హడ్కో రుణం హుళక్కే?

ABN , First Publish Date - 2022-07-07T10:00:17+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రెండు పడకగదుల (డబుల్‌ బెడ్రూం) ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే హడ్కో రుణం రాష్ట్రానికి ఇప్పట్లో వచ్చే సూచనలు కనిపించడం లేదు.

హడ్కో రుణం హుళక్కే?

  • అంతులేని కథగా హౌసింగ్‌ లోన్‌ వ్యవహారం 
  • పెండింగ్‌ బిల్లులు, కొత్త డబుల్‌ ఇళ్లకు దా‘రుణ’ ఆలస్యం


హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రెండు పడకగదుల (డబుల్‌ బెడ్రూం) ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే హడ్కో రుణం రాష్ట్రానికి ఇప్పట్లో వచ్చే సూచనలు కనిపించడం లేదు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ఢిల్లీలో ఎన్ని ప్రయత్నాలు చేసినా, రుణంపై సందిగ్ధత వీడటం లేదు. దీంతో ప్రతిష్ఠాత్మక డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. గృహ నిర్మాణ శాఖకు ఇది ఒక అంతులేని కథగా తయారైంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన 1,13,535 ఇళ్ల పెండింగ్‌ బిల్లులు రూ.705 కోట్లు కాగా, ఇంకా ప్రారంభించాల్సిన 61,606 ఇళ్ల నిర్మాణ ప్రక్రియ నత్తనడకన కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది.


కాంట్రాక్టర్లకు ఆర్థిక ఇబ్బందులు

డబుల్‌ బెడ్‌రూం స్కీం ప్రారంభించిన కొత్తలో మొత్తం 2,91,057 ఇళ్లను కట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. వాటిలో జీహెచ్‌ఎంసీ పరిఽధిలో లక్ష, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలిపి 1,91,057 ఉన్నాయి. వీటిలో 2,73,534 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మంజూరైన వాటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 56,066 ఇళ్లను పూర్తిగా, 29,763 గృహాలను 90 శాతం వరకూ నిర్మించింది. మిగిలిన గృహాలు వేర్వేరు దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇక జిల్లాల పరిధిలో 57,469 ఇళ్లను పూర్తి చేయగా, 61,136 ఇళ్లకు ఇంకా నిర్మాణమే మొదలుకాలేదు. ఈ పథకం కోసం ప్రభుత్వం సుమారు రూ. 10,800 కోట్లు ఖర్చు చేయగా, జీహెచ్‌ఎంసీ పరిధిలోనే రూ. 6556.71 కోట్లను వెచ్చించింది. జిల్లాల్లో రూ. 4,243.29 కోట్లను ఖర్చు చేసింది. గుత్తేదారులకు చెల్లించాల్సిన వాటిలో రూ. 705 కోట్లను నిలిపేసింది. దీంతో వారంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పెండింగ్‌ బిల్లుల కోసం మరో రూ. 2 వేల కోట్ల హడ్కో రుణం కోసం ప్రభుత్వం యత్నిస్తుండగా... అటు నుంచి సానుకూల స్పందన కనిపించడం లేదు. 


ఈ నేపథ్యంలో.. రాష్ట్ర హౌసింగ్‌ శాఖ వర్గాల్లో హడ్కో రుణంపై తీవ్ర ఆందోళన నెలకొంది. ఒక వైపు పెండింగ్‌ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు, మరోవైపు ఇళ్ల కోసం లబ్ధిదారులు, అటు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిత్యం నిలదీస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఒత్తిడిలో పడింది. ఇదే కాక,. 2016 తర్వాత ముడిసరుకుల ధరలు, కూలి రేట్లు పెరగడంతో సర్కారు ఇచ్చే బడ్జెట్‌ సరిపోవడంలేదని కాంట్రాక్టర్లు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. పథకం ప్రారంభించిన తర్వాత స్టాండర్డ్‌ షెడ్యూల్‌ ఆఫ్‌ రేట్స్‌ పెంచకపోవడమూ.. వారికి భారంగా మారింది. ఎస్‌ఎ్‌సఆర్‌ పెంచేందుకు, బకాయిలు చెల్లించేందుకైనా హడ్కో నుంచి రుణం తీసుకోవాలని సర్కారు యోచిస్తోంది. అందుకోసం హౌసింగ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ.. నెలన్నర కింద ఢిల్లీ వెళ్లి రిజర్వుబ్యాంకు పెద్దలను కలిసినా రుణ మంజూరు విషయం తేలలేదు. అయితే.. హౌసింగ్‌ అధికారులు మాత్రం ఈ విషయంలో ధీమాగా ఉండటం ఆసక్తికరం.

Read more