యూపీఏ కంటే ఘోరం!

ABN , First Publish Date - 2022-03-16T08:31:22+05:30 IST

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

యూపీఏ కంటే ఘోరం!

 • అభివృద్ధిలో అధ్వానం.. మతపిచ్చిలో ముందంజ 
 • ఆర్థిక నిర్వహణలో దేశం పరిస్థితి ఘోరం 
 • బలహీన రాష్ట్రాలే కేంద్రం విధానం 
 • సమాఖ్య వ్యవస్థలను దెబ్బతీస్తోంది 
 • ఆకలిరాజ్యం దిశగా పయనిస్తున్న దేశం 
 • 2014లో యూపీఏపై నిందలు మోపి, 
 • వ్యాఖ్యానాలు చేసి అధికారంలోకి వచ్చారు
 • దుర్మార్గమైన నిర్ణయాలతో దేశం నాశనం 
 • మోదీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం 
 • శాసనసభ వేదికగా తీవ్ర విమర్శలు
 • దేశంలోని యువత, మేధావులు 
 • ఆలోచించాలని ముఖ్యమంత్రి పిలుపు


హైదరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి శాసనసభ వేదికగా విరుచుకుపడ్డారు. మంగళవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రాల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఆర్థిక నిర్వహణలో మనకంటే దేశం పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. నానా నిందలు మోపి, రకరకాల వ్యాఖ్యానాలు ప్రచారం చేసి 2014లో యూపీఏ ప్రభుత్వాన్ని దించి ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాళ్ల పనితీరు బాగాలేదని వీళ్లకు ఓటేస్తే దేశం మొత్తం క్రాష్‌ అయిపోయింది. యూపీఏ కంటే ఇప్పుడు పరిస్థితి దిగజారిపోయింది. వృద్ధిరేటు 8శాతం నుంచి 6 శాతానికి పడిపోయింది. దీనికి కరోనా కారణం కాదు. అంతకుముందే దిగజారింది. తెలంగాణ జీఎ్‌సడీపీ 4.5 లక్షల కోట్ల నుంచి 11.55 లక్షల కోట్లకు పెరిగింది. ఏటా లక్ష కోట్ల సంపద పెంచుకుంటూ పోతున్నం. రాష్ట్రంలా కేంద్రం కూడా పనిచేసి ఉంటే రాష్ట్రం 14.3 లక్షల కోట్లకు పెరిగేది. కేంద్రం అసమర్థ ఆర్థిక విధానాలతో రాష్ట్రానికి రావాల్సిన రూ.3 లక్షల కోట్ల సంపదకు నష్టం జరిగింది. రాష్ట్రంలో సంపద సమకూరాలంటే కేంద్రం పనితీరు కూడా కీలకం. ఇక్కడ అలా లేదు.


 వాళ్లవల్ల మనం కూడా నష్టపోతున్నాం’’ అని సీఎం ధ్వజమెత్తారు. ఒక్కో మెట్టు పేర్చుకుంటూ దశాబ్దాలుగా నిర్మించుకున్న రాష్ట్రాల అభివృద్ధిని కేంద్ర ప్రభు త్వం ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందన్న కనీస జ్ఞానం కూడా లేకుండా.. రాష్ట్రాలను బలహీనపరచి తాను బలపడాలని చూస్తోందని మండిపడ్డారు. వారి అవివేక, అసమర్థ నిర్ణయాలతో దేశాభివృద్ధి కిందికి దిగజారుతోందని, మతపిచ్చి, మూకదాడుల్లో మాత్రం పైపైకి ఎగబాకుతోందని వ్యాఖ్యానించారు. ‘‘ఫిస్కల్‌ పాలసీ కేంద్రానిదే. అక్కడ గొప్పగా ఉంటే.. రాష్ట్రాలు కూడా గొప్పగా ఉంటాయి. కానీ, కేంద్ర ప్రభుత్వ ధోరణి విచిత్రంగా కనిపిస్తోంది. బలమైన కేంద్రం.. బలహీనమైన రాష్ట్రాలు అన్నదే వారి విధానం. ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే చర్య. భవిష్యత్తులో దేశంలో అనేక సమస్యలకు దారితీస్తుంది.  కేంద్రం ప్రదర్శన కూడా మనకన్నా చాలా దిగజారిపోయింది. కేంద్ర ప్రభుత్వ డెడ్‌ పర్సంట్‌ జీడీపీ 58.5 శాతంగా ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ అప్పు రూ. 152 లక్షల కోట్లు. రాష్ట్రాలకు ఇచ్చేదేమో 25శాతం లో పు. రాష్ట్రాల నీతిని కేంద్రం కూడా పాటించాలి కదా! వాళ్లను అడిగేవారు లేరు కాబట్టి ఇష్టమొచ్చినట్టు నిధుల సమీకరణ చేస్తరు. రాష్ట్రాలను తొక్కిపెడ్తరు.


