మహిళలకు రక్షణ కల్పించలేని సీఎం ఉరేసుకోవాలి: షర్మిల

ABN , First Publish Date - 2022-06-11T08:54:58+05:30 IST

మహిళల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించలేని సీఎం ఉరేసుకోవాలని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

మహిళలకు రక్షణ కల్పించలేని సీఎం ఉరేసుకోవాలి: షర్మిల

బోనకల్‌, జూన్‌ 10: మహిళల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించలేని సీఎం ఉరేసుకోవాలని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. నమ్మి రెండుసార్లు అవకాశమిచ్చిన ప్రజలను కేసీఆర్‌ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆమె ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం ఖమ్మంజిల్లా బోనకల్‌ మండలానికి చేరుకుంది. రాపల్లి, బ్రాహ్మణపల్లి, కలకోట గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించిన ఆమె బ్రాహ్మ ణపల్లిలో మాటాముచ్చట కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఎన్నికలప్పుడు పెద్ద సినిమా చూపించి, ఆ తరువాత మొహం చాటేయడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని మండిపడ్డారు. కొత్త పథకాలతో మళ్లీ జనం ముందుకు వస్తారని, ఆయన మాయ మాటలను నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ పాలన తిరిగి తెచ్చుకుంటేనే తెలంగాణ బాగుపడుతుందని, అందుకు ప్రజలంతా ఐక్యంగా ముందుకు కదిలి రాజన్న బిడ్డగా తనను ఆశీర్వదించాలని కోరారు.  తమ పార్టీ అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాపల్లి గ్రామంలో అరక దున్ని, ట్రాక్టర్‌ నడిపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. 


నేటి పాదయాత్ర: బోనకల్‌ మండలం కలకోట నుంచి సిరిపురం బ్రిడ్జి వద్ద మధిర మండలంలోకి ప్రవేశించిన షర్మిల బ్రిడ్జి సమీపంలో రాత్రి బస చేస్తారు. శనివారం సిరిపురం, వంగవీడు, కృష్టాపురం, అత్కూరు, జిలుగుమాడుకాలనీ, మధిరటౌన్‌, రాయనపట్నం గ్రామాల్లో పాదయాత్ర చేస్తారు. రాత్రి రాయనపట్నంలో బస చేస్తారు. 

Read more