కత్తులు, కొడవళ్లతో.. పొడిచి పొడిచి.. నరికి నరికి..

ABN , First Publish Date - 2022-08-16T09:42:26+05:30 IST

టీఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య(60) దారుణహత్యకు గురయ్యారు.

కత్తులు, కొడవళ్లతో.. పొడిచి పొడిచి.. నరికి నరికి..

తుమ్మల అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య దారుణహత్య

30కి పైగా కత్తిపోట్లతో తూట్లు పడ్డ చేతులు, ముఖం

ఆగస్టు 15 వేడుకల నుంచి వెళ్తుండగా దారికాచి దాడి 

ఖమ్మం రూరల్‌ మండలం తెల్దారుపల్లిలో దారుణం

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావే చంపించారంటూ పోలీసులకు ఫిర్యాదు

వీరభద్రం, కోటేశ్వరరావు ఇళ్లపై దాడి


ఖమ్మం/ఖమ్మం రూరల్‌ ఆగస్టు15 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య(60) దారుణహత్యకు గురయ్యారు. ఖమ్మంరూరల్‌ మండలం తెల్దారుపల్లి గ్రామానికి చెందిన ఆయన సోమవారం అదే మండలంలోని పొన్నెకల్‌ రైతువేదిక వద్ద జరిగిన పంద్రాగస్టు వేడుకలకు హాజరయ్యారు. జెండా ఎగురవేసి, తన ప్రధాన అనుచరుడైన ముత్తేశంతో కలిసి తిరిగి ఇంటికి వస్తుండగా.. తెల్దారుపల్లి దోబీఘాట్‌ వద్ద ఆటోలో మాటువేసిన ప్రత్యర్థులు పథకం ప్రకారం ఆయన ద్విచక్రవాహనాన్నిఢీకొట్టారు. దీంతో ద్విచక్రవాహనం నడుపుతున్న ముత్తేశంతోపాటు వెనకకూర్చున్న కృష్ణయ్య రోడ్డు పక్కనే ఉన్న కాలవలో పడిపోయారు.


అంతే.. ఆటోలోని ఆరుగురు వ్యక్తులూ కత్తులు, వేట కొడవళ్లతో కృష్ణయ్యపై దాడి చేశారు. ఆయన మెడపై, ఛాతీమీద, ఛాతీ పక్కభాగంలో.. ఇలా ఎక్కడపడితే అక్కడ విచక్షణరహితంగా కత్తులతో పోడిచారు. కొడవళ్లతో నరికారు. ప్రాణభయంతో ఆయన చేతులు అడ్డుపెట్టే ప్రయత్నం చేయడంతో రెండు చేతులనూ కొడవళ్లతో కోసేశారు. ఆ తర్వాత కళ్లలో కత్తులతో పొడిచి అత్యం త పాశవికంగా ప్రాణాలు బలిగొన్నారు. కృష్ణయ్య శరీరంపై మొత్తం 30కిపైగా కత్తిపోట్లున్నాయంటే ప్రత్యర్థులు ఆయన్ను ఎంత కిరాతకంగా హత్యచేశారో అర్థం చేసుకోవచ్చు. కృష్ణయ్య నివాసానికి 100 మీటర్ల దూరంలోనే ఈ హత్య జరిగింది. ద్విచక్రవాహనంపై నుంచి కిందపడిన ముత్తేశం లేచి చూసేసరికి.. ప్రత్యర్థులు కృష్ణయ్యపై దారుణంగా దాడి చేస్తున్నారు. ముత్తేశం పెద్దగా కేకలు వేసినా ప్రయోజనం లేకపోయింది. కృష్ణయ్యను చంపేసిన అనంతరం దుండగులు వచ్చిన ఆటోలోనే పరాయర్యారు. ఉదయం 11 గంటలకు  జరిగిన ఈ దారుణంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. కాగా.. కృష్ణయ్య అంత్యక్రియలు మంగళవారం ఆయన స్వగ్రామంలో నిర్వహించనున్నారు. 


ఎదుగుదలను చూడలేకే..
ప్రజల సమస్యల పరిష్కారానికి కృష్ణయ్య కృషి చేస్తున్నారని.. దీంతో జనమంతా ఆయన వెంట వస్తున్నారని.. కృష్ణయ్య కుమారుడు నవీన్‌, భార్య, తెల్దారుపల్లి ఎంపీటీసీ సభ్యురాలు మంగతాయి, కుమార్తె రజిత తెలిపారు. రాజకీయంగా కృష్ణయ్య ఎదుగుదల చూసి ఓర్వలేక సీపీఎం నాయకుడు తమ్మినేని కోటేశ్వరరావే ఆయన్ను హత్య  చేయించారంటూ వారు కన్నీటిపర్యంతమయ్యారు.  ఈ మేరకు వారు పోలీసులకు కూడా ఫిర్యాదుచేశారు. తెల్దారుపల్లి గ్రామానికి చెందిన షేక్‌ రంజాన్‌, కృష్ణ, గజ్జి కృష్ణస్వామి, నూకల లింగయ్య, బండి నాగేశ్వరరావు, బోడపట్ల శ్రీను, యల్లంపల్లి నాగయ్య అనే వ్యక్తులు ఆటోలో వచ్చి బండిమీద వస్తున్న కృష్ణయ్యను హత్యచేసి పరారయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మీడియా సమావేశంలోనూ అదే విషయాన్ని వెల్లడించారు. కోటేశ్వరరావుతోపాటు నిందితులందరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కృష్ణయ్య భార్య మంగతాయి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పెద్దాయన (తమ్మినేని వీరభద్రం) ఆదేశాల మేరకే కోటేశ్వరరావు కుట్రపన్ని నా భర్తను చంపించాడు’’ అని ఆరోపించారు. 

