యువతి గొంతుకోసిన ఉన్మాది అరెస్టు

ABN , First Publish Date - 2022-04-24T09:40:20+05:30 IST

హనుమకొండ గాంధీనగర్‌లో యువతి (23) గొంతుకోసి పరారైన ఉన్మాది అజహర్‌ను (24) పోలీసులు అరెస్టు చేశారు.

యువతి గొంతుకోసిన ఉన్మాది అరెస్టు

హనుమకొండ క్రైం/హనుమకొండ అర్బన్‌, ఏప్రిల్‌ 23 : హనుమకొండ గాంధీనగర్‌లో యువతి (23) గొంతుకోసి పరారైన ఉన్మాది అజహర్‌ను (24) పోలీసులు అరెస్టు చేశారు. హత్యాయత్నానికి పాల్పడిన తర్వాత స్నేహితుడి ఇంట్లో తల దాచుకున్న అజహర్‌ జాడను సాంకేతిక పరిజ్ఞానంతో కనిపెట్టి, అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఏసీపీ మూల జితేందర్‌రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. అతడిని ఖమ్మం జైలుకు తరలించామని తెలిపారు. హత్యాయత్నానికి ఉపయోగించిన కత్తి, మోటార్‌ సైకిల్‌ను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న సీఐ రాఘవేందర్‌, ఎస్‌ఐలు పున్నం చందర్‌, వీరేందర్‌, కానిస్టేబుళ్లు నరేశ్‌, మారుపెల్లి ప్రభుకుమార్‌లను సీపీ తరుణ్‌జోషి, రాష్ట్ర పోలీసు అధికారులు అభినందించారు. వరంగల్‌ జిల్లా సంగెం మండలం మొండ్రాయికి చెందిన ఎండీ అజహర్‌ (24) హనుమకొండలో నివాసముంటున్న యువతి ఫోన్‌ నంబర్‌ తీసుకుని ప్రేమ పేరుతో వేధిస్తున్న విషయం తెలిసిందే. అతనితో యువతి మాట్లాడటం మానేయడంతో నిందితుడు ఆమెపై కక్ష పెంచుకొని శుక్రవారం ఆమె ఇంటికెళ్లి గొంతు కోసి పరారయ్యాడు.


కోలుకుంటున్న బాధితురాలు

గాయపడిన యువతి క్రమంగా కోలుకుంటోందని ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. ప్రస్తుతం ఆహారం తీసుకుంటోందని, మా ట్లాడుతోందని ఆయన పేర్కొన్నారు. అప్పుడప్పుడూ శ్వాస ఇబ్బందులు తలెత్తితే ఆక్సిజన్‌ అందిస్తున్నామని చెప్పారు. రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని తెలిపారు.  కాగా, మేయర్‌ గుండు సుధారాణి శనివారం బాధితురాలిని పరామర్శించారు. 

Read more