మా కార్యకర్తలపై గాడిద దొంగతనం కేసా?

ABN , First Publish Date - 2022-02-19T06:56:13+05:30 IST

‘కల్వశుంఠ’’ కళ్ల ముందు కనిపిస్తుండగా గాడిద దొంగతనం కేసు

మా కార్యకర్తలపై గాడిద దొంగతనం కేసా?

  • ‘కల్వశుంఠ’.. కళ్లముందు కనిపిస్తుంటే.. 
  • ఇది దుర్మార్గం.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్వీట్‌

  

హైదరాబాద్‌/బంజారాహిల్స్‌/జమ్మికుంట, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): ‘‘కల్వశుంఠ’’ కళ్ల ముందు కనిపిస్తుండగా గాడిద దొంగతనం కేసు పెట్టడం దుర్మార్గమంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శుక్రవారం ట్వీట్‌ చేశారు. నిరుద్యోగ యువత కోసం ప్రశ్నిస్తే.. బుద్ధిలేని గాడిదకు కోపం ఎందుకని ప్రశ్నించారు. అక్రమ నిర్బంధాలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్‌తో పాటు కార్యకర్తలపై గాడిద దొంగతనం కేసు నమోదు చేయడంపై స్పందిస్తూ ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ట్వీట్‌కు అనుంబంధంగా రిమాండ్‌ డైరీ కాపీని, గాడిద ఫొటోను పోస్ట్‌ చేశారు.


కాగా.. బల్మూరు వెంకట్‌ను అర్థరాత్రి అరెస్టు చేయడం దుర్మార్గమని, అప్రజాస్వామికమని, విద్యార్థి నాయకుల పట్ల పోలీసుల వ్యవహారం చట్ట విరుద్ధంగా ఉందని మరో ట్వీట్‌ చేశారు. కేసులను వెంటనే ఎత్తివేసి వారిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉంటే బడ్జెట్‌ పత్రాన్ని చిత్తుకాగితం కింద మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని, బడ్జెట్‌ అంకెలు బారెడు.. విడుదల చేసిన నిధులు చూస్తే ఇంచెడుగా ఉన్నాయని ఇంకో ట్వీట్‌ చేశారు. మరోవైపు.. సీఎం కేసీఆర్‌ జన్మదినం ఈ నెల 17న నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చిన తనను ఎందుకు అరెస్టు చేశారంటూ రేవంత్‌ రెడ్డి జూబ్లీహిల్స్‌ పోలీసులకు లేఖ రాశారు. జూబ్లీహిల్స్‌ పీఎ్‌సలో కాకుండా గోల్కొండలో ఎందుకు ఉంచారని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు.


కాగా, సీఎం కేసీఆర్‌ను అవమానించేవిధంగా వ్యవహరించారన్న ఫిర్యాదుపై బల్మూరు వెంకట్‌ను జమ్మికుంట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత హుజూరాబాద్‌ కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. కాగా, శనివారం రేవంత్‌ మేడారం వెళ్లనున్నారు.  


అసోం సీఎంపై చర్యలు తీసుకోవాలి

రాహుల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎం హిమంతపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో.. రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అయితే ఈ ఫిర్యాదు తన పరిధిలోకి రాదని, జాతీయ మహిళా కమిషన్‌కు పంపుతానని సునీతారెడ్డి వారికి తెలిపారు.  


Updated Date - 2022-02-19T06:56:13+05:30 IST