ఆగ్రహావేశాలతో..
కృష్ణయ్య హత్య గురించి నిమిషాల వ్యవధిలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు తెలిసిపోయింది. దీంతో.. గ్రామస్థులు, ఆ మండలానికి చెందిన వందలాదిమంది ఘటనా స్థలానికి చేరుకుని రక్తపుమడుగులో విగతజీవిగా పడి ఉన్న కృష్ణయ్యను చూసి కంటతడిపెట్టారు. కొందరు గ్రామస్థులు, ఆయన అభిమానులు కోపోద్రిక్తులై గ్రామంలోని సీపీఎం నాయకుల ఇళ్లపై దాడికి ప్రయత్నించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆయన సోదరుడు కోటేశ్వరరావు ఇళ్లపై రాళ్లు రువ్వారు. కోటేశ్వరరావు ఇంట్లోకి వెళ్లి వస్తువులన్నీ ధ్వంసం చేశారు. అనంతరం ఆయనగ్రానైట్‌ క్వారీలోని పొక్లెయిన్‌కు నిప్పు పెట్టారు. అయితే.. కృష్ణయ్య హత్యోదంతంతో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న విషయాన్ని గ్రహించిన తమ్మినేని కోటేశ్వరరావు కుటుంబసభ్యులతో పాటు సీపీఎంకు చెందిన పలు కుటుంబాలు అప్పటికే తమ ఇళ్ల నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. 

రాజకీయ కక్షలే..
తమ్మినేని వీరభద్రానికి సొంత బాబాయి కుమారుడైన కృష్ణయ్య తొలి నుంచీ సీపీఎంలో ఉండేవారు. గత సర్పంచ్‌ ఎన్నికల సమయంలో విభేదాలు రావడం, తదనంతర పరిణామాలతో మూడేళ్ల క్రితం సీపీఎంను వీడి టీఆర్‌ఎ్‌సవైపు వచ్చారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అనుచరుల్లో ఒకరిగా ఖమ్మం రూరల్‌ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. దీంతో సీపీఎం ఆధిపత్యానికి బ్రేకులు పడినట్టయింది. తమ్మినేని వీరభద్రం సొంతగ్రామమైన తెల్దారుపల్లిలో టీఆర్‌ఎస్‌ పుంజుకుంది. ఈ క్రమంలో గ్రామంలో సీపీఎం నాయకులకు, కృష్ణయ్యకు మధ్య విభేదాలు తీవ్రతరమయ్యా యి. కృష్ణయ్యను చంపేందుకు ప్రత్యర్థులు పలుమార్లు రెక్కీ నిర్వహించినట్టు సమాచారం. దీంతో కృష్ణయ్య తనకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలంటూ పలుమార్లు ఖమ్మం పోలీసు కమిషనర్‌, ఇతర పోలీసు అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. తుమ్మల నాగేశ్వరరావు కూడా.. ‘జాగ్రత్తగా ఉండండి.. పరిస్థితి బాగాలేదు’ అని కృష్ణయ్యకు చెబుతూ వస్తున్నారు. చివరకు ఆయన ఇలా ప్రత్యర్థుల దాడిలో దారుణ హత్యకు గురయ్యారు.

చనిపోయాడని నిర్ధారించుకున్నాకే..
సోమవారం ఉదయం పొన్నెకల్‌ రైతువేదిక వద్ద జాతీయ జెండా ఎగురవేసిన తర్వాత  ద్విచక్రవాహనంపై గుర్రాలపాడు వెళ్లాం. అక్కడినుంచి తిరిగి వస్తుండగా తెల్దారుపల్లి ఊరు ముందు దోబిఘాట్‌వద్ద ఎదురుగా వేగంగా వచ్చిన ఆటో నా బండిని ఢీకొట్టింది. నేను కుడివైపు పడిపోగా, కృష్ణయ్య ఎడమవైపు కాలవలో పడ్డారు. వెంటనే ఆటోలో నుంచి నూకల లింగయ్య, గజ్జి కృష్ణస్వామి, మెంటల్‌ శ్రీను, బండారు నాగేశ్వరరావు తదితరులు దిగి..కత్తులు, వేటకొడవళ్లతో కృష్ణయ్యపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఆయన చేతులు అడ్డుపెట్టడంతో చేతులను రెండుముక్కలు చేశారు. మరణించిన విషయం నిర్ధారించుకున్న తర్వాత ఆటోలో పరారయ్యారు 
- ముత్తేశం, తమ్మినేని కృష్ణయ్య అనుచరుడు, హత్యకు ప్రత్యక్ష సాక్షి


నిందితుల కోసం గాలింపు.. 
- ఖమ్మం సీపీ విష్ణుఎ్‌సవారియర్‌
తమ్మినేని కృష్ణయ్యను హత్య చేసినవారిని గాలించడానికి నాలుగు బృందాలు ఏర్పాటు చేశామని ఖమ్మం పోలీసు కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌ పేర్కొన్నారు. గ్రామంలో 144 సెక్షన్‌ విధించామని, గ్రామంలో ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని, గుంపులు, గుంపులుగా తిరగవద్దని సూచించామని తెలిపారు. 200మందికి పైగా పోలీసులను గ్రామంలో మోహరించామని, హత్య ఘటనపై క్షేత్రస్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులను పట్టుకుని చట్టం ముందు నిలబెడతామని పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. 

Updated Date - 2022-08-16T09:42:26+05:30 IST