మాది ఏ ఫ్రంటో తర్వాత చెబుతాం: కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-03-04T21:57:52+05:30 IST

బీజేపీ ముక్త్‌ భారత్‌’ అంటూ నినదించిన సీఎం కేసీఆర్‌ జాతీయ స్థాయిలో వేదిక ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ప్రధాని మోదీ వ్యతిరేక కూటమి కట్టే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

మాది ఏ ఫ్రంటో తర్వాత చెబుతాం: కేసీఆర్‌

హైదరాబాద్: ‘బీజేపీ ముక్త్‌ భారత్‌’ అంటూ నినదించిన సీఎం కేసీఆర్‌ జాతీయ స్థాయిలో వేదిక ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ప్రధాని మోదీ వ్యతిరేక కూటమి కట్టే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బీజేపీ, కాంగ్రేసేతర పార్టీలతో జత కట్టేందుకు దేశాన్ని చుట్టేయాలని అనుకుంటున్నారు. ఇందులోభాగంగా జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఆ సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. జార్ఖండ్‌ సీఎంతో జాతీయ రాజకీయాలపై చర్చించామని తెలిపారు. త్వరలోనే మరికొందరు నేతలను కలుస్తామని ప్రకటించారు. దేశంలో మరింత మెరుగైన అభివృద్ధి జరగాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. దేశానికి కొత్త దిశా నిర్దేశం కావాలన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదు.. అనుకూలం కాదని తేల్చిచెప్పారు. దేశ హితం కోసమే తమ ప్రణాళిక అని తెలిపారు. తమది ఏ ఫ్రంటో తర్వాత చెబుతామని కేసీఆర్‌ వెల్లడించారు.


ఇప్పటికే కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఎన్సీపీ నేత శరత్ పవార్‌ను కలిశారు. గురువారం భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయత్‌ను కూడా కలిశారు. ఇరువురు దాదాపు 3 గంటలకుపైగా సుదీర్ఘంగా సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా ఒక జాతీయ వ్యవసాయ విధానం రావాలన్న అంశంపై ప్రధానంగా చర్చజరిగినట్లు సమాచారం. వ్యవసాయ విధానం కోసం దేశవ్యాప్తంగా ఆందోళన అవసరమని ఇద్దరూ అభిప్రాయపడినట్లు తెలిసింది. రాష్ట్రంలో రైతులకు అమలు చేస్తున్న పథకాల గురించి తికాయత్‌కు కేసీఆర్‌ వివరించినట్లు సమాచారం. 

Read more