ఈ ఊళ్లకు దారేది?

ABN , First Publish Date - 2022-08-16T09:46:11+05:30 IST

అవన్నీ మారుమూల గిరిజన గ్రామాలు. వారంతా నిరుపేద గిరిజనులు. ఎటువంటి అభివృద్ధికీ నోచుకోక.. అటవీ ప్రాంతాల్లో జీవనం గడుపుతున్నవారు.

ఈ ఊళ్లకు దారేది?

రోడ్డు సౌకర్యం లేని గిరిజన గ్రామాలు.. ఇతర ప్రాంతాలతో కనెక్టివిటీ లేక నాగరికతకు దూరంగా తండాలు

వర్షాకాలం వచ్చిందంటే నరకయాతనే

వరదలతో అడుగు బయట పెట్టలేని కష్టం

8 నిత్యావసర సరుకులూ అందని పరిస్థితి

8 గర్భిణులను ఆస్పత్రికీ తీసుకెళ్లలేని దుస్థితి

8 రోడ్ల నిర్మాణానికి అడ్డంకిగా అటవీ చట్టాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)


వన్నీ మారుమూల గిరిజన గ్రామాలు. వారంతా నిరుపేద గిరిజనులు. ఎటువంటి అభివృద్ధికీ నోచుకోక.. అటవీ ప్రాంతాల్లో జీవనం గడుపుతున్నవారు. గ్రామాలకు కనీసం రహదారులు కూడా లేక అత్యవసర పరిస్థితుల్లో ఆపద పాలవుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి బిక్కుబిక్కుమంటున్నారు. నిత్యావసరాలు కూడా అందని దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎడ్లబండి వెళ్లేందుకు కూడా వీల్లేని పరిస్థితులు ఉండడంతో.. ఏవైనా ప్రమాదాలు జరిగినా, గర్భిణులకు పురిటి నొప్పులు వచ్చినా దేవుడిపైనే భారం వేస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆ ప్రాంతాలకు రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చే పాలకులు.. ఆ తరువాత తమ హామీలను విస్మరిస్తున్నారు. కొన్నిచోట్ల రోడ్లను మంజూరు చేసినా.. అటవీశాఖ అభ్యంతరాలు చెబుతోంది. దీంతో గిరిజనులు ప్రత్యక్ష నరకాన్ని ఎదుర్కొంటున్నారు. 


ఆసిఫాబాద్‌ జిల్లాలో 398 ఆవాసాలకు లేని రోడ్డు

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ఏజెన్సీలో ఇప్పటికీ 398 గ్రామాలకు కనీసం రోడ్డు సౌకర్యం లేదు. ముఖ్యం గా తిర్యాణి, కెరమెరి, సిర్పూరు (యు), లింగాపూర్‌, బెజ్జూరు, పెంచికల్‌పేట, దహెగాం మండలాల్లో రోడ్లులేక ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. తిర్యాణి మండలంలోనైతే మొత్తం 57 ఆవాసాలకు రోడ్డు ఆనవాళ్లు కూడా లేవు. గుండాల గ్రామ పంచాయతీ పరిధిలోనే 30కిపైగా గిరిజన గూడేలుండగా.. ఏ ఒక్కదానికీ కనెక్టివిటీ లేదు. దీంతో నాగరికతకు దూరంగా కొట్టుమిట్టాడుతున్నాయి. సిర్పూరు నియోజకవర్గంలో రోడ్లు ఉన్నప్పటికీ ఏటా వర్షాకాలంలో మట్టి రోడ్లు బురదగుంటలుగా మారుతున్నాయి. పక్కా రోడ్లు నిర్మించాలన్న ప్రతిపాదనలున్నా అటవీశాఖ అనుమతుల రూపంలో అడ్డంకులు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని ఏన్కూరు మండలం కొత్తమేడేపల్లి గిరిజన గ్రామానికి ఎటువంటి రహదారి లేదు. వర్షాకాలంలో వాగులు ప్రవహిస్తే రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. ఎమ్మెల్యే రాములునాయక్‌ ఈ గ్రామాన్ని సందర్శించి సమస్యల పరిష్కరిస్తానని హామీ ఇచ్చినా ఇప్పటివరకు నెరవేర్చలేదు. ఇదే మండలంలోని వడ్డిగూడెం గ్రామానికి, కారేపల్లి మండలంలోని నడిమూరు గిరిజన గూడేనికి రహదారుల నిర్మాణం హామీలకే పరిమితమయింది. అనంతారం తండా, చంద్రాలగూడెం, చెన్నంగుల గడ్డ, చిన్మాతండా, బోడితండా, లాల్‌తండా, మల్లన్నగూడెం గిరిజన గ్రామాలకు సైతం రహదారులు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐటీడీఏకు ప్రతిపాదనలు వెళ్లినా కార్యరూపం దాల్చడంలేదు. పూర్తి ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేక గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. గుండాల, ఆళ్లపల్లి, పినపాక, కరకగూడెం, చర్ల, భద్రాచలం, టేకులపల్లి, అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ మండలాల్లో అనేక గ్రామాల ప్రజలు నేటికి కాలినడకనే ప్రయాణించాల్సి వస్తోంది. ఎవరికైనా ఏమైనా ప్రమాదం జరిగినా, పురిటినొప్పులు వచ్చినా జోలికట్టి తీసుకెళ్లాల్సివస్తోంది.


