సీబీఐ, ఈడీ కేసులపై.. జగతి, విజయసాయి పిటిషన్ల ఉపసంహరణ

ABN , First Publish Date - 2022-09-10T09:00:04+05:30 IST

సీఎం జగన్మోహన్‌ రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ, ఈడీ కేసులను కలిపి విచారించేలా సీబీఐ కోర్టుకు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలు..

సీబీఐ, ఈడీ కేసులపై.. జగతి, విజయసాయి పిటిషన్ల ఉపసంహరణ

కార్మెల్‌ ఏషియా సంస్థ కూడా.. సుప్రీంకోర్టుకు నివేదన

తెలంగాణ హైకోర్టులో ఊరట లభించినట్లు వెల్లడి 

న్యూఢిల్లీ, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): సీఎం జగన్మోహన్‌ రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ, ఈడీ కేసులను కలిపి విచారించేలా సీబీఐ కోర్టుకు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలు చేసుకున్న పిటిషన్లను ఏ-2 నిందితుడు విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్‌, కార్మెల్‌ ఏషియా హోల్డింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉపసంహరించుకున్నాయి. జగతి పబ్లికేషన్స్‌, విజయసాయిరెడ్డి, కార్మెల్‌ ఏషియా దాఖలు చేసిన 6 పిటిషన్లు, భారతి సిమెంట్స్‌ కార్పొరేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ శుక్రవారం జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ జేకే మహేశ్వరితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టులో తమకు గురువారం ఊరట లభించిందని, కాబట్టి పిటిషన్లను ఉపసంహరించుకుంటున్నట్లు పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ ధర్మాసనానికి తెలియజేశారు. భారతి సిమెంట్స్‌ మాత్రం పిటిషన్‌ను ఉపసంహరించుకోలేదు. గతంలో ఓ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా హైకోర్టు తీర్పు ఇచ్చిందని, కాబట్టి పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం లేదని ఆ సంస్థ తరఫు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబ్బల్‌ తెలిపారు.

Read more