సమాఖ్య స్ఫూర్తికి విఘాతం.. 

వనపర్తి జిల్లా కలెక్టరేట్‌ ప్రారంభానికి వెళ్లినప్పుడు అక్కడ ఓ రోడ్డు కావాలని స్థానికులు కోరారు. కొద్దిపాటి అటవీభూమి కావాల్సి ఉంది. కానీ, ఇవ్వలేని పరిస్థితి. గతంలో ప్రజల అవసరాలకు 5 హెక్టార్ల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఉండేది. ఇప్పడు కేవలం హెక్టార్‌కే పరిమితం చేశారు. ఫెడరల్‌ వ్యవస్థలో ఇలా రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తరా..? దీనిపై సమీక్ష జరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎ్‌ఫఎస్‌ అధికారులను ఎప్పుడైనా మారుస్తమంటున్నరు. ఈ దుర్మార్గమైన చర్యను వెనక్కి తీసుకోవాలని చెప్పినం. బడ్జెట్‌ అంటే పబ్లిక్‌ ఫండ్‌. రాజకీయమంటే ఓట్లు, సీట్లు లెక్కబెట్టుకోవడమే కాదు. దానికే పరిమితమైతే అది అరాచకం అవుతుంది. కానీ, ఇప్పుడు చాలామంది పిగ్మీలు (మరుగుజ్జు) ఇందులో దూరిపోయి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగేలా ప్రవర్తిస్తున్నరు. ప్రేమపూర్వక దేశంలో విషబీజాలు నాటుతున్నరు. ఇది దేశానికి ఏమాత్రం సరికాదు. దీంతో తాత్కాలికంగా కొంతమందికి రాక్షసానందం కలగవచ్చు కానీ.. ప్రపంచానికే మార్గదర్శకంగా ఉంటూ భిన్నత్వంలో ఏకత్వంగా ముందుకు సాగుతున్న భారత సమాజం ఔన్నత్యాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నరు. 


మత కలహాలతో పెట్టుబడులు వస్తాయా..? 

ఎంతపెద్ద ఫార్మా కంపెనీ అయినా ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా హైదరాబాద్‌ ఫార్మాసిటీని అభివృద్ధి చేస్తున్నాం. విమానాల్లో అనేక దేశాలవారు వస్తున్నారు. హైదరాబాద్‌ విశ్వనగరంగా మారుతోంది. ఇలాంటి సమయంలో మతకలహాలు పెట్టి ప్రజలను విడదీసి ఒకరిపై ఒకరు పడి  కొట్టుకునేలా చేస్తున్నారు. బెంగళూరులో విమానం దిగగానే అక్కడ కర్ఫ్యూ ఉంటదంటే, హిజాబ్‌ పంచాయితీ ఉంటే, 144 సెక్షన్‌ పెడితే ఎవరైనా పెట్టుబడులకు ఎందుకొస్తరు.? ప్రజలు తొడుక్కునే బట్టలపై ప్రభుత్వ పెత్తనమేంటి.? ఇంత సంకుచితంగా ఆలోచిస్తే దేశం ఎటు వెళ్తుంది. హైదరాబాద్‌లో వాతావరణం బాగుంటుందంటేనే పెట్టుబడులు వస్తాయి. మత కలహాలతో రాష్ట్రంలో నెలకొల్పిన పని వాతావరణానికి ఇబ్బంది కలుగుతుంది. లక్షలాది మంది యువకుల భవిష్యత్తు అగమ్యగోచరం అవుతుంది. ఇది దేశానికి మంచిదికాదు. ఉన్మాదుల చర్యలపై రాష్ట్రం, దేశంలోని యువకులు ఆలోచించాలి. దేశంలో జీడీపీ 8 నుంచి 6శాతానికి తగ్గింది. 5 లక్షల పైబడి పరిశ్రమలు, సంస్థలు మూతపడ్డయ్‌. నిరుద్యోగిత రేటు యూపీఏలో 4.7శాతం ఉండగా.. ఇప్పుడు 7.11శాతానికి పెరిగింది. హంగర్‌ ఇండెక్స్‌లో దేశం 101వ స్థానంలో ఉంది.  ప్రజల హక్కుల పరిరక్షణలో 85 నుంచి 119 స్థానానికి పోయింది. హ్యూమన్‌ డెవల్‌పమెంట్‌ ఇండెక్స్‌లో 80 నుంచి 131వ స్థానానికి పోయింది. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో 56 నుంచి 93వ స్థానానికి పోయింది.     మతపిచ్చి మాత్రం పెరుగుతోంది. ఇది మంచిది కాదని దేశ యువత, మేధావులకు అప్పీలు చేస్తున్నా. లక్షలాది మంది ఉద్యోగాలు పోతాయి. 