అటవీ శాఖ అధికారులపై సీఎం ఆగ్రహం

 ములుగు జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం(నూగూరు)లో చాలా గ్రామాలకు రవాణా సౌకర్యం ఇంకా మెరుగుపడలేదు. రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరైనా.. అటవీ శాఖ అభ్యంతరాల కారణంగా పనులు ముందుకు సాగడంలేదు. ఈ ఏడాది జూలైలో జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్‌ ఈ విషయమై అటవీశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణాలను అడ్డుకోవద్దని ఆదేశించారు. వాజేడు మండలంలో ఇటీవల చాకలివాగు ఉప్పొంగడంతో కోయవీరాపురం గ్రామానికి పది రోజులపాటు రాకపోకలు నిలిచిపోయాయి. ఏటూరునాగారం మండలంలోని ఎలిశెట్టిపల్లి వర్షాకాలమంతా జలదిగ్బంధంలో చిక్కుకోవడం సాధారణమైపోయింది. 


గాల్లో కలుస్తున్న ప్రాణాలు..

ఆదిలాబాద్‌ జిల్లా ఏజెన్సీ గ్రామాల ప్రజలు రోడ్లు లేక గోస  పడుతున్నారు. ప్రధానంగా గాదిగూడ, నార్నూర్‌, ఉట్నూర్‌, సిరికొండ, ఇంద్రవెల్లి, బజార్‌హత్నూర్‌ మండలాల్లోని పలు గ్రామాలకు కిలో మీటర్ల మేర కాలినడకనే వెళ్లాల్సి వస్తోంది. గర్భిణులను వాగును దాటించే క్రమం లో కొన్ని సందర్భాల్లో వైద్యం ఆలస్యమై ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. నిర్మల్‌ జిల్లాలో పలు గిరిజన గ్రామాలకు రోడ్ల నిర్మాణానికి అంచనాలు కూడా తయారు చేసి ప్రభుత్వానికి పంపినా.. ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదు. గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో పలు గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలో చెంచుపెంటలకు రోడ్డు సౌకర్యం లేదు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ పెంటలకు రోడ్డు సౌకర్యం కల్పించడం లేదనే ఆరోపణలున్నాయి. 


దొత్తి వాగుపై వంతెన నిర్మించాలి..

- సోము, యాపాల్‌గూడ, నిర్మల్‌ జిల్లా

దొత్తి వాగుపై వంతెన లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. కనీసం వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నాం. గతంలో వాగు దాటే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అధికారులు స్పందించి వెంటనే వంతెన నిర్మించాలి. 


నరకం అనుభవిస్తున్నాం.. 

- భోగ జీవన్‌, సోమిని, ఆసిఫాబాద్‌ జిల్లా

రోడ్డు సౌకర్యం లేక ఏటా వర్షాకాలంలో నరకయాతన అనుభవిస్తు న్నాం. రోగమొచ్చినా నడకదారే దిక్కవుతోంది. గర్భిణులను ప్రసూతి కోసం తీసుకెళ్లాలంటే దేవుడు కనిపిస్తున్నాడు. సమస్య తీరేందుకు ఇంకెన్నాళ్లు పడుతుందో ప్రజాప్రతినిధులే చెప్పాలి. 

Read more