణులవుతున్నారనే ఆరోపణలున్నాయి. తనిఖీలు చేపట్టిన అధికారులు 120 కాలేజీల పునరుద్ధరణకు అవకాశం ఇవ్వలేదు. అందుకే ఈ సంవత్సరం బీఈడీ కౌన్సెలింగ్‌ చాలా ఆలస్యమైంది. తరగతులు ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా, ఇప్పటికి కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది.

Updated Date - 2023-01-26T04:27:09+05:30 IST