ఉద్యోగాల భర్తీ ఎప్పుడు?

ABN , First Publish Date - 2022-10-03T08:00:11+05:30 IST

రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. భర్తీ ప్రక్రియను వేగంగా చేపట్టేందుకు మాత్రం చర్యలు తీసుకోవడంలేదు.

ఉద్యోగాల భర్తీ ఎప్పుడు?

  • 80,039 పోస్టులు భర్తీ చేస్తామన్న సీఎం..
  • ఆచరణలో కనిపించని వేగం
  • ఇప్పటివరకు అనుమతి ఇచ్చినవి 52,460
  • నోటిఫికేషన్‌ మాత్రం 22,594 పోస్టులకే
  • 29,866 ఉద్యోగాలకు రాని నోటిఫికేషన్లు
  • ఏళ్ల తరబడి సా..గుతున్న భర్తీ ప్రక్రియ!
  • తీవ్ర ఒత్తిడి, ఆందోళనలో ఉద్యోగార్థులు

హైదరాబాద్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. భర్తీ ప్రక్రియను వేగంగా చేపట్టేందుకు మాత్రం చర్యలు తీసుకోవడంలేదు. దీంతో ఆరు నెలలు గడిచినా ఇంకా సగం పోస్టులు కూడా భర్తీ కాలేదు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టులను భర్తీ చేస్తామని మార్చి 9న సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో  ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, ఇంకా అన్ని పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులే ఇవ్వలేదు. అనుమతులు ఇచ్చిన పోస్టులకు కూడా నోటిఫికేషన్లు వెలువడలేదు. ముఖ్యమంత్రి ప్రకటన చేశాక.. ఇప్పటివరకు 52,460 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. కానీ, వీటిలో 22,594 పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇంకా 29,866 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల సొసైటీల పరిధిలో బోధన సిబ్బంది కేటగిరీలో మొత్తం 9096 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. 


తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (ట్రిబ్‌) ద్వారా వీటి నియామక ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే.. నోటిఫికేషన్‌ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి ముందడుగు పడలేదు. వెటర్నరీ యూనివర్సివటీల్లోని 105 పోస్టుల భర్తీ కోసం కామన్‌ నియామక బోర్డుకు అప్పగించారు. కానీ, రాష్ట్రంలో ఈ బోర్డు కార్యకలాపాలు ఇంకా మొదలే కాలేదు. ఇటీవలే అసెంబ్లీలో ఈ బోర్డుకు సంబంధించిన చట్ట సవరణ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎ్‌సపీఎస్సీ) ద్వారా భర్తీ చేయడానికి వీలుగా ప్రభుత్వం 14,893 పోస్టులకు అనుమతి ఇచ్చింది. అయితే టీఎ్‌సపీఎస్సీ మాత్రం ఇప్పటివరకు 3,359 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇంకా 11 వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేన్‌ జారీ చేయాల్సి ఉంది. పైగా మొదటి నోటిఫికేషన్‌ జారీ చేసి ఇప్పటికి ఐదు నెలలు అవుతోంది. అయినా.. ఈ పోస్టుల భర్తీకి ఇంకా పరీక్షలే ప్రారంభం కాలేదు. అన్నింటికీ ఒకేసారి కాకుండా, దశల వారీగా ఆయా పోస్టులను భర్తీ చేస్తామని ప్రభు త్వం ప్రకటిస్తోంది. అయితే.. ఈ స్థాయిలో జాప్యం జరిగితే అన్ని పోస్టుల భర్తీ పూర్తి కావడానికి ఏళ్ల తరబడి సమయం పడుతుందని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.


503 పోస్టులకే నోటిఫికేషన్‌

టీఎ్‌సపీఎస్సీ ద్వారా 503 గ్రూపు-1 పోస్టుల భర్తీకిగాను ఈ ఏడాది ఏప్రిల్‌లో తొలి నోటిఫికేషన్‌ జారీచేశారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి ముందు నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం జూలై, ఆగస్టు నెలల్లో  ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ, ఈ పరీక్షలను అక్టోబరు 16వ తేదీకి వాయిదా వేశారు. దాంతో డిసెంబరులో జరగాల్సిన మెయిన్స్‌ పరీక్షలు జనవరి, ఫిబ్రవరికి వాయిదా పడ్డాయి. మరోవైపు అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీలో కూడా సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రక్రియను పెండింగ్‌లో పెట్టారు. షెడ్యూల్‌లో పేర్కొన్న ప్రకారం ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 5నుంచి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంది. అయితే.. అర్హత విషయంలో కొంత మంది పెట్టుకున్న అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రక్రియను నిలిపివేశారు. 


గతంలోని నిబంధనల ప్రకారం ఈ పోస్టులకు మెకానికల్‌, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌గానీ, అందుకు సమానమైన అర్హత గానీ, మూడేళ్ల ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా విద్యార్హతతోపాటు లారీ, బస్సు వంటి భారీ వాహనాలు నడిపేందుకు వీలుగా లైసెన్సు కలిగి ఉండాలి. మహిళలకు తేలికపాటి వాహ న లైసెన్సు ఉన్నా అర్హులే. అయితే.. ఉద్యోగంలో చేరిన రెండేళ్లలోగా హెవీ మోటారు వాహనాల లైసెన్సు పొందాల్సి ఉంటుంది. కానీ, టీఎ్‌సపీఎస్సీ మాత్రం.. నోటిఫికేషన్‌ జారీచేసే నాటికే పురుషులతోపాటు మహిళా అభ్యర్థులు కూడా భారీ వాహనాల లైసెన్సును కలిగి ఉండాలనే నిబంధన విధించారు. అయితే ఈ అంశంపై పలు అభ్యర్థనలు రావడంతో దరఖాస్తుల ప్రక్రియను నిలిపివేశారు. దీనిపై ప్రభుత్వ అభిప్రాయాన్ని కమిషన్‌ కోరగా.. సర్కారు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. దాంతో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. పోలీసు నియామక బోర్డు మాత్రం ప్రభుత్వం అనుమతించిన అన్ని పోస్టులకూ నోటిఫికేషన్లు జారీ చేయడం గమనార్హం. 


గ్రూపు-4 పోస్టుల సంగతేందీ?

టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేసే పోస్టుల్లో గ్రూపు-4 ఉద్యోగాలే ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 9వేల పోస్టులకు పైగా భర్తీ చేయాల్సి ఉన్నా.. ప్రభుత్వం ఇప్పటివరకూ అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాక కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పోస్టులు రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉంటాయి. అంటే... రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 50 విభాగాల్లో ఈ పోస్టులు ఉండనున్నాయి. వీటి కోసం రోస్టర్‌ విధానాన్ని ఖరారు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికే 4 నెలలు పడుతుందని భావిస్తున్నారు. ఇప్పటివరకూ అనుమతులే రాకపోవడంతో ఈ పోస్టులను భర్తీ చేసేది ఎప్పుడన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయడంలో ఆలస్యం జరిగే కొద్దీ తమకు ఇబ్బందులు తప్పవని నిరుద్యోగులు అంటున్నారు. చాలా ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ నిర్ణయం తీసుకోవడంతో లక్షలాది మంది అభ్యర్థులు ఈ పోస్టులకు పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా హై దరాబాద్‌ వంటి నగరాల్లో ఉంటూ, ప్రత్యేక కోచింగ్‌ కేంద్రాల్లో చేరారు. నోటిపికేషన్లు ఆలస్యమయ్యే కొద్దీ వీరు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. 

Read more