ఇదీ ఉత్తరప్రదేశ్‌ డబుల్‌ ఇంజిన్‌ అభివృద్ధి.. 

కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండటం డబుల్‌ ఇంజన్‌ గ్రోత్‌గా పేర్కొంటున్నారు. అలా అనడం ఎంతో వెకిలిగా ఉంది. వాస్తవానికి డబుల్‌ ఇంజన్‌ గ్రోత్‌ ఉన్న యూపీతో తెలంగాణను పోల్చితే.. తలసరి ఆదాయం ఇక్కడ రూ.2.78 లక్షలు ఉంటే.. అక్కడ రూ.71 వేలు. అన్ని రాష్ట్రాల్లో వాళ్లర్యాంకు కిందినుంచి ఒక ర్యాంకు పైన ఉంది. ఆర్థిక వృద్ధి రేటు అక్కడ 7.26 ఉండగా ఇక్కడ 10.8గా ఉంది. అక్కడ శిశు మరణాలు 41 ఉండగా.. ఇక్కడ 23గా ఉంది. ఏడేళ్లలో దేశం జీడీపీ రూ.124 లక్షల కోట్ల నుంచి రూ.236 లక్షల కోట్లకు పెరిగింది. భారత వృద్ధిరేటు కంటే తెలంగాణ వృద్ధిరేటు 38.7 % ఎక్కువ. 


విద్యుత్తు మీటర్లు పెట్టం.. 

కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం 6.9ు ఉండగా.. రాష్ట్రాలకు 4% మాత్రమే. అందులోనూ 0.5 శాతానికి (రూ.5 వేల కోట్లు) విద్యుత్తు సంస్కరణలకు లంకె పెట్టారు.  విద్యు త్తు సంస్కరణల పేరుతో కేంద్రం మోసం చేస్తోంది. సంప్రదాయేతర విద్యుత్తు బంద్‌ చేసి వాళ్లది కొనాలట. ఎఫ్‌ఆర్‌బీఎంలో 0.5ు మీటర్లు పెడితేనే ఇస్తమని కేంద్రం చెబుతోంది. సచ్చినా సరే పెట్టనన్నా. నీతి ఆయోగ్‌ విడుదలచేసిన నివేదికలో మాతా మరణాల సంఖ్యలో నేడు తమిళనాడు కంటే మెరుగ్గా ఉన్నాం. ఆరోగ్యశాఖను అభినందిస్తున్నా. ఎకనామిక్స్‌ డైనమిక్స్‌లో అప్పులను వనరుల సమీకరణగా పరిగణిస్తారు. అవినీతిని అణిచివేసినం. పారదర్శకత పాటిస్తున్నం. అప్పుల్లో తెలంగాణ 25వ స్థానంలో ఉంది. మనకంటే ముందు 24 రాష్ట్రాలున్నాయి. మనం తక్కువ అప్పులు చేశాం’’ అని సీఎం పేర్కొన్నారు.

Read more